- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడ్జెట్‌లేక మూలనపడ్డ సంక్షేమం.. దళితబంధు ఎంపికలో అంతా దగే!
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. దేశ జనాభాలోనే ఎక్కువగా ఉండే ఈ వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నాం. స్వరాష్ట్ర పాలనా కాలంలో దాదాపు రూ.5 లక్షల కోట్ల రూపాయలను ఆసరా ఫించన్లు సహా పలు రకాల సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రూపాయి ప్రజల్లో తిరిగడం ద్వారా స్పిన్ ఆఫ్ ఎకానమీకి దారితీసింది. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని స్థాపించింది.’ అంటూ సీఎం కేసీఆర్అసెంబ్లీతో పాటు పలు సభలు, సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిధులు లేక సంక్షేమ పథకాలన్నీంటికి బ్రేకులు పడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ మూలనపడ్డాయి. దళిత బంధు అంతా దగే అన్న ఆరోపణలు రాగా, స్కీమ్ శాంక్షన్‌కు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం పేర్కొనడం గమనార్హం. సంక్షేమ పథకాలపై మంత్రులు, ముఖ్యమంత్రి ఘనమైన ప్రకటనలు చేస్తున్నా.. నిధుల మంజూరులో మాత్రం వెనుకంజ వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల పరిస్థితి ఎండమావిని తలపిస్తున్నది.
ఫీజు రీయింబర్స్‌మెంట్
సుమారు 5,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గడిచిన నాలుగైదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫీజు రీయింబర్స్మెంట్లన్నీ ఆగిపోయాయి. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే విద్యార్ధులు నష్టపోతారని ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఒక్క బీసీలకే రూ.2 వేల కోట్లు పెండింగ్ లో ఉండగా.. ఎస్సీ, ఎస్టీలవి మరో రూ.3 వేలకోట్లు బకాయిలు ఉన్నాయి. దీంతో చాలా కాలేజీలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని కాలేజీలు రీయింబర్స్మెంట్లు కాలేదని సర్టిఫికేట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగాదాదాపు 18 లక్షల మంది స్టూడెంట్లు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం సగటున 11 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్లకు స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుందని వెల్ఫేర్ ఆఫీసర్లు చెప్తున్నారు.
మూడెకరాల భూమి ఊసే లేదు
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇచ్చి తీరుతానని సీఎం కేసీఆర్ ప్రతి ఎన్నికల సమయంలోనూ హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గడిచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం కేవలం 6,998 మంది అర్హులైన భూమి ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మందికి పైనే దళితులు ఉన్నారు. ఇందులో 42 శాతం మంది వ్యవసాయం చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అయితే వీరిలో 30 శాతం మందికి సొంత భూములు లేవు. కొత్తగా మూడెకరాల భూమి ఇవ్వకపోగా, గత ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన భూమిని కేసీఆర్ సర్కార్ తిరిగి స్వాదీనం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వాలు దళితులకు భరోసా కల్పించాలని సుమారు 23 లక్షల ఎకరాలను అసైన్డ్ భూములుగా కేటాయించారు. హైదరాబాద్‌లో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో ధరణి పేరుతో మళ్లీ భూములు వెనక్కి తీసుకున్నారు.
ఆసరా ఫించన్లు.. అందట్లే
2014 నుంచి మే 2023 మధ్య తొమ్మిదేండ్ల కాలంలో ఆసరా తదితర పింఛన్లకు రూ.58,696 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. 2014 వరకు తెలంగాణలో పింఛన్లు పొందే లబ్దిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే ఉండేదని, కానీ ప్రభుత్వం ప్రతి గ్రామం వారీగా సర్వే చేపట్టి ఆసరా పింఛన్ లబ్దిదారుల సంఖ్యను ఏకంగా 44,82,254 కి పెంచినట్లు పేర్కొన్నది. ఆయా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పింఛన్ వయో పరిమితిని 57 సంవత్సరాలకు కుదించిన తర్వాత మూడేళ్ల పాటు అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం సతాయించింది. ఇప్పటికీ మరో 3 లక్షలకుపైనే అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.18,555 కోట్లను ఖర్చు చేశామని.. అదేవిధంగా 25 మే 2023 నాటికి 16,44,280 మంది వయోవృద్ధులకు నెలకు రూ.2,016 చొప్పున ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నది. అయితే ఇంట్లో ఒక్కరికే ఈ పథకం పరిమితం చేయడం సమస్యగా మారింది. ఇక 4,25,793 మంది బీడీ కార్మికులు, రాష్ట్రంలో అర్హులైన 5,16,890 మంది దివ్యాంగులు, రాష్ట్రంలోని 18,644 మంది పైలేరియా (బోదకాలు) బాధితులు, 67,048 మంది గీత కార్మికులు, రాష్ట్రంలోని 38,240 మంది నేత కార్మికులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చికిత్సను పొందుతున్న 4667 మందికి, 37,674 మంది ఎయిడ్స్ బాధితులకు నిధులు లేక పింఛన్లు సకాలంలో అందడం లేదు.
