- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఎఫెక్ట్.. స్కూళ్లలో వండేందుకు పాత్రలు కరువు!
దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అమలుపై ప్రభుత్వం నజర్ పెట్టింది. పకడ్బందీగా అమలు చేసి ఎన్నికల ప్రచారంలో మైలేజ్ సాధించాలని చూస్తోంది. సర్కారు ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ఈ నెల 6వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్‌లో ప్రారంభించి 12వ తేదీ వరకు అమలు చేసింది. కాగా సీఎం ఆదేశాల మేరకు దసరా పండుగ అనంతరం ఈ పథకాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి.
అయితే, గురువారం నుంచి మండలానికి 5 లేదా లోపు బడుల్లో మాత్రమే సీఎం అల్పాహార పథకం అమలు కానుందని సమాచారం. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ స్కీమ్ అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారులతో తాజాగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 26వ తేదీ నుంచి వీలైనన్ని ఎక్కువ పాఠశాలల్లో ప్రారంభించాలని ఆర్‌జేడీలను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు డీఈఓలతో చర్చించగా క్షేత్రస్థాయిలో ఉన్న పలు సమస్యలను ప్రస్తావించారు.
వండేందుకు పాత్రలు కరువు..
చాలామటుకు పాఠశాలల్లో అల్పాహారం వండేందుకు పాత్రలు లేవు. దీంతోపాటు మధ్యాహ్న భోజనం వండే కార్మికులే ఈ బ్రేక్ ఫాస్ట్ ను వండుతున్నారు. ఇందుకోసం వారికి అదనపు వేతనం ప్రకటించలేదని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరు రోజులు వండి పెట్టినందుకు డబ్బులు ఇవ్వలేదని తదితర సమస్యలను వంట కార్మికులు చెప్తున్నారని దాదాపు అందరు డీఈఓలు ఆర్జేడీలకు వివరించినట్టు తెలిసింది. మొత్తానికి గురువారం ప్రతి మండలంలో గరిష్ఠంగా 5 పాఠశాలల్లోనే ఈ స్కీమ్ ను ప్రారంభించారని తెలిసింది.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను నవంబరు 1 నుంచి దశలవారీగా అన్నిచోట్లా అమలు చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈ స్కీమ్ అమలులో ఉన్న ఇబ్బందులను అధిగమించడంపై ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ స్కీమ్ ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అమలు చేశామని ప్రజలకు వివరించి రాజకీయంగా మైలేజ్ సంపాదించాలనే ప్లాన్ వేసింది. ఈ ప్లాన్‌లో బీఆర్ఎస్ సర్కార్ ఏ మేరకు పైచేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే.