Stray Dogs: వీధి కుక్కలను ఏం చేద్దాం..? హైకోర్టు ఆగ్రహంతో పురపాలక శాఖలో కదలిక

by Shiva |
Stray Dogs: వీధి కుక్కలను ఏం చేద్దాం..? హైకోర్టు ఆగ్రహంతో పురపాలక శాఖలో కదలిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో, జీహెచ్ఎంసీలో వీధి కుక్కల సమస్య ప్రభుత్వానికి తక్షణం పరిష్కరించాల్సిన అంశంగా మారింది. కుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు మృతి చెందారు. గతేడాది జరిగిన ఒక ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు గత వారం విచారణ చేపట్టింది. హైకోర్టు న్యాయవాది మామిడి వేణుమాధవ్ సైతం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కుక్కలను షెల్టర్లకు తరలించాలని, స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు) చేయించాలనే పలు ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం (పురపాలక శాఖ), యానిమల్ వెల్ఫేర్ బోర్డు, జీహెచ్ఎంసీ తరఫున లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్..జూలై 31కల్లా తీసుకోనున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దానికి కొనసాగింపుగా పురపాలక శాఖ సచివాలయంలో సోమవారం సమావేశాన్ని నిర్వహిస్తున్నది.

ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం..

వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేస్తున్నా వాటి సంఖ్య ఎందుకు పెరిగిపోతున్నదంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. వాటిని నియంత్రించడానికి, పిల్లలను కరవకుండా చేయడానికి యానిమల్ వెల్ఫేర్ బోర్డు ప్రతినిధులతో కలిసి చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు. దీనితో పురపాలక శాఖ యానిమల్ బర్త్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ కమిటీని రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసింది. పురపాలకశాఖ సెక్రెటరీ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫీసర్-ఇన్‌చార్జి మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. ఈ కమిటీ చర్చించి వీధి కుక్కల సంఖ్యను తగ్గించడానికి, పిల్లలపై దాడులు చేయకుండా ఉండేలా చేపట్టే విధానాలను చర్చించనున్నది. ఈ సమావేశంలో తీసుకునే ప్రత్యామ్నాయాలను రాష్ట్ర, జిల్లా కమిటీలు అమలు చేయనున్నాయి.

నేడు మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్

మానిటరింగ్ కమిటీలో ఉండే 16 మంది సభ్యుల్లో వరంగల్ మున్సిపల్ కమిషనర్, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, కేంద్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు డాక్టర్ మణిలాల్ వల్లియత్, సెక్రెటరీ డాక్టర్ ఎస్‌కే దత్తా, ఆ బోర్డు నుంచి మరో ఇద్దరు ప్రతినిధులు, ఇండియన్ వెటెర్నరీ అసోసియేషన్ ప్రతినిధి, రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిళ్ల నుంచి ఇద్దరు, పంచాయతీల నుంచి ఇద్దరు చొప్పున ఉంటారు. వీధి కుక్కల సమస్యను అధిగమించడానికి ఉన్న ఆలోచనలు, వారి వారి పరిధిలో సమస్య తీవ్రతను తెలియజేసే గణాంకాలు, ఘటనల వివరాలతో సమావేశానికి రావాల్సిందిగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఒక సర్క్యులర్‌లో తెలియజేశారు. సచివాలయంలో సోమవారం మధ్యహ్నం 3 గంటలకు సమావేశం జరగనున్నది.

యానిమల్ బర్త్ కంట్రోల్ కమిటీలు

కుక్కలను పట్టుకోవడం, షెల్టర్లకు తరలించడం, స్టెరిలైజేషన్ చేయడం, మనుషులకు రేబీస్ సోకకుండా వాటికి వ్యాక్సినేషన్ చేయడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాటిని నొప్పి లేకుండా సోడియం పెంటాథాల్‌తో నిర్మూలించడం తదితరాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు, ఒక యానిమల్ వెల్ఫేర్ బోర్డు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తీసుకోవాల్సిందిగా దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక ఏరియాలో దాదాపు 70 % మేర కుక్కలను పట్టుకున్న తర్వాతనే మరో ఏరియాపై ఫోకస్ పెట్టాలని, వాటి లెక్కలను తేల్చడానికి యానిమల్ వెల్ఫేర్ బోర్డు సహకారాన్ని తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో ఐదుగురితో యానిమల్ బర్త్ కంట్రోల్ కమిటీలు ఏర్పాడాలని సూచించారు.

సచివాలయంలో జరగనున్న మానిటరింగ్ కమిటీ సమావేశానికి అందులోని 16 మందితో పాటు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ కే.సతీశ్‌కుమార్, వెటర్నరీ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.జగన్‌మోహన్‌రెడ్డి, బ్లూక్రాస్ నుంచి అక్కినేని అమల, పీపుల్ ఫర్ యానిమల్స్ ఎన్జీవో ప్రతినిధి వాసంతి, హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సభ్యురాలు శ్రేయా పరోపకారి, న్యాయవాది వేణుమాధవ్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంటు మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంపత్ కూడా హాజరుకానున్నారు. వీధి కుక్కల నియంత్రణ, నిర్మూలన, స్టెరిలైజేషన్, దాడుల నుంచి పిల్లలను కాపాడేందుకు అనుసరించే విధానం తదితరాలపై ఈ సమావేశంలో ప్రతిపాదనలను సిద్ధం చేసి ఈ నెల 31 లోగా హైకోర్టుకు సమర్పించేలా పురపాలక శాఖ ప్రణాళిక రూపొందించింది.



Next Story