- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మామునూరు ఎయిర్ పోర్టుతో టైమ్ వేస్టా ?
దిశ, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా మామూనూరులో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తున్నది. ఓ వైపు ఎయిర్ పోర్ట్ అథారిటీతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు భూసేకరణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ సమయంలో మామునూరు ఎయిర్ పోర్ట్ అసలు వరంగల్ వాసులకు ఎంతమేరకు ఉపయోగపడుతుందనే చర్చ మొదలైంది. నిర్వహణపరంగా వయబిలిటీ ఉంటుందా? లయబిలిటీగా మారుతుందా? అనే అంశంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. వరంగల్ కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తక్కువ దూరంలోనే ఉండటంతో ఇక్కడి నుంచి ఎంత వరకు ప్రజలు విమానంలో ప్రయాణిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పెద్దగా పరిశ్రమలు కూడా లేకపోవడంతో కార్గో సర్వీసులకు వచ్చే ఆదరణపైనా డౌట్స్ ఉన్నాయి. భూసేకరణ అంశంపైనా రైతుల్లో ఆందోళన నెలకొన్నది. నగరానికి సమీపంలో ఉండటంతో భూములకు మంచి ధర ఉంటుందని, కుటుంబాలు బాగుపడుతాయని భావించామని, ఇప్పుడు తమ ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయని వారు వాపోతున్నారు.
రైతుల నుంచి వ్యతిరేకత!
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో నిర్మించనున్న మామూనూరు ఎయిర్ పోర్ట్ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే ఎయిర్ పోర్ట్ నిర్మాణ వ్యవహారాలు ప్రారంభిస్తామంటూ ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతమున్న 1.8 కి.మీ రన్ వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలుగా భూ సేకరణ అవసరమని తెలిపింది. దీంతో బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలు కూడా రావడానికి వెసులుబాటు దొరుకుతుందని పేర్కొన్నది. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 950 ఎకరాలు కావాలని ఏఏఐ వివరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కసరత్తు ప్రారంభించింది. మామూనూరు ఎయిర్ పోర్ట్ కు ప్రస్తుతం 693 ఎకరాల స్థలం ఉంది. గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల నుంచి 197 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం నుంచి 149 ఎకరాలు, మామునూరు గ్రామం నుంచి ఐదు ఎకరాలను సేకరించనున్నారు. మొత్తం 233 మంది రైతుల నుంచి భూ సేకరణ చేపట్టనున్నారు. ప్రత్యామ్నాయంగా ఆ రైతులకు మామునూరు డెయిరీఫాం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, తమకు గుంటూరుపల్లి గ్రామంలో కావాలనే డిమాండ్‌ను రైతులు వినిపిస్తున్నారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించిన అధికారులు.. వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భూ సేకరణపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. సరైన పరిహారం, ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తమకు న్యాయం చేసే వరకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టంగా చెబుతున్నారు.
ఫ్లయిట్ జర్నీతోనే ఎక్కువ టైం!
వరంగల్ వాసులు హైదరాబాద్ కు వెళ్లాలంటే విమానం కంటే కారో, బస్సో బెటర్ అని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఫ్లయిట్ జర్నీ చేసి హైదరాబాద్ లోని తమ నివాసానికి చేరుకునే లోపే కనీసం ఐదు గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. విమానంలో హైదరాబాద్ జర్నీ యాలంటే అరగంట నుంచి గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అరగంట విమానజర్నీ తర్వాత శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి లగేజీ తీసుకొని బయట వాహనం ఎక్కడానికి మరో అరగంట పడుతుంది. ఇలా విమానం ఎక్కీ, దిగి బయటకు రావడానికే రెండు గంటల సమయం పడుతుంది. వీటి తోడుగా హన్మకొండ, కాజీపేట, నయీంనగర్ తదితర ప్రాంతవాసులు విమానాశ్రయానికి చేరుకోవడానికి కనీసం 45 నిమిషాల సమయం పడుతుంది. శంషాబాద్ నుంచి ప్రయాణికులు హైదరాబాద్ లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కనీసం గంట నుంచి గంటన్నరకు పైగా టైం పడుతుంది. ఇలా మొత్తంగా వరంగల్ నుంచి హైదరాబాద్ కు విమానంలో రావడానికి కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. అదే రోడ్డు మార్గాన వెళ్లే వారికి నాలుగు వరుసల రహదారి ఉంది. టోల్ గేట్లు మినహా మరెక్కడా ఆగాల్సిన అవసరం లేదు. నాన్ స్టాప్ బస్సులూ అందుబాటులో ఉన్నాయి. కార్లలోనూ నేరుగా వెళ్లొచ్చు. దీనికి రెండు నుంచి మూడు గంటల కంటే ఎక్కువ టైం పట్టదు. పైగా తక్కువ ఖర్చులో ఇంటికి చేరుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్ లోని ఏ ప్రాంతం నుంచైనా శంషాబాద్ కు వెళ్లాలంటే ట్రాఫిక్ లో చుక్కలు కనిపిస్తాయి. అదే కారులో అయితే రోడ్డుమార్గాన శంషాబాద్ కు చేరుకునే లోగానే వరంగల్ కు చేరుకోవచ్చు. టిక్కెట్ల ధరలు భారంగా మారనున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా చూసినా వరంగల్ టు హైదరాబాద్ కు బస్సు, కారు ప్రయాణమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మామునూరు నుంచి ఇతర పట్టణాలు, నగరాలకూ వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువగా ఉండొచ్చని నగరవాసులు చెబుతున్నారు.
