Minister Sridhar Babu : మీసేవ కేంద్రాల నిర్వహకులకు త్వరలో కమిషన్ పెంచుతాం

by Kalyani |
Minister Sridhar Babu : మీసేవ కేంద్రాల నిర్వహకులకు త్వరలో కమిషన్ పెంచుతాం
X

దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులకు త్వరలోనే కమిషన్ పెంచుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అదేవిధంగా మీసేవ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనిపై త్వరలోనే సీఎంకు నివేదిక అందజేస్తామని చెప్పారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో సోమవారం జరిగిన తెలంగాణ మీసేవ ఫెడరేషన్ 14వ వార్షికోత్సవాలలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మీ సేవ కేంద్రాల్లో నూతనంగా చేర్చనున్న కొన్ని అదనపు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అవినీతిని పారదోలడానికి 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం మీసేవ ప్రాజెక్టును తీసుకువచ్చిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు అవినీతి లేకుండా పౌరులకు సేవలు అందించడంలో మీసేవ ఒక ప్లాట్ ఫారంగా నిలిచిందన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా 500కు పైగా సర్వీసులను పౌరులకు అందిస్తున్నారని అన్నారు.

మీసేవ నాణ్యమైన సేవలను అందించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 మీసేవ కేంద్రాలు ఉన్నాయని, వీటితోపాటు ఫ్రాంచైజెస్ కేంద్రాలు దాదాపు 5000 పైచిలుకు ఉన్నాయని అన్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణకు ఆరోగ్యపరమైన భద్రతను కూడా కల్పించడం జరుగుతుందని, దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కేంద్రాల నిర్వాహకులకు లాభం చేకూర్చే విధంగా తన వంతు కృషి చేస్తానని, దీనిలో భాగంగానే కమిషన్ పెంచుతామని ప్రకటించారు. మీసేవ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్, మీసేవ కమిషనర్ (ఈఎస్ డి) రవి కిరణ్, తెలంగాణ మీసేవ ఫెడరేషన్ అధ్యక్షుడు బైరా శంకర్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్, సలహాదారు కర్ర శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల బాలరాజ్, కామిశెట్టి శ్రీనివాసరావు మెరుగు పవన్ కుమార్, కొత్తపల్లి సత్యనారాయణ, కోశాధికారి కె.శ్రీనివాస మూర్తి, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed