TS: ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన హామీ

by GSrikanth |
TS: ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లాలో బీజేపీ సకల జనుల సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నదని విమర్శించారు. కేంద్ర నిధులు మళ్లించి జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. కమీషన్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి మీరు వేసే ఓటు తెలంగాణ, దేశ భవిష్యత్‌ను మారుస్తుందని చెప్పారు. అవినీతితో నిండిన కేసీఆర్‌ కారును మోడీ సంక్షేమ గ్యారేజీలో పడేస్తామని ఎద్దేవా చేశారు. స్మార్ట్ సిటీ కింద నల్లగొండ జిల్లా అభివృద్ధికి మోడీ ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని.. దాని కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధమయ్యారని.. అందుకే అమలుకు సాధ్యం కానీ హామీలను గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు ఒక్కటే అని స్పష్టం చేశారు. మోడీ సుపరిపాలన-కేసీఆర్ నిర్లక్ష్య పాలనకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, లంచగొండి పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని సంచలన హామీ ఇచ్చారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed