వామ్మో.. చెత్త..! దేశంలో చెత్త నిర్వహణ ఇంత దారుణంగానా?

by Shiva |   ( Updated:2024-12-03 07:41:51.0  )
వామ్మో.. చెత్త..! దేశంలో చెత్త నిర్వహణ ఇంత దారుణంగానా?
X

రోడ్డుపై చెత్త పడేయడం మనకు చాలా సాధారణమైన విషయం. కానీ, పర్యావరణం పరంగా చాలా తీవ్రమైన అంశం. ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు ప్రతిచోట రోడ్డుపై చెత్త పడేయకూడదని బోర్డులు పెడుతున్నా.. జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోరు. కారణం.. ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం.. ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించకపోవడం. ప్రతి ఒక్కరికీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు.. ఇళ్లే కాదు.. దేశం మొత్తం అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ, అందుకు అవసరమైన కార్యాచరణ మాత్రం పాటించరు. పైగా వారు ఇష్టానుసారంగా పడేసే చెత్తను ఎత్తాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్లదే కదా అని లాజిక్కులు తీస్తారు. దేశంలో ప్రతి ఒక్కరు కనీసం 116గ్రాముల చెత్త పడేస్తారు. అది వంటకే కావచ్చు.. ఫుడ్ కవర్స్, పార్సిల్స్ ఇలా ఏదైనా కావచ్చు.. సగటున మనదేశంలో ప్రతి ఒక్కరు కనీసం 116 గ్రాములు చెత్త ఉత్పత్తి చేయడంతో దేశంలో ప్రతిరోజూ 1,70,300 టన్నుల పేరుకుపోతున్నది. దీనిని డిస్పోస్ చేసేందుకు సరిపడా వ్యవస్థ లేకపోవడం వల్ల డంపింగ్ ఏరియాల్లో చెత్త పేరుకుపోతున్నది. అందులోనే వైద్య వ్యర్థాలు, కెమికల్ వేస్టేజ్ కూడా కలిసి ఉండటంతో ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. గాలి, నీరు కలుషితం అవుతున్నది. చెత్త నిర్వహణ మనదేశంలో నిజంగానే చెత్తగా మారింది. సింగపూర్ లాంటి అతిచిన్న దేశాలు అవలంబిస్తున్న విధానాలు పాటించకపోతే భారీ ముప్పు ఎదురుకానున్నది. - శివ కుమార్ కేమ

కఠిన శిక్షలు అవసరం..

భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం సాంఘీక దురాచారంతో సమానం. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం దూసుకెళ్తున్నా.. పర్యావరణ పరిరక్షణలో మాత్రం మనం ఇంకా అట్టడుగు స్థానంలో ఉన్నాం. ఆధునిక జీవన శైలిలో పరిసరాల కాలుష్యం జీవన్మరణ సమస్యగా పరిణమించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి దేశంలోనే మేటి వైద్యులకు కూడా అర్థం కాని కొత్త కొత్త వైరస్‌లు మనిషిని కబళించేస్తున్నాయి. చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఎవరిలోనూ మార్పు రావడం లేదు. మళ్లీ మునుపటి లాగే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తూ.. కాలుష్యానికి కారణభూతులు అవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే విషయంలో ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమలు చేయకపోవడం వల్లే ఎవరిలోనూ మార్పు రావడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మన దేశంలో శిక్షలు బలహీనం..

1860 భారతీయ శిక్షాస్మృతి సెక్షన్-279 ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా రూ.500 మాత్రమే జరిమానా విధిస్తున్నారు. అదేవిధంగా 1986 పర్యావరణ రక్షణ చట్టం ప్రకారం.. పర్యావరణాన్ని కలుషితం చేయడం నేరం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నా అందులో మానవులు, ఇతర జంతువు, మొక్కలు, చెత్తా చెదారాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. పారిశుద్ధ్యం అనే అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని భారత రాజ్యంగంలో స్పష్టంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసే అధికారం కూడా ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం విధించాయి. ఇక ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.500ల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తారు.

డిటరెన్స్ థియరీ..

జరిమానాలు, శిక్షలతో భయాన్ని సృష్టించి నేరాలను అరికట్టడమే డిటరెన్స్ థియరీ ప్రధాన లక్ష్యం. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా నేరం చేస్తే వారికి కఠినమైన జరిమానాలు, శిక్షను విధిస్తారు. అలాంటప్పుడే ప్రజలు వాటి గురించి తెలుసుకుని తప్పు చేయాలంటేనే ఆలోచిస్తారు. నోబెల్ గ్రహీత గ్యారీ బెకర్ తాను రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్‌మెంట్’ పుస్తకంలో ‘నేరం చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, నేరస్థులు నేరం చేయరని తెలిపాడు. ముందు చేసే పని సరైందా లేదా అని అంచనా వేశాకే నేరం చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటారని’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారికి డిటరెన్స్ థియరీని అనుసరించి శిక్షను అమలు చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్..

2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్‌ కార్యక్రమం ఎంతో కొంత ఆదరణ పొందింది. ఇందులో భాగంగా గాంధీజీ యొక్క ‘స్వచ్ఛత’ భావనను ప్రేరేపించి, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ఆ కార్యక్రమం దోహదపడుతోంది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలను శుభ్రపరచడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ భారత్’కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (గ్రామీణ) పథకం కింద రూ.9 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. దాదాపు 5.5 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత పల్లెలుగా మారాయి. అదేవిధంగా స్వచ్ భారత్ మిషన్ (అర్బన్) పథకం కింద 60 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 5 లక్షల కమ్యూనిటీ టాయిలెట్లు కూడా నిర్మించబడ్డాయి. కానీ, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అంశంపై మాత్రం కేంద్ర ప్రభుత్వం అంతగా దృష్టి సారించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

చెత్త వేస్తే చలాన్..! జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్

నగరంలో రోడ్ల పేరుకుపోతున్న చెత్తను నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు ట్రాఫిక్‌ చలాన్ మాదిరిగానే.. రోడ్ల పక్కన చెత్త వేసే వారికి జరిమానా విధించేందుకు ప్రణాళికను రూపొందించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్ల (GVP) వద్ద సీసీ కెమెరాల ఆధారంగా వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి చాలాన్ పంపనున్నారు. అదేవిధంగా కాలినడకన రోడ్లపైకి వచ్చి చెత్త పడేసే వారికి కూడా జరిమానా విధించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ను జీహెచ్ఎంసీ ఐటీ విభాగం రూపొందిస్తోంది. డిసెంబరు 1 నుంచి యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.

రోడ్లపై యథేచ్ఛగా వ్యర్థాలు పారబోసే వాణిజ్య సముదాయాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఒకవేళ చాలాన్ వేసి, హెచ్చరించినా పట్టించుకోకపోతే వ్యాపార లైసెన్స్ రద్దు, దుకాణాలను కూడా సీజ్ చేయనున్నారు. నగరంలో చెత్త సేకరణలోకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛ ట్రాలీలకు చెత్త ఇవ్వడం లేదని తెలుస్తోంది. వారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొందరు ఇంట్లోని రోజువారీ వ్యర్థాలను రోడ్లపైనే డంప్ చేస్తున్నారు. తరచుగా డంప్ చేస్తున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో సాయంత్రం వరకు కాపలా పెట్టినప్పటికీ.. అర్థరాత్రి తరువాత అక్కడే చెత్తను పారబోస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిఘా, భారీగా జరిమానాలను విధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..

సింగపూర్..

ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ హెల్త్ యాక్ట్-1987, సెక్షన్ 18 ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. నేరానికి పాల్పడిన వారిని వారెంట్ లేకుండా అరెస్టు చేస్తారు. మొదటి నేరానికి గాను గరిష్టంగా వెయ్యి డాలర్లు, రెండో సారి నేరానికి పాల్పడితే 2 వేల డాలర్ల జరిమానా విధిస్తారు.

జపాన్‌..

ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ అఫెన్సెస్ యాక్ట్-1970 ప్రకారం.. బహిరంగ ప్రదేశాలను తిరిగేటప్పుడు రోడ్లపై ఉమ్మి వేయకూడదనే నిబంధన అమల్లో ఉంది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 10 వేల యెన్ల జరిమానా, 30 రోజుల జైలు శిక్షను విధిస్తారు. నేర తీవ్రతను బట్టి శిక్ష పెరుగుతంది.

యూనిటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)

అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా శిక్షలు అమల్లో ఉన్నాయి. మేరీల్యాండ్ రాష్ట్రంలో 30వేల డాలర్లు, కొలరాడో స్టేట్‌లో డాలర్ల జరిమానా విధిస్తారు. తీవ్రను బట్టి జైలుకు పంపే అవకాశం కూడా ఉంది. టేనస్సీ రాష్ట్రంలో గరిష్టంలో 6 ఏళ్లు, ఇడాహో స్టేట్‌లో కనిష్టంగా 10 రోజుల జైలు శిక్ష అమల్లో ఉంది. లూసియానా, మేరీల్యాండ్ స్టేట్స్‌లో నేరస్థుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసే చట్టాలు అమల్లో ఉన్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)

యూఏఈలో చెత్త రకం, డంప్ చేసే ప్రదాశాన్ని బట్టి శిక్ష మారుతూ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే, వాహనం నుంచి చెత్త వేస్తే 1,000 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు. వ్యవసాయ వ్యర్థాలు, బిల్డింగ్ మెటిరియల్ వేస్ట్ డంప్ చేస్తే 10వేల దిర్హాంలు చాలాన్ వేస్తారు. మురుగు వ్యర్థాలను డంపింగ్ చేస్తే ఏకంగా లక్ష దిర్హాంలు జరిమానా విధిస్తారు. అదేవిధంగా నీటి వ్యర్థాలు, పారిశ్రామిక, ప్రమాదకర వ్యర్థాలను అక్రమంగా పారవేస్తే లక్ష దిర్హాంలు అపరాధ రుసుముగా చెల్లించాలి. టిష్యూ పేపర్, అల్యూమినియం డబ్బాలు, సిగరెట్ పీకలు, పెద్ద వస్తువులతో సహా అన్ని రకాల చెత్తకు యాంటీ లిట్టర్ నియమం వర్తిస్తుంది.

