విజయ డెయిరీ నష్టాలకు కారకులెవరు?

by karthikeya |
విజయ డెయిరీ నష్టాలకు కారకులెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై వేర్వేరు రూపాల్లో దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు పాల సరఫరా నిర్ణయాల్లో జరిగిన ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నది. ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన పాల డెయిరీ నుంచి జరిగిన సరఫరా వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. సరఫరా చేసేలా ససకరించిందెవరు? ఏ బీఆర్ఎస్ లీడర్ ద్వారా వీరికి అవకాశం దక్కింది? వారితో ఉన్న సంబంధాలు ఎలాంటివి? మాజీ మంత్రి కుటుంబ సభ్యుల్లో ఈ కాంట్రాక్టును దక్కించుకున్నవారెవరు? ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ఎలాంటి టెండర్లు లేకుండానే ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? ఈ వ్యవహారం జరగడం వెనక చక్రం తిప్పిన నేతలెవరు? పశు సంవర్ధక శాఖలో నిర్ణయాలు జరిగేలా ఒత్తిడి తెచ్చిందెవరు? ఇలాంటివాటిపైనా ఫోకస్ పెట్టింది. ఇవన్నీ సీఎం దృష్టికి వెళ్లినట్లు సచివాలయ వర్గాల సమాచారం.

టెండర్లు పిలవకుండానే..

గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి తన కుటుంబ సభ్యులతో ప్రైవేటు డెయిరీ నిర్వహించారన్న ఆరోపణలపైనా వివరాలను సేకరిస్తున్నది. టెండర్లనే పిలవకుండా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు పాలను సరఫరా చేయించినట్లు వచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవాలేంటనే అంశంపైనా దృష్టి సారించింది. ఆ మాజీ మంత్రి కుటుంబీకుల పేరిట ఒక పాల డెయిరీ ఉన్న విషయాన్ని గత ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించినట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి. పథకం ప్రకారమే బీఆర్ఎస్ లీడర్లు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ప్రయోజనాలు పొందారన్న అంశంపైనా వివరాలను సేకరిస్తున్నది. సదరు మాజీ మంత్రి కుటుంబానికి చెందిన పాల డెయిరీ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? పాల వ్యాపారంలో అప్పటి ప్రభుత్వం నుంచి లభించిన సహకారం ఏ స్థాయిలో ఉన్నది? పరిసర గ్రామాల్లోని రైతుల నుంచి సేకరణ ఎలా ఉండేది? మార్కెటింగ్ అవకాశాల్లో ప్రభుత్వం తరఫున ఆ మాజీ మంత్రి ప్రమేయం ఎంత? ఇలాంటి వివరాలన్నింటినీ రాబట్టే ప్రయత్నం మొదలైంది.

నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం?

విజయ డెయిరీని దెబ్బ తీసే ప్రయత్నం గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలంపాటు విజయ డెయిరీకి పాలు విక్రయించిన పాడి రైతులకు గత ప్రభుత్వం ఎంత మేర బిల్లుల పేమెంట్‌ను బకాయిగా పెట్టింది? ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చినా రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఉద్దేశపూర్వకంగానే పేద పాడి రైతుల్ని మోసం చేసిందా? గత ప్రభుత్వంలో మొత్తంగా పేరుకుపోయిన బకాయిలు ఎంత? విజయ డెయిరీకి వచ్చిన నష్టాలెంత? ఇలాంటి వివరాలన్నింటినీ సేకరించి నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆ వర్గాల సమాచారం. మరోవైపు విజయ డెయిరీ వరుస నష్టాలు ఎందుకు వచ్చాయి? అందుకు దారి తీసిన కారణాలేంటి? అందులో ఎవరెవరి ప్రమేయమున్నది? లక్షలాది మంది పాడి రైతులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టిందెవరు? సమగ్రంగా విచారణ జరిపించాలని సీఎం ఆదేశించినట్లు ఆ వర్గాలు విశ్వసనీయంగా తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed