- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టఫ్ సెగ్మెంట్లపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి కీలక నేతలు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పవర్‌లోకి రావడం ఖాయమని స్పష్టమైన అంచనాకు వచ్చిన కాంగ్రెస్.. ఏయే స్థానాల్లో పార్టీ తాజా స్థితి ఎలా ఉన్నదో సమీక్ష మొదలైంది. టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేసుకున్నది. పైచేయి సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ ఇంకా బలం పుంజుకోవాల్సి ఉన్నదో అక్కడ మకాం వేసిన పార్టీ అబ్జర్వర్ల ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ తెప్పించుకుంటున్నారు. గాంధీ భవన్‌లోని వార్ రూమ్ నుంచి పలువురితో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించిన కేసీ వేణుగోపాల్ నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని అసెంబ్లీ సీట్లలోని పరిస్థితిపై రివ్యూ చేశారు.
తెలంగాణలో పర్యటించిన రెండు రోజుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మరింత బలపడాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ తరఫున ఇప్పటికే అక్కడ తిరుగుతున్న పార్టీ అబ్జర్వర్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. దక్షిణ తెలంగాణలో దాదాపుగా సంపూర్ణమైన పట్టు సాధించినా మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, సిక్స్ గ్యారెంటీస్‌తో పాటు మేనిఫెస్టోలోని అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఇప్పుడున్న పట్టును మరింత పెంచుకోవాలని అభ్యర్థులకు, అబ్జర్వర్లకు సూచించారు. పార్టీ కేడర్‌ను ప్రజల్లోకి పంపించాలని నొక్కిచెప్పారు.
సర్వేల ఆధారంగా సమీక్ష
పార్టీ తరఫున చాలాకాలంగా సర్వే చేస్తున్న సునీల్ కనుగోలు టీమ్ ఇచ్చిన రిపోర్టుతో పాటు ఇంటర్నల్‌గా చేయించిన ఫ్లాష్ సర్వేలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని మరింతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని పార్టీ లీడర్లకు కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఇప్పటికే ఒక వేవ్ జెనరేట్ అయిందనే అభిప్రాయంతో అభ్యర్థులు ప్రచార తీవ్రతను తగ్గించారని, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ లోకల్ కేడర్ జనంలోకి వెళ్లడంలేదని పార్టీ అబ్జర్వర్లకు వివరించారు. ఇప్పటివరకూ జరిగిన ఉదాసీనత ఎలా ఉన్నా రానున్న ఐదు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవాలని, ప్రత్యర్థికంటే అడ్వాన్సులో ఉన్నామనే కాన్ఫిడెన్స్ రావాలని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు కష్టపడినా ఈ ఐదు రోజులు మాత్రం విశ్రాంతి లేకుండా జనంలోనే గడపాలని నొక్కిచెప్పారు.
ఏఐసీసీ తరఫున అదనంగా సీనియర్ నేతలను గుర్తించి అసెంబ్లీ సెగ్మెంట్లకు పంపడంతో పాటు అభ్యర్థుల్ని, పార్టీ కేడర్‌ను పరుగెత్తించేలా, ప్రజల్లో పార్టీ టాక్ మరింత ఇంప్రూవ్ అయ్యేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను పార్టీ నాయకత్వం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ ప్రతీరోజు సెగ్మెంట్లవారీగా అభ్యర్థులతో, కోఆర్డినేటర్లతో మాట్లాడుతూ ఉన్నా ఐదు రోజుల్ని కీలకమైనదిగా భావించి మరింత కష్టపడేలా ఏఐసీసీ నేరుగా రంగంలోకి దిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రతి రోజు నాలుగైదు సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్నందున క్యాంపెయిన్ కమిటీ మొదలు వివిధ కమిటీల మధ్య మరింత సమన్వయంతో వీక్‌గా ఉన్న స్థానాల్లో పరిస్థితిని మెరుగుపర్చుకోవడమే తక్షణ కర్తవ్యంగా స్పీడప్ చేయాలని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
సొంత పార్టీ నుంచి పెరగాల్సిన సహకారం
ప్రస్తుతం పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో నిర్దిష్టమైన కారణాలు ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ గుర్తించారు. దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నేతలను కాదని ఇటీవల చేరినవారికి టికెట్లు ఇవ్వడంతో పాత నేతలు, కేడర్ నుంచి ఆశించిన సహకారం అందడం లేదనే నిర్ధారణకు వచ్చారు. టికెట్ రాలేదనే అసంతృప్తి, అసమ్మతి ఉన్నదని ముందుగానే గుర్తించిన ఏఐసీసీ నాయకత్వం కన్విన్స్ చేయడానికి జానారెడ్డి నేతృత్వంలో ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఒక మేరకు సక్సెస్ అయింది. అసంతృప్తి నేతలు దారిలోకి వచ్చినా వారి కింద పనిచేసే శ్రేణుల్లో ఇంకా ఆ మేరకు సహకారం అందడం లేదన్న స్పష్టతకు వచ్చారు. ఇప్పుడు వారితో రోజువారీ సమావేశాలు ఏర్పాటు చేసి తగిన భరోసా కల్పించి ప్రజల్లో పార్టీ గెలుస్తుందనే విశ్వాసాన్ని మరింతగా పెంచాలని సూచించారు.
దిగువస్థాయి లీడర్ల మధ్య పరస్పరం నమ్మకం లేకపోవడం వల్ల సహకారంలో తేడా వస్తున్నదని, అందరూ పార్టీ కోసం కష్టపడుతున్నందున అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత, పదవులు, ప్రోత్సాహం ఉంటుందనే కాన్ఫిడెన్స్ వారిలో కలిగించేలా ఏఐసీసీ తరఫున నియోజకవర్గాల్లో పనిచేస్తున్న అబ్జర్వర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. కన్విన్స్ చేసిన తర్వాత అంతా సద్దుమణిగినట్లు కనిపించినా పూర్తి స్థాయిలో కూల్ కాలేదని, దీన్ని భర్తీ చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మరో రెండు రోజుల తర్వాత వచ్చి ప్రచారం ముగిసేంత వరకు (ఈ నెల 28 వరకు) ఇక్కడే మకాం వేయనున్నారు. ఏఐసీసీ, పీసీసీ లీడర్ల సమన్వయంతో వెలితిగా ఉండే సెగ్మెంట్లలో పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్ యాక్షన్ ప్లాన్ అమలుచేయనున్నారు.