జీఎంఆర్ అంగీకరిస్తేనే..
హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు చేయవద్దని శంషాబాద్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్ ఆథారిటి ఆఫ్ ఇండియా, జీఎంఆర్ మద్య ఒప్పందం కుదిరింది. అయితే శంషాబాద్ కు ప్రయాణికుల సంఖ్య పెరగడం, తెలంగాణలో మరోక వాణిజ్య ఎయిర్ పోర్ట్ లేకపోవడంతో మామూనూరు ఎయిర్ పోర్ట్ కు అనుమతి ఇవ్వడానికి ఏఏఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా అధికారులు చెబుతున్నారు. లిఖిత పూర్వకంగా ఒప్పందం కుదరాల్సి ఉందని పేర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దగ్గర ఉండటంతో అత్యవసర సమయాలు, ఇతర అవసరాలకు భవిష్యత్తులో మామూనూరు ఎయిర్ పోర్ట్ ను వినియోగించుకోవచ్చని చర్చించినట్లు సమాచారం. దీనితో తోడుగా బేగంపేట పేట ఎయిర్ పోర్ట్ లో వ్యక్తిగత విమానాలు (చార్టెడ్ ఫ్లైట్స్) పార్కింగ్ కూడా పూర్తి నిండిపోయిందని, కొత్తగా విమానాలు పార్కింగ్ చేసుకోవడానికి స్థలం దొరడంలేదని గుర్తించారు. దీంతో బేగంపేట ఎయిర్ పోర్ట్ పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ లో వ్యక్తిగత విమానాలు పార్కింగ్ చేస్తే అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి ఎక్కువ సమయం పట్టదని, దీంతో అక్కడికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా ఫ్లైయింగ్ క్లబ్ లు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా పైలెట్ శిక్షణ ఇచ్చే సంస్థలు ఫ్లైయింగ్ క్లబ్ లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే అవకాశముంది. ఒక్కో విద్యార్ధి లక్షల్లో ఫీజు చెల్లించి శిక్షణ తీసుకుంటారు. దీని ద్వారా వరంగల్ నగరంలో పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు.
ఉడాన్ స్కీంపై ఆశలు
వరంగల్ కు ట్రాన్సిట్ ఫ్లయిట్స్ నడిచే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా వైజాగ్, తిరుపతి, బెంగళూరు, ముంబై వెళ్లే విమానాలు.. అక్కడి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లొచ్చు. ఆర్థికంగా, సమయపరంగా అంచనా వేసుకొని వరంగల్ నుంచి హైదరాబాద్ కు రావడానికి ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశాలు తక్కువని విమానరంగ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే వరంగల్ నుంచి బెంగళూరు, తిరుపతి, ముంబై కి ఎక్కువ ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుందని విమానరంగం అధికారులు చేసిన ప్రాథమిక సర్వేలను ఉదహరిస్తున్నారు. అయితే మొదట్లో వీరి సంఖ్య కూడా తక్కువగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మామూనూరు ఎయిర్ పోర్ట్ ను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఆసక్తి ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణలో హైదరాబాద్ మినహా మరెక్కడా కూడా ఎయి పోర్ట్ లేదు. దీంతో వరంగల్ (మామూనురు), కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండం, నిజామామాద్ తదితర ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్ లు ఏర్పాటు చేసే పక్రియ కొనసాగుతున్నది. దేశంలో విమానయాన రంగాన్ని ప్రొత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీంను తీసుకువచ్చింది. విమానంలోని సగం సీట్లకు సగం టికెట్ ధరను చెల్లిస్తారు. దీంతో విమానం ఎక్కడం ఆర్థికంగా భారంగా పరిగణించే వారు ఉడాన్ స్కీం కల్పించిన వెసులుబాటుతో ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు విమానయాన సర్వీసుల కంటే హెలికాప్టర్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. వెయిటింగ్ సమయం లేకుండా బేగంపేటలో దిగడం, తమకు అనుకూలమైన సమయాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం వరంగల్ నుంచి హైదరాబాద్ కు హెలికాఫ్టర్ సర్వీసులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.