తెలంగాణలో బీజేపీతో పవన్ కల్యాణ్‌కు పెను ముప్పు!

by GSrikanth |
తెలంగాణలో బీజేపీతో పవన్ కల్యాణ్‌కు పెను ముప్పు!
X

జనసేనాని పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. తెలంగాణలో తమతో జత కట్టాలని కమలనాథులు ప్రతిపాదించారు. కలిసి పోటీ చేయడమా.. లేక మద్దతుకే పరిమితం కావడమా అనేది తేల్చలేదు. తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తామని పవన్ ఇప్పటికే​ ప్రకటించారు. బీజేపీతో పొత్తు కలిసినా.. కలవకున్నా పోటీ చేసిన స్థానాల్లో కనీసం సగమైనా గెలవాలి. లేకుంటే తర్వాత ఏపీ ఎన్నికల్లో పార్టీ మీద ప్రభావంపడే అవకాశముంది. గత ఎన్నికల్లో మాదిరి అక్కడ ఒకటీ అరా సీట్లకు పరిమితమైనా.. అసలు ఒక్కటీ రాకున్నా రాష్ట్రంలో పార్టీ బలంపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితులను ఊహించినందునే టీడీపీ అక్కడ పోటీ చేయాలా వద్దా అనే ఊగిసలాటలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, ఏపీ బ్యూరో: వచ్చే నెలాఖరున జరిగే తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో పవన్ ముందుగా ప్రకటించారు. తర్వాత బీజేపీతో కలిసి ముందుకు సాగాలని ఆ పార్టీ నేతలు కిషన్​రెడ్డి, లక్ష్మణ్ ప్రతిపాదించారు. దీనిపై పార్టీలో చర్చించి తగు నిర్ణయం వెల్లడిస్తానని పవన్​చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఐదారు సీట్లకే పరిమితమవుతుందని జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రజల్లో తనకున్న ఇమేజ్‌ను పవన్ తగ్గించుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. జనసేన పోటీ చేసిన స్థానాల్లో ఒకటీ అరా అక్కడ గెల్చుకున్నా.. లేకున్నా ఇంతేనా పవర్​స్టార్​బలగమంటూ రాష్ట్రంలో చర్చకు దారితీస్తుంది. టీడీపీతో పొత్తులో ఎక్కువ స్థానాలను బేరమాడేందుకు ఇబ్బందిగా మారే అవకాశముంది.

టీడీపీ ఒప్పుకుంటుందా..?

తెలంగాణలో కమలనాథులతో పొత్తు పెట్టుకున్నాక ఇక్కడ కూడా తప్పనిసరి కావొచ్చు. అందుకు టీడీపీ అంగీకరిస్తుందా అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్న. చంద్రబాబును జైల్లో పెట్టడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. కాషాయ పార్టీ అంటేనే తమ్ముళ్లు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి దశలో బీజేపీతో మైత్రిని పవన్​ ప్రతిపాదిస్తే టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది చర్చకు వస్తోంది. జనసేన టీడీపీతో ముందుకెళ్తే కొన్ని సీట్లయినా సాధించుకుంటుంది. అదే కేవలం బీజేపీతో కలిస్తే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం కావొచ్చు. దేశమంతా బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్న సమయంలో పవన్​ కల్యాణ్​ తీసుకునే నిర్ణయంపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకుల అంచనా.

బీజేపీతో కలిస్తే భంగపాటే..

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడితే ఓటమి తప్పదని ఇటీవల శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. ముస్లిం, క్రిస్టియన్​ ఓటర్లను శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుందనే భావనతో చంద్రబాబు బీజేపీతో చెలిమి గురించి తటపటాయిస్తున్నారు. కాషాయ పార్టీ మీద రాష్ట్ర ప్రజలకున్న అభిప్రాయమేంటో అందరికీ తెలిసిందే. విభజన హామీలు నెరవేర్చకుండా దగా చేసిందని సర్వత్రా ఆక్రోశం నెలకొంది.

అక్కడి నిర్ణయాలపై.. ఇక్కడ భవితవ్యం..

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పవన్​కల్యాణ్​ బీజేపీ వైపు మొగ్గు చూపితే టీడీపీ ఎలా ప్రతిస్పందిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. పార్టీ శ్రేణుల అభీష్టానికి భిన్నంగా చంద్రబాబు ముందుకెళ్తారా.. లేక అవసరమైతే పవన్​ను వదులుకోవడానికి సిద్దపడతారా ! మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో పవన్, చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఇక్కడ వాళ్ల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed