గత పాలకుల నిర్లక్ష్యంతోనే 'సీతారామ' ఆలస్యం : మంత్రి పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాల సాగుకు సీతారామ ప్రాజెక్టు

Update: 2024-07-02 12:14 GMT

దిశ,డోర్నకల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాల సాగుకు సీతారామ ప్రాజెక్టు జీవధార వంటిదని, గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, దీంతో రెండు జిల్లాల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర గృహ, సమాచారం, సాగునీటి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరిత గతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగు నీటిని అందించటమే లక్ష్యమన్నారు. కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక లింక్ కెనాల్ లను కూడా రూ.100కోట్లతో త్వరలో నిర్మిస్తామన్నారు. మంగళవారం మంత్రి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని చాప్ల తండా వద్ద సీతారామ ప్రాజెక్టు డిజైన్ ను మ్యాప్ ద్వారా జరిగిన పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు.

రీ డిజైన్ పేరుతో మోసం..

డోర్నకల్ ప్రాంతానికి సాగునీరు కోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తీసుకురావటానికి గత ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. కానీ దివంగత నేత ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో కాలయాపన చేసి రెండు జిల్లాల రైతాంగం పై సవతి తల్లి ప్రేమను చూపిందన్నారు. 2 లక్షల 75 వేల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో రూ.2800కోట్ల వ్యయాన్ని పేరు మార్చి మొదటి 9 వేల కోట్లు వాటినే మళ్లీ రూ.18వేల కోట్లకు పెంచిందన్నారు. దీంట్లో సుమారు రూ.8500కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీరు అందించలేకపోవడం హాస్యాస్పదమన్నారు.

కాంగ్రెస్ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పనులు..

ఖమ్మం జిల్లా కొంత వరంగల్ జిల్లాలో సాగునీటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు మంత్రులు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నామన్నారు. ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు, కెనాల్ నిర్మాణం, లిఫ్జులు, రిజర్వాయర్ పనులపై పూర్తిగా దృష్టి సారించామన్నారు. ఇప్పటికే పదిహేను రోజుల క్రితం హెడ్ వర్క్స్, ఫస్ట్ లిఫ్ట, థర్డ్ లిఫ్ట్ పరిశీలించండం జరిగిందన్నారు. మొదటి లిఫ్ట్ను వెట్ రన్ కూడా ట్రయల్ వేయటం జరిగిందన్నారు. హెడ్ రీచ్ వద్ద పనులు పూర్తి అయినా కెనాల్ పనులు పూర్తి గా కాకపోవటంతో నీటి విడుదల ఆలస్యమవుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కెనాల్ నిర్మాణానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి కాకపోవడం సిగ్గు చేటన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులకు టెండర్ల పిలిచి త్వరిత గతిన పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గత పాలకులు ఆర్థిక లబ్ధి పొందారు తప్ప పనిని పూర్తి చేసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. గత పాలకులు ఇంత పెద్ద కెనాల్ ఏర్పాటు చేయాలని సూచించి కనీసం రిజర్వాయర్ లు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు 10టీఎంసీలతో ఓ రిజర్వాయర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎన్నడైన కెనాల్ సిస్టం లో లోపం ఏర్పడితే రిజర్వాయర్ ద్వారా రైతులకు నీరందించవచ్చన్న అభిప్రాయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు.

నాగార్జున సాగర్ కాలువకు లింక్ కెనాల్..

నాగార్జున సాగర్ ఆయకట్టులో సుమారు ఒక లక్ష యాబై అయిదు వేల ఎకరాలను, మీడియం ప్రాజెక్ట్ లైన వైరా, లంకా సాగర్ రెండు ప్రాజెక్ట్ పరిదిలో ఉన్న ఆయకట్టుతో పాటు మైనర్ ఇరిగేషన్ లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా లింక్ కెనాల్ ను అనుసంధానం చేసి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అందులో భాగంగా సుమారు రూ.100కోట్లు ఖర్చు పెట్టి ఓ లింకు కెనాల్ ను ఏర్పాటు చేసి ఏన్కూరు వద్ద కృష్ణా కాలువలో వదిలేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టు మరింత పెరిగే అవకాశముందన్నారు.

వృథాగా పోతున్న నీటి మళ్లింపు..

సీతారామ మెయిన్ కెనాల్ 37 కి.మీ వద్ద హెడ్ రీచ్ వద్ద మున్నేరు నది పై నుంచి గ్రావిటీతో సుమారు ప్రతి ఏటా కృష్ణా బ్యారేజీకి 38 నుంచి 42 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిని గ్రావిటీతో మున్నేరు నీటిని ఈ సీతారామ ప్రాజెక్టులో డ్రాప్ చేసి పాలేరు రిజర్వాయర్ కు పంపించటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కెనాల్ తవ్వితే కరెంట్, ఇతర అవసరాలతో సంబంధం లేకుండా ఈ నీటిని సాగునీటికి మళ్లించవచ్చన్న ఆలోచన చేస్తున్నామన్నారు. గత పాలకుల ఆలోచన లోపం, ఇరిగేషన్ పట్ల వారికి ఉన్న అవగాహన రాహిత్యం వల్ల ఇంత పెద్ద సీతారామ కెనాల్ కు రిజర్వాయర్ ఏర్పాటుకు కూడా వారు ముందడుగు వేయలేదన్నారు.

ఏకకాలంలోనే రైతులకు రుణమాఫీ..

రైతులకు 2లక్షల రుణమాఫీని రెండు నెలల లోపు అందిస్తామని రాష్ట్ర రెవెన్యు, గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా సీతారామ ప్రాజెక్టులో భాగంగా భూమిని కోల్పోయిన బాధితుల నష్టపరిహారం కూడా త్వరలోనే అర్హులైన వారికి అందేలా చూస్తామన్నారు.

ఉద్యోగాలపై మాట్లాడటం సిగ్గుచేటు..

యువతను పట్టించుకోకుండా గత పాలకులు వారి జీవితాలను అగాధంలోకి నెట్టి వేశారన్నారు. గతంలో యువతను, నిరుద్యోగులను పట్టించుకోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు నేడు వారిపై లేని ప్రేమను నటిస్తూ యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం సిగ్గు చేటన్నారు. గత ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించి వాటిని లీక్ చేసి యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన చరిత్ర గత పాలకులదన్నారు. అలాంటి వారు నేడు యువత, ఉద్యోగాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. టీఎస్ పీఎస్సీని గత పాలకు భ్రష్టు పట్టిస్తే అలాంటి వ్యవస్థను పున:రుద్దరించి మళ్లీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గాడిన పెట్టిందన్నారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తి చేశారన్నారు. అన్న మాట ప్రకారం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఒకదాని తర్వాత మరొకటి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటు పోతుందన్నారు.

యువత గత పాలకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, టీఎస్ పీఎస్పీ ద్వారా త్వరలో విడుదల పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచంద్రునాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్,అడిషన్ కలెక్టర్ డేవిడ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నూకల నరేష్ రెడ్డి,మూడు మండలాల ఇన్చార్జి కాలం రవీందర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, మండల నాయకులు హనుమ, పట్టణ నాయకులు సుమేర్ జైన్, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న,వైస్ చైర్మన్ కోటిలింగం, మరిపెడ నాయకులు షేక్ తాజుద్దీన్, మహబూబాబాద్ ఆర్డీవో ఎల్.అలివేలు,అదనపు ఎస్పీ తిరుపతి రావు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Similar News