రాజ్ భవన్‌కు వెళ్లేదెవరు.. CM KCR వెళ్తారా? హరీశ్ రావును పంపిస్తారా!

by Nagaya |   ( Updated:2023-01-24 03:10:37.0  )
రాజ్ భవన్‌కు వెళ్లేదెవరు.. CM KCR  వెళ్తారా? హరీశ్ రావును పంపిస్తారా!
X

స్టేట్ బడ్జెట్‌పై సర్కారు కసరత్తులు చేస్తున్నది. ఫిబ్రవరి మూడో తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. అయితే ఫైనాన్స్ బిల్లు కోసం గవర్నర్ అనుమతి తప్పనిసరి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 చెబుతున్నది. రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్లేదెవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్తారా? లేక మంత్రి హరీశ్ రావును పంపిస్తారా? ఇద్దరు లేకుండా ఫైనాన్స్ సెక్రెటరీని పంపి పని కానిచ్చేస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ ఆరోపిస్తుంటే, గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. దీంతో మంత్రులు, అధికారులు రాజ్ భవన్‌కు వెళ్లడం మానేశారు. గతేడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించినా సీఎం, మంత్రులు రాలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకూ సీఎం వెళ్లలేదు. కానీ బడ్జెట్ పద్దులపై గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ సంతకం లేకుండా ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే చాన్స్ లేదు. దీంతో తమిళిసై సంతకం తీసుకోవడానికి రాజ్ భవన్‌కు ఎవరు వెళ్తారోననే చర్చ జరుగుతున్నది.

గతేడాది ఇలా..

గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్స్ ప్రారంభించారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది. గవర్నర్‌ను, రాజ్యాంగ సంప్రదాయాలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతోనే గవర్నర్ స్పీచ్ అవరసం లేదని ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత రాజ్ భవన్ ఓ నోట్‌ను మీడియాకు విడుదల చేసింది. 'గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం మొదట పేర్కొంది. దురదృష్టవశాత్తు అది అనుకోకుండా జరిగిందని తదుపరి వివరణలో పేర్కొంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశాను. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా అనుమతి ఇచ్చాను'' అని ఆ నోట్ లో వెల్లడించారు.

ఈసారి అనుమతిస్తారా? టైమ్ తీసుకుంటారా?

ఈ సారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే పర్మిషన్ ఇస్తారా? లేక కొంత సమయం తీసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, గతేడాది బడ్జెట్ పద్దులపై గవర్నర్ సంతకం కోసం ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఈ సారి కూడా మళ్లీ ఆయనే వెళ్తారా? మారిన రాజకీయ పరిస్థితుల్లో ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావును పంపిస్తారా? అనే చర్చ జరుగుతున్నది.

Also Read...

అదే సీన్ రిపీట్.. రాజ్‌భవన్‌లో గవర్నర్.. ప్రగతి భవన్‌లో సీఎం

Advertisement

Next Story