దళితబంధులో కమీషన్లు.. సీఎం అంగీకారం
ఎస్సీ కులాలకు ఆర్థిక గౌరవంతోపాటు, సామాజిక గౌరవాన్ని పెంపొందించేందుకు దళిత బంధు ఇస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పగా వర్ణించింది. అర్హులకు రూ.10 లక్షల గ్రాంటును ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు ఈ పథకానికి అర్హులైన 38,323 మందికి ఇచ్చినట్లు పేర్కొన్నది. కానీ కమీషన్లు ఇచ్చినవాళ్లకు, బీఆర్ఎస్ నేతల అనుచరులకే ఈ స్కీమ్ ఇస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ విషయం ఏకంగా హైకోర్టు వరకు వెళ్లింది. పైగా ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం అంగీకరించారు. అయితే 2022–23 బడ్జెట్ లో రూ. 17,700 కోట్లను కేటాయించగా.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మళ్లీ 2023-24 బడ్జెట్ లో మరోసారి రూ. 17,700 కోట్లు ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకు రెండో విడతపై సర్కార్ లోనే క్లారిటీ లేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే హాడావిడి చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
గిరిజన, బీసీ బంధులు ఏవీ..?
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో గిరిజనబంధు అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల కుటుంబాలకు మేలు చేస్తామని గొప్పలు పలికారు. ఈ పథకం కోసం ఆదివాసీలు, లంబాడీలు ఎదురుచేస్తున్నారు. ఇక దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అది నీటి మీద రాతగానే మిగిలింది.
అంబేడ్కర్ భవనాలు, విగ్రహాలు
అంబేడ్కర్ భవన్, విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.368.27 కోట్లను మంజూరు చేసింది. 2014-15 నుండి 2022-23 వరకు ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ. 140.55 కోట్లను ఖర్చు చేసింది. అంటే దాదాపు 50 శాతానికి పైగా కోతలు విధించింది. దీంతో 9 ఏళ్లు గడిచినా.. వీటిలో 96 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 319 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ పరిసరాల్లో 11.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అంబేడ్కర్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది. దాదాపు ఈ విగ్రహ స్థాపనకు ప్రభుత్వం రూ. 146.50 కోట్లు ఖర్చు చేసినట్లుప్రకటించింది.
ఓవర్సీస్ స్కాలర్ షిప్
దళిత, గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి.. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకం కింద విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. 2013-14 నుంచి 2022-23 వరకు 1031 మంది అభ్యర్థులు రూ.179.92 కోట్లను స్కాలర్ షిప్ గా అందుకున్నారు. నిధుల రిలీజ్ లేక బీసీ ఓవర్సీస్కూడా అటకెక్కినట్లు సమాచారం. ఈ పథకం కింన ఏటా 3 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం దాదాపు 300 మందికి మాత్రమే అప్రూవల్స్ ఇస్తున్నది. బీసీ ఓవర్సీస్ లో గత బడ్జెట్ లో రూ. 123 కోట్లు కేటాయించగా, కేవలం రూ. 33 కోట్లు ఖర్చు చేశారు.
బీసీ సెల్ఫ్ఎంప్లాయ్మెంట్ పరిస్థితీ అంతే...?
మూడేళ్లుగా బీసీ వెల్ఫేర్‌లో నిధులు లేక అస్తవ్యస్తంగా మారిపోయింది. మూడేళ్లుగా కనీసం ఒక్క రూపాయి కూడా బీసీ సెల్ఫ్ఎంప్లాయ్మెంట్కు ఖర్చు పెట్టలేదంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం రూ. 3,005 కోట్లను కేటాయించినప్పటికీ, కేవలం రూ. 350 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టారు.
కార్పొరేషన్లు కనుమరుగు
గడిచిన నాలుగైదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు కనుమరుగయ్యాయి. స్వయం ఉపాధికి సంబంధించిన ఎలాంటి లోన్లు మంజూరు కావడం లేదు. సబ్సిడీల ద్వారా రాయితీలు కల్పిస్తామంటూ అప్లికేషన్లు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పాటు దళితులను ఎంటర్‌ప్రెన్యూయర్లను చేసేందుకు ఏర్పాటు చేసిన పథకం టీఎస్ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ ప్రెన్యూయర్స్) కూడా అటెక్కింది. ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైనట్లు అధికారులే చెప్తున్నారు. 2014 నుంచి 2022 వరకు స్వయం ఉపాధి, ప్రత్యేక సాయం ,భూమి కొనుగోలు వంటి ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.12,708 కోట్లను కేటాయించగా,రూ.8599 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులను ప్రభుత్వం ఇప్పటి వరకు రిలీజ్చేయలేదు. ఎస్టీ యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎకనమిక్ సపోర్టు స్కీమ్’ నత్తనడకన నడుస్తున్నది.
ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ. 2,143 కోట్లను విడుదల చేస్తే చివరకు రూ.647 కోట్లు మాత్రమే ఖర్చయింది. ఇవికాక స్కిల్ ట్రెయినింగ్, ట్రైబల్ సబ్ ప్లాన్, డ్రైవర్ఎంపవర్మెంట్ స్కీమ్, రూరల్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్కీమ్, సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–ఇన్నోవేషన్ స్కీమ్, సీఎం గిరి వికాస్స్కీమ్, స్కిల్ డెవలప్మెంట్, ట్రైకార్’ రుణాలు,తదితరవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2014 నుంచి 2022 వరకు బీసీ సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 55,183.57 కోట్లు కేటాయించగా, అందులో రూ. 17,231.75 కోట్లు రిలీజ్చేసింది. ఇందులోనూ ఖర్చు చేసింది కేవలం రూ. 6,078.09 కోట్లు మాత్రమే. ఇక ఎంబీసీలకు రూ. 3305 కేటాయించగా, మంజూరు చేసింది కేవలం రూ. 1928 కోట్లే. అందులోనూ ఖర్చు చేసింది రూ. 605.51 కోట్లు మాత్రమే.
బీసీ సబ్ప్లాన్చట్ట బద్ధత ఏదీ..?
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్ట బద్ధత తీసుకువస్తామని సీఎం కేసీఆర్ 2017లోనే హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ ముచ్చట అమల్లోకి రాలేదు. బీసీసబ్ ప్లాన్అమలైతే కేటాయించిన బడ్జెట్ కు అదనంగా మరో రూ. 10 వేల కోట్లు సమకూరతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక 2017లో ఏర్పాటైన ఎంబీసీ కార్పొరేషన్అలంకార ప్రాయంగా మారింది. ఈ కార్పొరేషన్‌కు ప్రతి బడ్జెట్ లోనూ వెయ్యి కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం....2018–19 లో 75 శాతం, 2020–22లో 100 శాతం ఖర్చు చేయలేదు. ఇక చేనేత రంగానికి 2018–19లో కేటాయించిన రూ. 722 కోట్లలో 40 శాతం నిధులు ఖర్చు చేయలేదు. నాయీ బ్రహ్మణ కో–ఆపరేటివ్ సొసైటీల ఫెడరేషన్ కు 2017–18లో కేటాయించిన నిధుల్లో 91 శాతం ఖర్చు చేయలేదు. 2018–19లో 86 శాతంతో పాటు రజక కో–ఆపరేటివ్ సొసైటీస్ఫెడరేషన్ కు 2018–19లో కేటాయించిన నిధుల్లో 73 శాతం ఖర్చు చేయలేదు. ఆ తర్వాత సొసైటీలకు నిధులే కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి.
ఎస్టీ ఫండ్డైవర్షన్
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తున్నది. ట్రైబల్స్‌కు కేటాయించిన డబ్బులను ఇతర పథకాలను వినియోగిస్తున్నారు.ఎస్టీ స్పెషల్డెవలప్మెంట్నిధులను డబుల్ బెడ్రూమ్లకు డైవర్షన్చేశారు.ఏకంగా రూ.1700 కోట్లను మళ్లీంచారు. అర్బన్‌లో రూ. 800 కోట్లు, రూరల్ ఏరియాల్లో రూ. 900 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులతో 22,647 డబుల్ బెడ్రూమ్ఇళ్లను కట్టడానికి లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే రూ. 86.47 కోట్లను ఖర్చు చేసి 6,134 ఇళ్లను పూర్తి చేశారు. ఇక ఎస్టీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 6 శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అందుకు అనుగుణంగా మార్గదర్శకాలే రాలేదు. ఒక ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ను రూల్ ప్రకారం ప్రభుత్వం వచ్చే ఏడాదికి క్యారీఫార్వర్డ్ చేయాలి. కానీ కేవలం పేపర్లలోనే రూల్స్ఉన్నాయి. అమల్లోకి వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు.
ట్రై కార్గతి అంతేగా..?
2019–2020 ఆర్ధిక సంవత్సరం లో డ్రైవర్ఎంపవర్మెంట్స్కీమ్కొరకు సుమారు 9,780 అప్లికేషన్లను ఫైనల్ చేసినట్లు తెలిసింది. కానీ వాటిలో ఇప్పటి వరకు ఒక్కరికీ గిరిజన శాఖ నుంచి కార్లు అందలేదు.ఇప్పటికీ 2017–18 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు దారులకే కార్లు పంపిణీ చేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్పడం గమనార్హం.
మైనార్టీ సంక్షేమానికి బ్రేకులు...
మైనారిటీల సంక్షేమంపై సర్కార్ చిన్నచూపు చూస్తున్నది. నిధులు విడుదల చేయకపోవడంతో స్కీమ్‌లకు బ్రేక్‌లు పడుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు 673 కోట్లు ఆర్థిక సహాయం , స్వయం ఉపాది స్కీమ్ ల కొరకు బడ్జెట్కేటాయించగా, కేవలం రూ.262 కోట్లను మాత్రమే రిలీజ్చేశారు. దీంతో మైనార్టీ ల సంక్షేమం అస్తవ్యస్తమైంది. ప్రతిపాదనల్లో ఘనమైన బడ్జెట్ పెడుతూ, విడుదలలో మాత్రం కోత విధించడం దారుణం. ఎనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మైనార్టీ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం రావడం లేదు. తద్వారా ఎకనమిక్ స్కీమ్‌లన్నీ ఆగిపోయాయి.
కేటాయింపులు ఘనం.. ఖర్చు సగం
2014–15 నుంచి 2022–23 వరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్లకు దాదాపు రూ.1.40 లక్షల కోట్లను కేటాయించింది.అయితే ఇందులో మాత్రం ఖర్చు చేసింది కేవలం 55 శాతమే. అంటే రూ.79 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు వెల్ఫేర్‌శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఏడాది సగటున నాలుగు శాఖల్లో రూ.9 వేల కోట్లే ఖర్చు చేసింది.వెనుకబాటుతనానికి, వివక్షకూ గురయ్యే వర్గాల బడ్జెట్ కేటాయింపులు,ఖర్చుల విషయం చూస్తే ప్రభుత్వ తీరు స్పష్టంగా అర్థమవుతుంది.వీటిలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 9 బడ్జెట్లలో బీసీ సంక్షేమానికి కేవలం రూ.37,862 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసింది కేవలం రూ.24,487 కోట్లు మాత్రమే.అంటే దాదాపు 13 వేల కోట్ల రూపాయలకు కోతపడింది.ఇక 2014–15 నుంచి 2022–23 వరకు ఎస్సీ డెవలప్మెంట్కు రూ.55,655 కోట్లు కేటాయించారు.ఇందులో ఖర్చు చేసిన కేవలం రూ.29,188 కోట్లు మాత్రమే.దీంతో పాటు ఎస్టీలకు ఈ తొమ్మిదేండ్లలో రూ.25453 కోట్లు కేటాయించగా,ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ.16,503 కోట్లు. మరోవైపు మైనార్టీ వెల్ఫేర్ కింద చేసిన దాదాపు రూ.9100 కోట్లు ఖర్చుపెట్టారు. మిగితా నిధులు ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించారు.
Read More... వివాదంగా మారిన ధరణి పోర్టల్.. వరమా? శాపమా?