- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇక నుంచి ఊరుకునేది లేదు.. అక్రమాలకు పాల్పడితే బ్లాక్ లిస్ట్ ఖాయం

దిశ, తెలంగాణ బ్యూరో: నీటి ట్యాంకర్ కావాలని కస్టమర్లు బుక్ చేస్తే డెలివరీ చేయాల్సిన ట్యాంకర్ల డ్రైవర్లు, యజమానులు అక్రమాలకు తెరలేపారు. డొమెస్టిక్ ట్యాంకర్లను బుక్ చేసి కమర్షియల్‌గా విక్రయిస్తున్న కొంత ట్యాంకర్ల నయా దందాకు శ్రీకారం చుట్టారు. ఏకంగా కన్జూమర్ అకౌంట్ నెంబర్(సీఏఎన్)కు ట్యాంకర్ల డ్రైవర్ల నెంబర్లను అనుసంధానం చేసి విచ్చలవిడిగా ట్యాంకర్లను బుక్ చేశారు. గతేడాదిలో ఒక్కో క్యాన్ నెంబర్ పేరుతో 600 ట్యాంకర్లను బుక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. మరో ట్యాంకర్ డ్రైవర్ 400, ఇంకొకరు 300, 200 ట్యాంకర్లను బుక్ చేశారు. వేసవిలో తాగునీటి డిమాండ్‌ను ఆసరాగా చేసుకుంటున్న ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు అక్రమాలకు తెరలేపారు. ఇలాంటి అక్రమాలపై జలమండలి నిఘా పెట్టింది.
బ్లాక్ లిస్టులో ఆ 160 క్యాన్ నెంబర్లు..
గతేడాదికాలంగా అత్యధికంగా ట్యాంకర్లను బుక్ చేసిన క్యాన్ నెంబర్లను జలమండలి ఐటీ అధికారులు గుర్తించారు. 100 నుంచి 600 ట్యాంకర్ల వరకు బుక్ చేసిన 40 మంది కస్టమర్ల నెంబర్లను వెలికితీశారు. 50 కిపైగా ట్యాంకర్లను బుక్ చేసిన మరో 120 మందిని కూడా గుర్తించారు. 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40 ట్యాంకర్లను బుక్ చేసిన నెంబర్లను చూసి జలమండి ఐటీ అధికారులు షాక్ అయ్యారు. ఆ క్యాన్ నెంబర్లకు ట్యాంకర్ డ్రైవర్ల ఫోన్ నెంబర్లు పెట్టి బుక్ చేస్తున్నట్టు గుర్తించారు. వీటిలో 160 క్యాన్ నెంబర్లను జలమండలి అధికారులు బ్లాక్ చేయాలని నిర్ణయించారు.
జలమండలికి రూ.కోటి నష్టం..
ట్యాంకర్ల అక్రమాలతో జలమండలికి సుమారు రూ.కోటి నష్టం వాటిల్లినట్టు అంచనా. 40 క్యాన్ నెంబర్ల ద్వారా 100కుపైగా చొప్పున 4వేల ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. మరో 120 క్యాన్ నెంబర్ల ద్వారా 50 చొప్పున 6 వేల ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. వీటికి డొమెస్టిక్ ఫీజు రూ.500 చెల్లించి బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో ట్యాంకర్ రూ.1000 చొప్పున విక్రయించారని అధికారులు గుర్తించారు. ఈ లెక్కన 10వేల ట్యాంకర్లకు రూ.1000 చొప్పున కోటిరూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.
టార్గెట్ 3 లక్షల ట్రిప్పులు..
జలమండలిలో పరిధిలో 79 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. సుమారు 900 ట్యాంకర్ల ద్వారా నెలలో 1.50 లక్షలకు పైగా ట్రిప్పుల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో ప్రజలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్ల సంఖ్యను 1000కి పెంచాలని జలమండలి నిర్ణయించింది. ఒక్కో ట్యాంకర్ 10 ట్రిప్పుల చొప్పున రోజుకు 10 వేలు, నెలకు 3 లక్షల ట్రిప్పులకు పెంచాలని నిర్ణయించారు.
ఫాస్టాగ్ తరహాలో క్యూఆర్ కోడ్..
ఫిల్లింగ్ స్టేషన్‌కు ట్యాంకర్ వచ్చేటప్పుడు, నీటిని నింపుకుని బయటికెళ్లేందుకు గేట్ పాస్ జారీచేసే విధంగా క్యూఆర్ కోడ్ పాటు హెడ్ ఆఫీసులోని మెట్రోకస్టమర్ కేర్ సెంటర్(ఎంసీసీ)కు అనుసంధానం చేయనున్నారు. జీపీఎస్ ద్వారా ట్యాంకర్ కస్టమర్ ఇంటికే వెళ్లుందా? లేదా? అనే విషయాన్ని ట్రాక్ చేయనున్నారు. అయితే ముందుగా అత్యధిక ట్రిప్పులను డెలివరీ చేస్తున్న 30 ఫిల్లింగ్ స్టేషన్లలో కోడింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త టెక్నాలజీ అమలు చేయడానికి ఓ బ్యాంకు ప్రతినిధులు సైతం ఎండీ, ఈడీతో చర్చించినట్టు తెలిసింది. దీంతోపాటు ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లకు ప్రీపెయిడ్ కార్డులను సైతం జారీ చేయనున్నారు. కార్డును స్వైప్ చేస్తేనే ట్యాంకర్‌ను ఫిల్లింగ్ స్టేషన్‌లోకి అనుమతించనున్నారు. దీంతో పెండింగ్ బిల్లులకు చెక్ పెట్టనున్నారు.
క్యాన్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు బ్లాక్: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
అక్రమాలకు పాల్పడిన క్యాన్ నెంబర్లు, మొబైల్ నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టనున్నట్టు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఐటీ వింగ్ అధికారులతో ఎండీ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై చర్చించారు. గతేడాది కాలంలో అత్యధిక ట్యాంకర్లు బుక్ అయ్యాయని.. ఇదే సమయంలో నలభైకి మందికిపైగా డ్రైవర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించామని తెలిపారు. ట్యాంకర్ బుక్ చేసుకోలేని వారి క్యాన్ నెంబర్లను గుర్తించి, వారి క్యాన్ నంబర్‌కు డ్రైవర్ల నెంబర్లు అనుసంధానం చేసి వాళ్లే డొమెస్టిక్ అవసరాల కోసం బుక్ చేసి బ్లాక్‌లో అమ్మినట్లు గుర్తించామన్నారు. అక్రమాలకు పాల్పడితే బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటు గతేడాది అక్రమ పద్ధతిలో ట్యాంకర్లు బుక్ చేసిన మొబైల్ నెంబర్లు, క్యాన్ నంబర్లను బ్లాక్ చేయనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, ఐటీ వింగ్ అధికారులు పాల్గొన్నారు.