- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గెలిస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే బర్రెలు తినేవాళ్ళు పోయి.. ఏనుగులు తినేవారు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ‘మీట్ ది ప్రెస్’లో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల బతుకులు బాగుపడతాయని అనుకున్నారని, కానీ అనుకున్న లక్ష్యాలు అలాగే మిగిలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, దళిత ముఖ్యమంత్రి అని ప్రమాణ స్వీకారానికి ముందే కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా వారి కార్యాలయానికి వెళ్తారని, కానీ కేసీఆర్ మాత్రం సచివాలయానికి వెళ్లరని విమర్శలు చేశారు.
ఎమ్మెల్యేలు బస్తీల్లో, ప్రజాక్షేత్రంలో తిరగరని, ప్రజల ఇబ్బందులు కూడా పట్టించుకోరని మండిపడ్డారు. దళిత సీఎం నుంచి మొదలు మొన్నటి దళితబంధు వరకు ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. పదేళ్లుగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, 17 పరీక్షలు వాయిదా పడ్డాయని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సూపర్ ఇంజినీర్‌గా మారిపోయి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని, నిపుణులు చెప్పినా వినిపించుకోలేదని, తీరా గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిది నిజాం, నియంతృత్వ, దుర్మార్గపు ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.
భద్రాచలంలో రామనవమికి ప్రభుత్వం తరపున ప్రతిఏటా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తోందని, కానీ కేసీఆర్ ఆయన మనవడిని పంపించారని, ఇది దేనికి సంకేతమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థను కూడా కేసీఆర్ ఛిద్రం చేశారని మండిపడ్డారు. పూర్తిగా డబ్బు, అధికార దుర్వినియోగం చేసే, వంశపారపర్య రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పాలని, కొడుకు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారన్నారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే కేవలం 15 నిమిషాల్లో దాదాపు 8 వేలమంది యువత వచ్చారంటే ప్రభుత్వంపై ఎంత ఆక్రోశంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతారని, ఓటర్లను కొనొచ్చని ఆయన భావిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. అలాంటి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న పరిస్థితే కర్ణాటకలో ఉందన్నారు. 5 రాష్ర్టాల ఎన్నికల కోసం కాంగ్రెస్ స్పెషల్ ట్యాక్స్ వసూలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అమలుకు నోచుకోలేని హామీలు ఇస్తున్నారని విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలని, ఆర్థిక వ్యవస్థ ఏమైనా పర్వాలేదనుకుంటున్నారన్నారు.
బీజేపీ ఇప్పటి వరకు 88 మందిని అభ్యర్థులుగా ప్రకటించిందని, మిగతా సీట్లలో పలువురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రికి కొన్ని సీట్లు ఫైనల్ అవుతాయని, మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. జనసేన.. ఎన్డీఏలో భాగస్వామ్యమని, అందుకే ఆ పార్టీతో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు జనసేన మద్దతు ఇచ్చిందన్నారు. తాండూరు, శేరిలింగంపల్లిపై పంచాయితీ జరుగుతోందనేది అబద్ధమని చెప్పారు. కేసీఆర్‌ను దింపాలంటే ప్రతి ఒక్కరి సహకారం కావాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా పేలుళ్లు సంభవించేవని, బీజేపీ వచ్చాక ఉగ్రవాదాన్ని అణిచివేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రొడక్ట్ అని విమర్శించారు. ఆ పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరతారని, బీఆర్ఎస్ కొనే పార్టీ అయితే.. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అని విమర్శలు చేశారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ సంసారం చేస్తున్నారని, మానభంగాలు, దోపిడీలు చేసిన పార్టీ మజ్లిస్ అని, అలాంటి పార్టీలతో కలిసి వెళ్లేవారితో తామెందుకు కలిసి వెళ్తామని ప్రశ్నించారు.
దేశంలో పాకిస్థాన్ జెండా ఎగరేయాలని మజ్లీస్ చూస్తోందని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ గతంలో కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీఆర్ఎస్‌తో దోస్తీ చేస్తోందని, ఓటు అనే ప్రజా తీర్పుతో వారికి సమాధానం చెప్పాలన్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టే పార్టీ పోటీ చేయొద్దని ఆదేశించిందని, ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపించాలని భావించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అందుకే తాను పోటీ చేయడం లేదని తెలిపారు. విస్తృత ప్రచారం చేసే బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు. అంతేతప్పా.. బీఆర్ఎస్‌కు భయపడి పోటీ చేయలేదనేది అబద్ధమన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌ను మూడుసార్లు ఓడించినట్లు ఆయన చెప్పారు.