రైతులపై కేసీఆర్ కపట ప్రేమ.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల

by Javid Pasha |
రైతులపై కేసీఆర్ కపట ప్రేమ.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు టీఎస్పీఎస్సీ లీకుల పంచాయితీలో ఇరుక్కుపోయే సరికి సీఎం కేసీఆర్ రూట్ మార్చి రైతులకు మాయ మాటలు చెబుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఎన్నికలు ఉంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ గడీ దాటుతారని మరోసారి రుజువయ్యిందని వైఎస్ షర్మిల శుక్రవారం ఒక ప్రకారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే సరికి ఉన్నట్లుండి దొరకు రైతులు గుర్తుకొచ్చారని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా జరిగిన పంట నష్టాన్ని సీఎం ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ఏటా దాదాపు రూ. వెయ్యి కోట్లు అంటే తొమ్మిదేళ్లలో దాదాపు రూ.9 వేల కోట్ల మేర పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రైతులు సర్వం కోల్పోయామని రోడ్లపై పడి ఆందోళన చేసినా పట్టించుకోలేదన్నారు. పంట నష్టం కింద కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు రైతును నిలబెడతాయా? అని ప్రశ్నించారు.

ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టారని, రైతుకు ఇవ్వబోయే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి? అని నిలదీశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పరిహారం పూర్తి స్థాయిలో ఎవరూ ఇవ్వరు అని చెప్పడానికి సిగ్గుగా లేదా..? అని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వ్యవహారం బెడిసి కొట్టేటట్లు ఉందని.. సద్ది మూట కట్టుకుని చల్లటి మాటలు కేసీఆర్ చెప్తున్నారని, కేసీఆర్ వేషాలు, బూటకపు హామీలు ఇక నమ్మే రోజులు లేవన్నారు. ఇది కిసాన్ సర్కార్ కాదని, కిసాన్ బర్బాతీ సర్కార్ అని విమర్శించారు. రైతును ఆదుకోవడం కేసీఆర్‌కు చేత కాదన్నారు. కనీసం ఇచ్చిన రూ.10 వేల హామీ అయినా నెరవేరుస్తావా? లేక వరద బాధితులను మోసం చేసినట్లు చేస్తావా..! అని విమర్శించారు.

Advertisement

Next Story