ప్రచార ఆర్భాటం కోసం రూ.3 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు

by GSrikanth |
ప్రచార ఆర్భాటం కోసం రూ.3 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గడచిన తొమ్మిదిన్నరేళ్లలో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తేలింది. సంక్షేమానికి చిరునామా తెలంగాణ అంటూ గతేడాది ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ, ప్రాంతీయ పత్రికలకు కూడా భారీ స్థాయిలో యాడ్‌లను ఇచ్చి సొంత ప్రచారం చేసుకున్నది. సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు వచ్చిన రిప్లైతో పాటు బడ్జెట్ గణాంకాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రం ఏర్పడింది మొదలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల వరకు ఐ అండ్ పీఆర్ డిపార్టుమెంటు ద్వారా పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 3,080.23 కోట్లను వెచ్చించినట్లు తేలింది.

ఈ ఏడాది ఇప్పటికే వెయ్యి కోట్లు..

గరిష్టంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 498.69 కోట్లు, 2018 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రూ. 448.51 కోట్ల మేర ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వెయ్యి కోట్లను కేవలం ప్రచారం కోసం కేటాయించింది. ఇంత భారీస్థాయిలో కేటాయింపులు చేయడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి విచక్షణ ప్రకారం ఖర్చు చేసే స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఊహకు అందని తీరులో ఏకంగా రూ. 10 వేల కోట్లను కేటాయించడం కూడా చర్చకు దారితీసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకర్షించడానికి, ప్రసార మాధ్యమాలకు పబ్లిసిటీ రూపంలో భారీగా ఖర్చు చేయడానికి ఇంత భారీగా కేటాయించినట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఓపెన్‌గా చెప్పారు.

దశాబ్ది వేడుకలకూ భారీగానే..

ఇందుకు బలం చేకూర్చే విధంగానే దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో 21 రోజుల పాటు నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు భారీ స్థాయిలో ఖర్చు చేసింది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన సందర్భంగా 2017లో ఐ అండ్ పీఆర్ డిపార్టుమెంటు తరపున భారీగా ఖర్చు చేసినట్లు తేలింది. ఆ ఏడాది మొత్తం ఖర్చు సుమారు రూ. 335 కోట్లు ఖర్చు కాగా ఇందులో ఇవాంకా పర్యటన సందర్భంగా పబ్లిసిటీ కోసమే దాదాపు రూ. 8.50 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్, ఔట్ డోర్ పబ్లిసిటీ కోసం ప్రభుత్వం ఎంతెంత ఖర్చు చేసిందో ఆర్టీఐ ద్వారా కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని సేకరించింది.

ప్రజల్లోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్..

ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడానికే ఇతర రాష్ట్రాల పత్రికలకు యాడ్స్ ఇచ్చిందని, దశాబ్ది వేడుకల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేసిందని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు పబ్లిసిటీ కోసం ఇంత భారీగా ఖర్చు చేస్తూనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే పరీక్షలకు బయోమెట్రిక్ విధానాన్ని వాడడానికి డబ్బులు లేవని కోర్టుకు చెప్పడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని విస్తృతంగా యూత్‌లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మొత్తం పదేండ్ల కాలంలో ప్రచారం కోసం ఐ అండ్ పీఆర్ ద్వారా సుమారు రూ. 3,080 కోట్లను ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు లెక్కలను వివిధ మార్గాల ద్వారా సిద్ధం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed