DGCA: ప్రయాణీకులకు హక్కులు, నిబంధనలపై అవగాహన

by S Gopi |
DGCA: ప్రయాణీకులకు హక్కులు, నిబంధనలపై అవగాహన
X

దిశ, బిజినెస్ బ్యూరో: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రయాణానికి సంబంధించి ప్రయాణీకులకు ఉండే హక్కులు, సంబంధిత నిబంధనల గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. విమానయాన సంస్థలు టిక్కెట్‌ను బుక్ చేసినప్పుడు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణీకుల చార్టర్‌ ఆన్‌లైన్ లింక్‌ను ఎస్సెమ్మెస్ లేదా వాట్సాప్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలి. ప్రయాణీకులు తమ హక్కుల గురించి తెలుసుకునేలా ఈ సమాచారం విమానయాన టిక్కెట్లు, వెబ్‌సైట్‌లలో ఉంచాలి. దీన్ని మార్చి 27 నుంచి అమలు చేయాలని ఎయిర్‌లైన్ సంస్థలను డీజీసీఏ కోరింది. స్పైస్‌జెట్ ఇప్పటికే ఈ చర్యలు అమలు చేస్తోంది. ఇతర విమానయాన సంస్థలు కూడా విమానాలు ఆలస్యం కావడం, క్యాన్సిల్ అవడం, బోర్డింగ్ తిరస్కరించడం, బ్యాగేజీ సమస్యలతో సహా అన్ని విషయాలను ప్రయాణీకులకు చెప్పాలని తెలిపింది. విమానయాన సంస్థలు సైతం వీలైనంత త్వరలో డీజీసీఏ మార్గదర్శకాలను పాటించనున్నట్టు చెప్పాయి. కాగా, గత కొంతకాలంగా డీజీసీఏకు ఎయిర్ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సహా దేశీయ విమానయాన సంస్థలకు మధ్య వివాదం నెలకొంది. ఇది గడిచిన రెండేళ్లకు సంబంధించిన విమాన ఛార్జీల డేటాకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. విమాన ఛార్జీలకు సంబంధించి ధరల ట్రెండ్‌ను పరిశీలించేందుకు, బుకింగ్ తేదీలు, బేస్ ఛార్జీలతో సహా ప్రయాణీకుల ఛార్జీల సమాచారాన్ని ఇవ్వాలని తెలిపింది. ఈ డేటాను విశ్లేషించే పనిని ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అందించింది. అయితే, వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారాన్ని ఇవ్వడంపై ఎయిర్‌లైన్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.

Next Story

Most Viewed