మీరు కాంగ్రెస్ లోకి రండి!.. ఆ బాధ్యత నేను తీసుకుంటా.. ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ ఆఫర్

by Ramesh Goud |
మీరు కాంగ్రెస్ లోకి రండి!.. ఆ బాధ్యత నేను తీసుకుంటా.. ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో తన కోసం పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సభకు హజరైన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికారు. ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసి అయినా బీఆర్ఎస్ శాసన సభ్యులు మనసు మార్చుకోవాలని దానం కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాలేదని, పద్మారావు గౌడ్ కు కూడా డిపాజిట్ రాలేదని గుర్తు చేశారు. మీ రాజకీయ భవిష్యత్ మీ చేతిలోనే ఉందని, భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ఒక్కటే శరణ్యం అని, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే.. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవిస్తారని తెలిపారు.

అలాగే ఇప్పటివరకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బ్రతికారని, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వాళ్లు మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు. కానీ రామమందిరం నిర్మించిన చోటే బీజేపీ ఓడిపోయిందని, అంతేగాక మోడీకి గతంలో 5 లక్షల మెజారిటీ వస్తే.. ఈసారి లక్ష మెజారిటీ మాత్రమే వచ్చిందని, దీని ప్రకారం మా దృష్టిలో మోడీ నైతికంగా ఓడిపోయినట్లేనని తేల్చేశారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వారికి గౌరవం దక్కేలా తాను బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో తన కోసం పని చేసిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు, తనకు దాదాపు 4 లక్షల 20 వేల ఓట్లు వేసిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని దానం నాగేందర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed