వ్యవసాయానికి 24 గంటల కరెంటు.. ఆడపిల్లకి తులం బంగారం, లక్ష సాయం

by GSrikanth |
వ్యవసాయానికి 24 గంటల కరెంటు.. ఆడపిల్లకి తులం బంగారం, లక్ష సాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి రాగానే వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ను అందజేయనున్నారు. దీంతో పాటు రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీతో పాటు మూడు లక్షల పరిమితితో వడ్డిలేని రుణాలను కూడా ఇవ్వనున్నారు. దీంతో పాటు అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 37 ప్రధాన అంశాల్లో ఆరు గ్యారంటీలకు అదనంగా 66 హామీలను పార్టీ ప్రకటించింది. ఆడపిల్ల పెళ్లికి ఇందిరమ్మ కానుక పేరిట రూ. లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్డ్ షాపులను పూర్తి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకుపూర్తి స్థాయిలో ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమర వీరుల తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు.

కాళేశ్వరంపై ఎంక్వైరీ

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అంతేగాక ఇక రాష్ట్రంలో రైతులు, పేదలకు సమస్యలు తీసుకువచ్చిన ధరణి ని తొలగించి సరికొత్త టెక్నాలజీ తో ‘భూ మాత’ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేగాక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి భూ హక్కుల సమస్యలను పరిష్కరించనున్నామని పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

కీలక హామీలు

– తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయడం.. 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు.

– ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీలను రద్దు.

– మెగా డీఎస్సీ ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ.

– వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ.

– ప్రతి విద్యార్థి, విద్యార్థినులకు ఫ్రీ (ఇంటర్నెట్) వైఫై సౌకర్యం.

– విద్యారంగానికి బడ్జెట్ లో ప్రస్తుత వాటా 6% నుండి 15% వరకు పెంపు.

– మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాన్ని రూ.10 వేలకు పెంపు.

– మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలలను మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభం.

– బాసర ట్రిపుల్ ఐటీ (IIIT) తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటీ లను ఏర్పాటు.

– ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచడంతోపాటు మోకాలు సర్జరీని చేర్చడం.

– భూ సంస్కరణలతో పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై వారికి పూర్తి హక్కులు.

–మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతోపాటు విధులు, నిధులు, నిర్వహణ భాద్యతలను అప్పగించడం.

– గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు రూ.1500. మాజీ సర్పంచ్, ఎంపీటీసీ , జడ్ పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్.

– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ పెండింగ్ లోని మూడు డీఏలను తక్షణం చెల్లింపు.

– ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానం రద్దుతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ (ఓపీసీ) విధానం అమలు. –ప్రభుత్వ ఉద్యోగులు.. ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్ సీ ప్రకటించి 6 నెలల్లోపు అమలు.

– ఆర్టీసీ సిబ్బందికి రెండు పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లింపు.

– ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సహాయం అందచేస్తాం.

–పెండింగ్​లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50% శాతం రాయితీతో వన్ టైమ్ సెటిల్​మెంట్.

– ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు.

– బీసీల ‘కుల గణన’ చేసి.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.

– సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతో 5% రిజర్వేషన్లు.

– ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట 'బీసీ భవన్' ఏర్పాటు.

– జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​గా పేరు మార్చడం.

– అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులను కేటాయింపు.

– వెనుకబడిన తరగతులకు (బీసి) సబ్ ప్లాన్ అమలు.

– ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు.

– సరిపడా నిధులతో మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు.

– సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేయడం.

– సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించదు.

– బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్ఐ పరిధిలోకి తేవడం.

– ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ.10 లక్షల వరకు, ఎక్స్రేషియా పెంపు.

– యాదవ, కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రూ.2 లక్షల గొర్రెల పెంపకం కోసం అందచేయడం.

– రాజస్థాన్ తరహాలో అసంఘిటిత కార్మికులు, ఉదా: భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో (Gig & plat form) వారికి సామాజిక భద్రత కల్పన.

– స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితి రూ.10 లక్షల వరకు పెంపు.

– పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన "బంగారు తల్లి” పథకం పునరుద్ధరించడం.

– 18 సంవత్సరాలు పైబడి, చదువుకొనే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేయడం.

– అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ఓల్డ్ ఏజ్ హెూమ్స్’ ఏర్పాటు.

– సుదీర్ఘ కాలంగా పెండింగ్​లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడం.

– మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షల సాయం.

– రాష్ట్రంలో వున్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం.

– ఇకపై తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా.

– గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు.

– మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా.

– దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ.6 వేలకు పెంపు.

– ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్​ ఏర్పాటు.

– హెూమ్ గార్డుల వేతన సవరణలతోపాటూ వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడం.

– నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం.. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు.

– అంగన్వాడీ టీచర్లకు వేతనాన్ని రూ.18 వేలకు పెంచడం.. ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పించడం.

– 50 ఏండ్లు దాటిన జానపద కళాకారులకు నెలకు రూ.3 వే లు పెన్షన్.

– ఉస్మానియా ఆస్పత్రిని హెరిటేజ్ గా గుర్తించడంతోపాటు పూర్తిస్థాయిలో ఆధునీకరణ.

– ఎల్బీ నగర్ - ఆరాంఘర్ - మెహదీపట్నం - బీహెచ్ఈఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాల నిర్మాణం.

–హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దడంతోపాటు నాలాల ఆధునీకరణ.

– రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలను పూర్తిగా రద్దు చేయడం.

– నగర పాలక మున్సిపాలిటీ కేంద్రాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు.

కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు

(అభయ హస్తం)

1. మహాలక్ష్మి:

= మహిళలకు ప్రతి నెల రూ. 2500

=రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌

= ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

2. రైతు భరోసా ప్రతి ఏటా :

=రైతులు, కౌలు రైతులకూ ఎకరానికి రూ. 15 వేలు

=వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు

=వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌

3. గృహ జ్యోతి :

= ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

4. ఇందిరమ్మ ఇండ్లు :

=ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు

= తెలంగాణ ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం.

5. యువ వికాసం :

=విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.

=ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌

6. చేయూత :

= ప్రతినెల రూ.4 వేలు పింఛను (పెన్షన్‌)

=రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా

Advertisement

Next Story

Most Viewed