సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం.. 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో సైతం

by Ramesh N |   ( Updated:2024-06-21 12:07:16.0  )
సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం.. 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో సైతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు బిల్లు ఉచితం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి తాజాగా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా తెచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు.

మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించాలని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అని, గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలని, వేల మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లకు సెక్రటేరియట్ లో మొదటి అడుగు పడిందన్నారు. అన్ని జిల్లాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించాలని, 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళా శక్తి కాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.

కాగా, రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లు, ఆస్పత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed