ఆ భూమి కేటాయింపు ఉపసంహరించుకోండి : సీఎంకు తెలంగాణ విద్యావేత్తల లేఖ

by Y. Venkata Narasimha Reddy |
ఆ భూమి కేటాయింపు ఉపసంహరించుకోండి : సీఎంకు తెలంగాణ విద్యావేత్తల లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : డా. బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి పలువురు తెలంగాణా విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. ప్రొ. వి. ఎస్. ప్రసాద్ మాజీ వైస్ ఛాన్సలర్, డా. బి ఆర్ అంటెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ నాక్ (బెంగుళూరు) ప్రొ. జి. హరగోపాల్ ( రిటైర్డ్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం) ప్రొ. ఎం. కోదండ రామ్, (రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ, శాసన మండలి సభ్యలు) ప్రొ. కె. సీతారామ రావు, మాజీ వైస్ ఛాన్సలర్, డా. బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొ.డి. నర్సింహా రెడ్డి (ప్రముఖ ఆర్ధిక వేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం) ప్రొ. ఘంటా చక్రపాణి (రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్)లు సీఎంకు ఈ లేఖను రాశారు.

జూబ్లిహిల్స్ లో ఉన్న డా. బి. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన స్థలంలో నుంచి పది ఎకరాలు జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తెలంగాణా ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సెప్టెంబర్ 19న ఒక నిర్ణయం తీసుకుని, తదుపరి చర్యల కోసం రెండు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లకు (లెటర్ నెంబర్ 1043 / TE /ఏ /2024) లేఖ రాసిన విషయం మా దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. ఇది మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను, ప్రభుత్వ విద్యా సంస్థల భవిష్యత్తును ఆకాంక్షించే ఆలోచనా పరులుగా తెలంగాణా విద్యావేత్తలుగా బాధ్యతతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మీకు ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నామని తెలిపారు.

డా. బీ. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం భారతదేశంలో యూజీసీ న్యాక్ ద్వారా ఏ గ్రేడ్ సాధించిన ఓపెన్ యూనివర్సిటీ లలో ఒకటని, అలాగే ఇంగ్లీష్ తో పాటు తెలుగు, ఉర్దూ ప్రాంతీయ భాషల్లో వివిధ కోర్సులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిందని, ఏటా లక్షన్నర మందికి పైగా వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులతో కలిపి ఇప్పటికీ కనీసం పది లక్షల మందికి నిరంతరం సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం కోసం తొలుత కేటాయించిన 54 ఎకరాల్లో దాదాపు 10 ఎకరాలు దుర్గం చెరువు ఎకలాజికల్ జోన్ (బఫర్ జోన్) ఉందని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదన్నారు. మిగిలిన భూమిలో దాదాపు 40 శాతం సహజసిద్ధమైన కొండ ప్రాంతం, వాటిని ధ్వంసం చేయకుండా, పర్యావరణానికి హాని కలగకుండా ఇప్పటివరకు ఏడు భవన సముదాయాలు, విద్యార్థుల స్టడీ మెటీరియల్ నిల్వ చేసే రెండు గోడౌన్ లు విశ్వవిద్యాలయం నిర్మించుకుందన్నారు. ప్రకృతిని పాడు చేయకుండా నిర్మాణాలు చేపట్టినందుకు విశ్వవిద్యాలయానికి యునెస్కో తో పాటు సేవ్ రాక్ సొసైటీ తో సహా అనేక సంస్థల అవార్డులు వచ్చాయని, పైగా అన్ని వైపులా ఆక్రమణలకు గురైన దుర్గం చెరువును కాపాడుతున్నది ఒక్క అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్నది వాస్తవమని పేర్కొన్నారు. ఇప్పటికీ టీ-సాట్, డబ్ల్యుఈ-హబ్ వంటి ప్రభుత్వ సంస్థలు దాదాపు మూడు ఎకరాల యూనివర్సిటీ భూమిలోనే ఉన్నాయని, దుర్గం చెరువు పైన నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మూలంగా దాదాపు ఐదెకరాలకు పైగా భూమి పోయిందని, కాబట్టి ఇతర కేటాయింపులకు భూమి లభ్యత లేదని విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారని లేఖలో తెలిపారు.

మరోవైపు నూతన జాతీయ విద్యా విధానం దూరవిద్య ప్రోత్సహించాలని సూచిస్తోందని, దూరవిద్యావిదానంలో కోర్సులు ఆఫర్ చేయాలని ఎక్కువమందికి ఉన్నత విద్యావకాశాలు కల్పించి నమోదు నిష్పత్తి పెంచాలని పేర్కొందన్నారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్స్ సెంటర్ ను విద్యార్థుల నైపుణ్యం వికాసానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఆన్-లైన్ విద్యా బోధనకు అవసరమైన ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు విశ్వవిద్యాలయానికి ఇప్పటికే పాలకమండలి అనుమతులు మంజూరు చేసిందని, న్యాక్ అక్రెడిటేషన్ లో మంచి గ్రేడ్ సాధించిన దరిమిలా వీటికి యూజీసీ-రూపా నిధులు లభించే అవకాశం ఉందని, అలాగే ఇక్కడ చేరుతున్న విద్యార్థులకు ఇంగ్లీషు తో పాటు ఇతర విదేశీ భాషల బోధన, శిక్షణకు ప్రత్యేక కేంద్రం. లాంగ్వేజ్ ల్యాబ్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉందని, విశ్వవిద్యాలయం విస్తరణ ప్రణాళికకు ఇప్పటికే అవసరమైన స్థలం లేదన్నారు. ఈ దశలో అంబేడ్కర్ క్యాంపస్ మంచి భూమి తీసుకోవడం మూలంగా విశ్వవిద్యాలయం కార్యకలాపాలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం కూడా విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్న సంస్థ, దాని అవసరాలకు కూడా పది ఎకరాలు ఎంత మాత్రమూ సరిపోకపోవచ్చని, రెండు విశ్వవిద్యాలయాలు ఒక క్యాంపస్ లో ఏర్పాటు చేయడం వాటి ఉనికికి ప్రమాదమని, భావి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని కాపాడాలని తక్షణమే మీరు పునరాలోచించాలని, మీ అధికారులు తీసుకున్న భూకేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed