స్థానిక సంస్థలు, ‘సింగరేణి’ ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం?

by GSrikanth |
స్థానిక సంస్థలు, ‘సింగరేణి’ ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం?
X

షెడ్యూలు ప్రకారం జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకూ స్థానిక సంస్థలు, ‘సింగరేణి’ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఖాళీగా ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలకు వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలంటూ ఆరు నెలల క్రితమే హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ సర్కారు నుంచి ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. మరోవైపు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వచ్చే నెల 28న నిర్వహించేలా లేబర్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఇది కూడా వాయిదా పడే అవకాశమున్నది. అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో స్థానిక సంస్థలు, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని అధికార పార్టీ భావిస్తున్నది. దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ వీటిని నిర్వహించకపోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. అయితే ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారనేది నిర్దిష్టంగా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇది ఇలా కొనసాగుతుండగానే సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఎన్నికల నిర్వహణ అంశం తెరమీదకు వచ్చింది. డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఈ ప్రభావం దాదాపు 13 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందనేది బీఆర్ఎస్ ఆందోళన.

ఇబ్బందులు ఎదురవుతాయని..

సింగరేణిలో 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లలో తొమ్మిది అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేజిక్కించుకున్నది. రెండు డివిజన్లను వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల అలయెన్స్ కైవసం చేసుకున్నది. ఈసారి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు పైచేయి సాధిస్తాయనే అనుమానం బీఆర్ఎస్‌ ను కలవరపెడుతున్నది. ఈ కారణంగా సింగరేణి ఎన్నికలను అక్టోబరు 28న నిర్వహించేలా లేబర్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వెలువడినా వివిధ కారణాలతో వాయిదా వేయించేలా బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. ఈ ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడితే ఇబ్బందులు ఎదురవుతాయన్నది బీఆర్ఎస్ అభిప్రాయం.

సింగరేణి బెల్టులో 2017లో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది డివిజన్లలో బీఆర్ఎస్‌కు అనుబంధ టీబీజీకేఎస్ గెలిచినా ఆ తర్వాత 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, ములుగు, మంథని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందగా సత్తుపల్లిలో తెలుగుదేశం గెలిచింది. చివరకు కాంగ్రెస్, తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా (ములుగు మినహా) బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈసారి కాంగ్రెస్ వేవ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నదనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు జరిగితే గతంకంటే భిన్నమైన ప్రతికూల ఫలితాలు వస్తాయన్నది బీఆర్ఎస్ ఆందోళన. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయ్యేంతవరకూ సింగరేణి ఎన్నికలు జరగకపోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నది.

తరచూ వాయిదా..

సింగరేణి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం 2019లో జరగాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. తెలంగాణ కోల్ మైన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీకి అనుబంధం) తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ఈ నెల 27న జరిగిన విచారణ సందర్భంగా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ లేబర్ కమిషనర్.. ఒక్క రోజు వ్యవధిలోనే దీనిపై స్టడీ చేసి అక్టోబరు 28న ఎన్నికలు నిర్వహించాలని, అక్టోబరు 6న నామినేషన్ల పర్వం ప్రారంభమై 9న ముగుస్తుందని, 10వ తేదీన ఎన్నికల చిహ్నాల అలాట్‌మెంట్ కంప్లీట్ అవుతుందని పేర్కొన్నారు.

ఈ ఆదేశాలపై గుర్తింపు పొందిన బొగ్గుగని కార్మిక సంఘం సహా మరికొన్ని సంఘాలు ఎన్నికలను వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కసరత్తు జరుగుతున్న సమయంలో ఆరు జిల్లాల పరిధిలోని కలెక్టర్లు వాటి నిర్వహణలో ఉన్నందున సింగరేణి ఎన్నికల కోసం సమయం వెచ్చించలేరని హైకోర్టులో విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ వాదించారు. నిర్దిష్ట గడువులోగా నిర్వహించాలన్న నిబంధన ఏమీ లేదనే అంశాన్నీ నొక్కిచెప్పారు. దీంతో సింగరేణి ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే అంశం దాదాపుగా తేలిపోయింది. అయినా డిప్యూటీ లేబర్ కమిషనర్ డేట్ ఫిక్స్ చేయడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించి వాయిదా కోసం ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.

హైకోర్టు ఆదేశించినా..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా వివాదంగానే ఉండిపోయింది. సర్పంచ్, ఉప సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్ల పోస్టులకు ఎన్నికలు నిర్వహించడంపై హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదన సందర్భంగా వీలైనంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వ న్యాయవాదికి జూలై నెలలోనే ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. సిద్ధంగానే ఉన్నామంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడకపోవడంతో ఎన్నికల నిర్వహణ పెండింగ్‌లో పడింది. రాష్ట్రంలో 220 సర్పంచ్, 344 ఉప సర్పంచ్, 4 జెడ్పీటీసీ, 94 ఎంపీటీసీ, 5,364 వార్డుమెంబర్ పోస్టులను (మొత్తం 6,026) భర్తీ చేయడానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నది.

ఈ పోస్టులు ఖాళీగా ఉన్నందున ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని, అభివృద్ధి పనులు కూడా పెండింగ్‌లో పడ్డాయని రాపోలు భాస్కర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిగిన అనంతరం చివరకు జూలై చివరి వారంలో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన బెంచ్... ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టత ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ తరపున హాజరైన న్యాయవాదిని కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాది విద్యాసాగర్ ఈ విచారణ సందర్భంగా వాదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు అందినా వెంటనే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడంతో ఎన్నికల నిర్వహణ పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story