రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం.. : మాజీ మంత్రి కేటీఆర్

by Rajesh |
రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం.. : మాజీ మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసించి చేసుకోవాలే తప్ప.. యాచిస్తే కేంద్రం లొంగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోక్ సభ, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేయండి... రాజ్యసభలో ఎంపీలు కూడా కలిసి వస్తారని అన్నారు. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్న తాము తెలంగాణ ప్రజల పక్షమేనని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని వెల్లడించారు.

కేంద్రంలో బీజేపీ వాళ్ల నీతి మాలిన వ్యవహారాన్ని తాము ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. విద్యుత్ సంస్కరణాల పేరుతో డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తారు... దానికి రాష్ట్ర ప్రభుత్వం లొంగకూడదన్నారు. చీకటి ఒప్పందాలు, విలీనం అంటూ తప్పించుకునే ప్రయత్నం సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎక్కడికి పోమని, మిమ్మల్ని ఎండగడుతాం... మీపై పోరాడుతామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు కచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం... ఒత్తిడి చేస్తామన్నారు.

గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని తాము చెబుతున్నదే...ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు తాము సంపూర్ణ మద్దతిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రికి సంయమనం, ఓపిక ఉండాలన్నారు. తనను మేనేజ్ మెంట్ కోటా అంటున్నారని... తాను కూడా పేమెంట్ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చు అన్నారు. అయ్యా, తండ్రి కోటా అంటే సీఎం రేవంత్ రెడ్డి... రాహుల్ గాంధీని అంటున్నారా? రాజీవ్ గాంధీని అంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రారంభించిన చర్చకు తాము వందశాతం మద్దతిస్తున్నాం... స్వాగతిస్తున్నాం అన్నారు. ఉమ్మడి ఏపీ లో తెలంగాణ పదాన్ని నిషేధించినట్లే...ఇప్పుడు లోక్ సభలో తెలంగాణ పదాన్ని నిషేధించారన్నారు.

బీఆర్ఎస్ జెండా లేకపోవటం కారణంగానే లోక్ సభ లో తెలంగాణ అనే పదం నిషేధించబడిందన్నారు. ఇప్పుడు 8+8 అంటే గుండుసున్నా అనే పరిస్థితిని తెచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగటంపై మోడీతో కేసీఆర్ సఖ్యతతో లేకపోవటం కారణంగానే జరిగిందని సీఎం అన్నారని, తాము సఖ్యత తో ఉంటామని అంటూ హైదరాబాద్ లో ప్రధాని మోడీని బడే భాయ్ అని రేవంత్ రెడ్డి సంబోధించారన్నారు. కానీ తాము గతంలో చెప్పిందే మీకు ఇప్పటికీ అర్థం అయిందన్నారు. ఏమీ చేసిన సరే వాళ్లది తెలంగాణకు అన్యాయం చేయాలన్న తత్వమే ఉందన్నది మీకు ఇప్పుడు బోధపడిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా సరే తాము చాలా సాధించాం... కానీ కాంగ్రెస్ లాగా చేయని పనులకు క్రెడిట్ తీసుకోం అన్నారు. తాము తెచ్చిన, చేసిన పనులను మీ ఖాతాలో వేసుకున్నారు.. దానికి కూడా బాధలేదన్నారు.

పక్క రాష్ట్రానికి సాయం చేస్తే బాధ లేదు... కానీ తెలంగాణకు నిధులు ఇవ్వకపోవటం బాధగా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లు ఎవరైనా సరే వాళ్ల మెడలు వంచేందుకు బీఆర్ఎస్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందన్నారు. కేంద్రం సహకారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని సాధించాం... కొన్ని సాధించలేకపోయాం అన్నారు. సీఐఐ, ఎన్ఆర్సీ, విద్యుత్ సంస్కరణాలకు సంబంధించి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేశాం అన్నారు. కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వనందుకు కూడా లోక్ సభలో నిరసన తెలిపాం, ఓబీసీ జనాభా గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాలను రూపొందించినప్పుడు కూడా వ్యతిరేకించాం అన్నారు.

కేంద్రం సహకరించినా...సహకరించకపోయినా సరే తాము తెలంగాణ ప్రయోజనాల పనిచేశాం అన్నారు. మా ఉద్యోగాలు మాకే అంటూ 95 శాతం స్థానిక రిజర్వేషన్లు సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సింగరేణి ని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తే మేమే అడ్డుకున్నాం అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని స్వయంగా సీఎం మాట్లాడితే రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని వెల్లడించారు. యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ కాదు... లోక్ సభలో కాంగ్రెస్ 99 మంది ఎంపీలు పోరాటం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అని, మా జెండాలు మారదు... తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అన్నారు. పంజాబ్ కు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగితే ఆ రాష్ట్ర ఎంపీలు నిరసన తెలిపారని, మరి తెలంగాణ ఎంపీలు ఎక్కడ పోయారు. ఎందుకు నిరసన తెలుపలేదని నిలదీశారు. ‘ఏం చేసినా బజాప్తా చేస్తాం...మీ లాగా మేము మోడీ పేరు తీసుకోవటానికే భయపడే ప్రసక్తే లేదు’ అని వెల్లడించారు. ఇప్పుడు ఈ చర్చను 21 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించలేకపోయామని వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవటానికే సీఎం చర్చపెట్టారని ఆరోపించారు.



Next Story

Most Viewed