సింగపూర్‌లో అద్భుతాలు

అతి చిన్న దేశం సింగపూర్. దేశం మొత్తం ఆ చివరనుంచి.. ఈ చివరివరకు కొలిస్తే కేవలం 750 కిలోమీటర్లు మాత్రమే. జనాభా 50లక్షలకు మించదు. జనసాంద్రత కిలోమీటర్ కు 7,810. భారత్ లో ఇది 455, అమెరికాలో కేవలం 36మాత్రమే. కానీ.. చెత్త నిర్వహణలో సింగపూర్ ప్రపంచానికే గురువుగా మారింది. ఇక్కడ దాదాపుగా ప్రతిరోజూ 7 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. కానీ, దీనిని వందకు వందశాతం రీ సైక్లింగ్ చేస్తూ బెస్ట్ వేస్ట్ మేనెజ్‌మెంట్ పద్ధతులను ఆ దేశం అవలంబిస్తున్నది. అక్కడ ప్రతి అపార్ట్‌మెంట్ ఫ్లోర్ వారీగా చెత్త సేకరణకు డబ్బాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. వీధుల్లోనూ చెత్త డబ్బాలను ఉంటాయి. సింగపూర్‌లో చెత్త సేకరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది.

2వేల ట్రక్కులు ఉదయాన్నే చెత్త సేకరించి ఇన్‌సినరేషన్ ప్లాంట్‌కు తరలిస్తాయి. అక్కడ భారీ స్థాయి ఫర్నేస్ లు ఉంటాయి. అందులో చెత్త వేసి కాల్చేస్తారు. అయితే, వాయుకాలుష్యం కాకుండా పొగనుంచి టాక్సిక్ లను వేరు చేసి స్వచ్ఛమైన వాయువుగా మార్చి వదులుతారు. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగదు. ఫర్నేస్ నుంచి వెలువడే వేడినుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. ఆ ప్లాంట్ నిర్వహణతోపాటు దేశంలో అవసరమయ్యే విద్యుత్ లో 3శాతం వరకు అందజేస్తున్నాయి. ఇక ఫర్నేస్ లో 90శాతం బూడిదగా 10శాతం వ్యర్థాలుగా మారుతాయి. దానిని తీరప్రాంతాల్లో సముద్రంలో కొంత దూరం వరకు కరకట్టలు కట్టి దానిని వేరుచేశారు. అందులో ఈ బూడిద కలిసిన వ్యర్థాలను వేస్తూ ఫిల్ చేస్తున్నారు. ఫలితంగా ఆ నీరు స్వచ్ఛంగా మారుతున్నది. ఇలా ల్యాండ్ ఫిల్ ప్రాసెస్ చేస్తున్నారు. రోడ్డు వేసేందుకు కూడా ఇదే వ్యర్థాలను వినియోగిస్తున్నారు. సింగపూర్‌లో ఇన్ సినరేషన్ ప్లాంట్లు నాలుగు ఉన్నాయి. వీటి ఏర్పాటుకు 860 బిలియన్ డాలర్లు ఖర్చు అయినా ఆ దేశం కడిగిన ముత్యంలా మారడానికి దోహదపడుతున్నాయి.

అదే సమయంలో ఆ దేశంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేసేవారిపైనా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా బాత్ రూమ్ వాడి ఫ్లష్ చేయకపోతే అక్కడ సివిల్ దుస్తుల్లో తిరిగే అధికారులు వారికి 500 సింగపూర్ డాలర్లు (31వేలు) ఫైన్ వేస్తారు. ఇలానే పావురాలను ఫీడింగ్ వేసిన కూడా ఇంతే ఫైన్ వేస్తారు. మరో విషయం ఏమిటంటే ఆ దేశంలో చూయింగ్ గమ్ నిషేధించారు. ఎందుకంటే ఒకరోజు ఎవరో చూయింగ్ గమ్ తిని మెట్రో రైల్ డోర్ కు అతికించారు. ఫలితంగా తలుపులు మూసుకోకుండా సెన్సార్లు అడ్డుకున్నాయి. రైల్వే అధికారులు కారణం తెలుసుకుని ఆ చూయింగ్ గమ్ తీసేవరకు రైలు నిలిచిపోయింది. ఆ రైలు కారణంగా ఇతర రైళ్లు నిలిచిపోవడం.. ఫలితంగా మానవ వనరులు వృథా కావడాన్ని సీరియస్ గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం వెంటనే చూయింగ్ గమ్ తినడాన్ని నిషేధించింది. చిన్న ఘటనే అయినా కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే ఆ దేశం చెత్త నిర్వహణలో మేటిగా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed