కేసీఆర్‌ను అష్టదిగ్భంధనం చేసేలా కాంగ్రెస్ ప్లాన్..!

by GSrikanth |
కేసీఆర్‌ను అష్టదిగ్భంధనం చేసేలా కాంగ్రెస్ ప్లాన్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు వ్యక్తిగతంగా కేసీఆర్‌ను ఓడించాలనే సంకల్పంతో హస్తం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో తన సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్‌ను అష్టదిగ్భంధనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొడంగల్ తో పాటు కామారెడ్డిలోను రేవంత్ పోటీ చేస్తారని.. ఈ నెల 6వ తేదీన కొడంగల్, ఈ నెల 8న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కామారెడ్డి బరిలో ఉంటారని భావించిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇవాళ నిజామాబాద్ జిల్లా నేతలతో గాంధీ భవన్ లో మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలకు థాక్రే అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ను కట్టడి చేసే వ్యూహం:

బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్ ఈ నెల 9న తేదీని గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అయితే మొదటి నుంచి కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు కామారెడ్డిలో బలమైన నేత రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పర్యటనలు తగ్గించడంతో పాటు గులాబీ బాస్ పై ఒత్తిడి పెంచాలనే స్ట్రాటజిస్టుల సూచనలతోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ కు అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. మరో వైపు కామారెడ్డి బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డిని పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలు సాధించబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed