- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ.. నేడే చివరి కమిటీ భేటీ!
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల షెడ్యూల్ రెండుమూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హస్తం పార్టీ అభ్యర్థుల జాబితా కోసం ఆశావహుల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇప్పటివరకు రెండు సార్లు భేటీ అయిన స్టేట్ స్క్రీనింగ్ కమిటీ చివరి సమావేశాన్ని ఢిల్లీలో ఆదివారం నిర్వహిస్తున్నది. దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈ జాబితాపై పార్టీ సెంట్రల్ ఎలక్షన్ టీమ్ పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. ఆ తర్వాత లిస్టును లాంఛనంగా ఏఐసీసీ ఢిల్లీ నుంచి విడుదల చేస్తుంది. వారం రోజుల్లో ఈ సస్పెన్స్ తొలగిపోతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు.
బుజ్జగింపుల కోసం రంగంలోకి సీనియర్లు
అసంతృప్తుల బెంగ తప్పదని గ్రహించిన ఏఐసీసీ వారిని బుజ్జగించడానికి పటిష్టమైన మెకానిజాన్ని రూపొందించింది. కేవలం సర్దిచెప్పడం కోసమే పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నారు. దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ తదితరులతో పాటు జైరాం రమేశ్, చివరి దశలో చిదంబరం లాంటి నేతలు రంగంలోకి దిగనున్నారు. లిస్టును రిలీజ్ చేయడానికి ముందే వీరు ఒక్కరొక్కరుగా రాష్ట్రానికి వచ్చి బుజ్జగింపులు జరిపి అసంతృప్తికి చెక్ పెట్టే వ్యూహాన్ని అవలంబించనున్నారు. పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేసి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తే ఆ తర్వాత వారిని సంతృప్తిపర్చేలా పదవులు ఇస్తామని భరోసా కల్పించనున్నారు.
గెలుపే ప్రధాన ప్రామాణికంగా తీసుకున్నందున ఎందుకు టికెట్ ఇవ్వడం లేదన్నది సీనియర్ నేతలు అసంతృప్త నేతలకు నచ్చజెప్పనున్నారు. కర్ణాటకలో కలిసికట్టుగా పనిచేసినందున వచ్చిన బంపర్ ఫలితాన్ని వివరించనున్నారు. ఇప్పటికే దాదాపు 35-40 స్థానాల్లో సింగిల్ క్యాండిడేట్ ఫైనల్ అయ్యారు. మరో 40-45 స్థానాల్లో ఇద్దరు చొప్పున ఉన్నట్లు గత స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. వీటిని ఫిల్టర్ చేసేందుకు చివరిసారిగా ఢిల్లీలోని వార్ రూమ్‌లో ఆదివారం కసరత్తు చేయనున్నారు. సాయంత్రం తర్వాత జాబితా దాదాపు కొలిక్కి రావచ్చనే కాన్ఫిడెన్స్ ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది.
పైరవీల కోసం ఢిల్లీకి ఆశావహులు
తొలుత విడతల వారీగా లిస్టులు విడుదలవుతాయనే వార్తలు వినిపించాయి. కానీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో దాదాపు వందకు పైగా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను మొదటి లిస్టులోనే అనౌన్స్ చేసే అవకాశమున్నట్లు ఏఐసీసీ నేతల నుంచి వస్తున్న సమాచారం. ఏక కాలంలో బీసీలు, మహిళలు, కమ్మ సామాజికవర్గం నుంచి ఏఐసీసీపై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఘర్షణలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. బీసీలకు కనీసంగా 29 నుంచి 30 స్థానాలు ఉంటాయని తెలిసింది.
లిస్టు విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచారం కోసం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా తెలంగాణకు వస్తున్నందున వారి ద్వారా కూడా కన్విన్స్ చేయించే ప్రయత్నాలు కొనసాగనున్నాయి. జాబితా తయారీ తుది దశకు చేరుకున్నందున ఢిల్లీలోనే సీనియర్ నేతలతో పైరవీలు చేయించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత స్క్రీనింగ్ కమిటీ సమావేశం సందర్భంగా చేసిన ప్రయత్నాన్నే ఇప్పుడు చివరి సమావేశం జరుగుతున్నప్పుడూ కంటిన్యూ చేస్తున్నారు. ఈ సమావేశంలో పేర్లు షార్ట్ లిస్టు అయిన తర్వాత పార్టీ సెంట్రల్ ఎలక్షన్ టీమ్ మీటింగ్‌లో పెద్దగా మార్పులుండవనే ఉద్దేశంతో రాష్ట్ర నేతలంతా ఢిల్లీ బాటపట్టారు.