మరో ఉద్యమానికి సిద్ధమైన ఖిలాషాపూర్... పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని...

by S Gopi |   ( Updated:2023-03-16 08:57:32.0  )
మరో ఉద్యమానికి సిద్ధమైన ఖిలాషాపూర్... పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని...
X

దిశ, రఘునాథపల్లి: పోరుగడ్డ ఖిలాషాపూర్ మరో ఉద్యమానికి ఊపిరి పోసుకుంది. విషవాయువులు వెదజల్లుతూ ప్రాణాలు తీసే కెమికల్ కంపెనీ మాకొద్దు అంటూ రెండు రోజులుగా ఆందోళన బాట పట్టారు గ్రామస్తులు. ఊపిరి సలుపుకోకుండా గ్రామస్తుల పాలిట శాపంగా మారిన కెమికల్ కంపెనీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని కోరుతూ జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన మహిళలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ పునర్నిర్మాణానికి వ్యాపారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రామం మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది. రఘునాథపల్లి నుండి నర్మేట వెళ్లే దారిలో ఖిలాషాపూర్ వద్ద 2017 లో తార తిన్నర్ కంపెనీని హైదరాబాదుకు చెందిన వ్యాపారాలు ప్రారంభించారు. మూడేళ్ల పాటు ఈ కంపెనీలో తిన్నర్ ఉత్పత్తి జరిగింది. ప్రమాదవశాత్తు 2020, జనవరి 31న రియాక్టర్ ను చార్జింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై కంపెనీ మంటల్లో కాలిపోయింది.

అయితే, ఈ మూడేళ్లలోనే బయటకు వచ్చిన రసాయనాల కారణంగా గ్రామంలో అనేకమంది ఊపిరి తిత్తుల వ్యాధి బారిన పడి ఓ యువకుడు కూడా మృతి చెందగా అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పటికి గ్రామస్తులు మేలుకోలేదు. ప్రమాదం జరిగిన రోజు దుర్వాసనతో 150 మంది కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో డాక్టర్లు శ్వాస కోస వ్యాధులు ప్రబలుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కంపెనీ ఇక్కడ ఉంటే గ్రామానికే ప్రమాదం అని తేల్చి చెప్పారు. ప్రమాదవశాత్తు కంపెనీలో మంటలు చెలరేగితే బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకున్న కంపెనీ యాజమాన్యం తిరిగి సదరు కంపెనీని ఇప్పుడు పునర్నిర్మించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఖిలాషాపూర్ గ్రామస్తులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మహిళలు గ్రామంలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఎలాగైనా కెమికల్ కంపెనీ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

నా కొడుకు ప్రాణాలు పోయాయి: కత్తి పద్మ

ఈ కంపెనీ నుండి వెలుబడిన రసాయనాల కారణంగానే తన కొడుకు సునీల్ ఊపిరితిత్తులు పాడైపోయి మృతి చెందాడని, ఇలాంటి కంపెనీ గ్రామంలో ఉండకూడదని ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన కత్తి శోభ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు లాగా మరొకరు ప్రాణాలు కోల్పోవద్దని ఆమె అన్నారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే రసాయన కంపెనీలను జనావాసాల సమీపంలో అనుమతులు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. ఇలాంటి కంపెనీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆమె ఆవేదనతో ప్రభుత్వాన్ని కోరింది.

నీళ్లు కాదు...రసాయనాలు తాగినట్టుంది: జిట్ట శోభ

కంపెనీ యజమానులు తమ బోరు నీళ్లు తాగి చూసి ఆ తరువాత కంపెనీని ప్రారంభించాలని గ్రామానికి చెందిన జిట్ట శోభ కంపెనీ యజమానులకు సూచించారు. కంపెనీ పక్కనే తనకు వ్యవసాయ భూమి ఉందని, ఆ వ్యర్ధాలు అన్ని భూమిలోకి పోయి, భూగర్భ జలాలన్నీ కాలుష్యం అయ్యాయని వాపోయారు. ఈ సమీప ప్రాంతంలో ఏ బోరు నీరు తాగినా, రసాయనాలు తాగినట్టుగా ఉందని, వ్యవసాయ పనులకు కూలీలు కూడా రావడంలేదని, వేరే గ్రామం నుంచి కూలీలను తీసుకువస్తే ఆ వాసన భరించలేక తిరిగి మరో రోజు రావడం లేదని వాపోయారు. ప్రాణాలు హరించే ఈ కెమికల్ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ప్రజలకు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో మరో చూడాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

ఈ ఆందోళనలో గ్రామానికి చెందిన మహిళలు స్వచ్ఛందంగా తరలిరాగా గ్రామ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, గ్రామస్తులు యామంకి సుధాకర్, సురిగల బిక్షపతి తదితరులతోపాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story