తెలంగాణ ఉద్యమంలో కడియం శ్రీహరి పాత్ర ఎక్కడుంది : ఈటల

by Dishaweb |   ( Updated:2023-08-24 12:06:09.0  )
తెలంగాణ ఉద్యమంలో కడియం శ్రీహరి పాత్ర ఎక్కడుంది : ఈటల
X

దిశ, వేలేరు(స్టేషన్ ఘన్ పూర్): రానున్న ఎన్నికల్లో తెలంగాణకు కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్ లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ....రానున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య జరగబోతున్నాయని అన్నారు. ఘన్ పూర్ నియోజకవర్గంలో హుజురాబాద్ ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు ఏం పని చేసి సంపాదించిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న రూ.850 కోట్ల రూపాయలు ఎవరిచ్చారని నిలదీశారు.

సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, జనాభా లో 11 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానపరిచాడని అన్నారు. తెలంగాణ లో 1 శాతం ఉన్న వెలమలకు అన్ని మంత్రి పదవులు ఎందుకని ప్రశ్నించారు. బీసీల జనాభా 52 శాతం అయితే వారికి ఇచ్చిన అసెంబ్లీ సీట్లు 23 మాత్రమేనని, ముదిరాజులకు ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకుండా వారిని అవమానించారని అన్నారు. బీసీలకు కావల్సింది గొర్రెలు, చాపలు కాదని రాజ్యాధికారం కావాలని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, చాయ్ అమ్ముకునే వ్యక్తిని బీజేపీ ప్రధానమంత్రిని చేసిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ ను కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి కల్గిస్తామని అన్నారు. గత పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని స్కాములే చేసిందని విమర్శించారు. గ్రామాల్లో గల్లీకో బెల్టుషాపు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని, తెలంగాణ ను తాగుబోతుల రాష్ట్రం గా కేసీఆర్ మార్చాడని అన్నారు.

గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు ఎక్కువయాయని బీజేపీ నాయకుల మీటింగ్ లకు వెళితే దళితబంధు రాదని, పింఛన్లు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. నేను, మాజీ మంత్రి విజయరామారావు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు కడియం శ్రీహరి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ప్రతిసారి గొప్పగా దేవాదుల సృష్టికర్త అని చెప్పుకుంటారని, ఆయన దేవాదుల సృష్టికర్త కాదని ఎన్ కౌంటర్ ల సృష్టికర్త అని అన్నారు.

కడియం శ్రీహరి 14 సంవత్సరాలు మంత్రి గా ఉన్న సమయంలో ఏలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. ఉద్యమ సమయంలో అందరూ జై తెలంగాణ అంటే కడియం శ్రీహరి మాత్రం నై తెలంగాణ అన్నాడని విమర్శించారు. శ్రీహరిని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులే చిత్తుగా ఓడిస్తారని అన్నారు. జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు వ్యతిరేక వార్తలు రాస్తే ఇండ్ల స్థలాలు ఇవ్వమని బెదిరిస్తున్నాడని అన్నారు. కేసీఆర్ ను మళ్లి గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ద్వజమెత్తారు. నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి చెప్పే మాయమాటలు నమ్మకుండా తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, కర్ణాటక రాష్ట్రం కుందన్ గోల్ ఎమ్మెల్యే ఎం. ఆర్. పాటిల్, మాజీ మంత్రి గుండె విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, చింతా సాంబమూర్తి, జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు మాదాసి వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్, వివిధ మండలాల అధ్యక్షులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed