- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కార్‌ను ఇరుకున పెట్టిన TSPSC.. ప్రవళిక సూసైడ్ ఇష్యూతో మరింత మైనస్!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఉక్కరిబిక్కిరి అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ప్రవళిక సూసైడ్ వ్యవహారం ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టింది. విపక్షాలన్నీ టీఎస్‌పీఎస్సీ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచాయి. ఆత్మహత్యలు వద్దని, బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించడమే మార్గమని కాంగ్రెస్, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చినా.. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల వాయిదా పేరుతో జాప్యం జరగడాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవళిక మృతిపై గులాబీ నేతల నుంచి సానుభూతి రాకపోగా పోలీసుల ద్వారా ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ ప్రకటనలు ఇప్పించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్‌కు మైనస్‌గా మారనున్నదనే టెన్షన్ ఆ పార్టీ నేతలకు పట్టుకున్నది. విద్యార్థులు, యూత్, నిరుద్యోగుల ఓటు బ్యాంకు ఎఫెక్టు ఏం ముప్పు తెస్తుందోనని బీఆర్ఎస్ లీడర్లు గాభరా పడుతున్నారు. సరిగ్గా ఎన్నికల టైమ్‌లో టీఎస్‌పీఎస్సీ వ్యవహారం అధికార పార్టీకి గుదిబండగా మారింది. దాని నిర్వహణలో జోక్యం చేసుకోలేక, దాని నిర్వాకాన్ని ఖండించలేక సతమతమవుతున్నది. నిరుద్యోగుల విషయంలో మొదటి నుంచీ బీఆర్ఎస్‌కు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రెండో టర్ములో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి హామీని అమలు చేయకపోవడం ఆ పార్టీకి నెగెటివ్ అయింది. దీని ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోడానికి అసెంబ్లీ వేదిక ద్వారా స్వయంగా సీఎం కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్లపై ప్రకటన చేశారు.. కానీ ఏడాదిన్నర గడిచినా ఒక్క పోస్టు కూడా భర్తీ కాకపోవడం ఇప్పుడు ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
నిరుద్యోగులు నమ్మతారా?
నిరుద్యోగ భృతిపై గత ఎన్నికల్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. దీంతో ఈ సారి ఇచ్చే హామీలను నిరుద్యోగులు నమ్ముతారా? అనే భయం ఆ పార్టీని వెంటాడుతున్నది. తెలంగాణ భవన్ వేదికగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్న కేసీఆర్.. మహిళలు, యువత, రైతులను ఆకట్టుకునేందుకు కొన్ని హామీలను, కొత్త పథకాలను ప్రస్తావించే చాన్స్ ఉన్నదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు నిరుద్యోగులు, విద్యార్థులు, యువత వేర్వేరు అంశాల విషయంలో బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి బీఆర్ఎస్ కొత్తగా ఇచ్చే హామీలకు వారు ఆకర్షితులవుతారా? అనే సందేహం ఆ పార్టీ అభ్యర్థుల్లో నెలకొన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. సిక్స్ గ్యారెంటీస్‌లో వారికి యువ వికాసం పేరుతో హామీని ఇచ్చింది. నిరుద్యోగ సమస్యపై జంగ్ సైరన్ సభనూ చేపట్టింది.
యూత్‌కు దగ్గరయ్యేలా కాంగ్రెస్ అడుగులు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ సమయంలో ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారీ నిరసనలూ జరిగాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, మొదటి నెలలోనే మెగా డీఎస్సీ అనౌన్స్‌మెంట్ ఉంటుందనే హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై యూత్‌లో నెలకొన్న అసంతృప్తిని కాంగ్రెస్ అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ప్రవళిక వ్యవహారంలోనూ రాత్రికి రాత్రే కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు ఆమె సూసైడ్ ఇష్యూను టేకప్ చేశారు. అంత్యక్రియల వరకూ బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు. ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ మొదలు రాష్ట్ర నేతలంతా ట్వీట్ ద్వారా ప్రవళిక కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ తీరుపై ధ్వజమెత్తారు. ప్రవళిక సూసైడ్ విషయంలో కాంగ్రెస్ మాత్రమే కాకుండా బీజేపీ, బీఎస్పీ, టీజేఎస్ తదితర పార్టీలన్నీ ఒక్కటి కావడంతో అధికార పార్టీ ఒంటరైంది. పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు సైతం బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చాయి. ప్రభుత్వ వ్యతిరేక వైఖరినే తీసుకున్నాయి. ఇదంతా బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. అంత్యక్రియల వరకూ ఆ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పలకరించకపోవడం, ఈ అంశంపై స్పందించకపోవడం.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, యూత్ ఆగ్రహానికి కారణమైంది.
సీన్ రివర్స్
జాబ్ నోటిఫికేషన్లు, పరీక్షలు, రిక్రూట్‌మెంట్ లాంటి అంశాలు పాలిటిక్స్ నుంచి యూత్‌ను డైవర్ట్ చేసి అనుకూలంగా మల్చుకోవచ్చని ఇంతకాలం బీఆర్ఎస్ ప్లాన్ చేసినా.. అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా రివర్స్ అయిందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఈ డ్యామేజీని కంట్రోల్ చేసుకోడానికి పోలీసుల ద్వారా చేసిన ప్రయత్నం సైతం బెడిసికొట్టింది. ప్రవళిక సూసైడ్ విషయంలో లవ్ ఎపైర్ ఇష్యూను తీసుకొచ్చినా.. అది బీఆర్ఎస్‌పై మరింత నెగెటివ్ ఏర్పడడానికి దారితీసింది. విద్యార్థిని సూసైడ్‌ను కూడా రాజకీయం చేస్తున్నదనే అపవాదును అధికార పార్టీ మూటగట్టుకున్నది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘సీఎం క్రికెట్ కప్’ పేరుతో యూత్‌కు దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత జాబ్ మేళా లాంటి ప్రోగ్రామ్‌లను అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించి మరో ఎటెంప్ట్ చేసింది. కానీ ఇవేవీ ఆ పార్టీకి అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేదని తేలిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారే కావడంతో కచ్చితంగా ఓటింగ్ కోసం వెళ్తారని, యాంటీగానే వ్యవహరిస్తారన్న అనుమానం బీఆర్ఎస్ నేతల్లో బలపడుతున్నది. దీన్ని పూడ్చుకోడానికి అధికార పార్టీ పెద్దలు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.