బల్దియా గ్రీవెన్స్‌ సెల్‌కు అధికారుల డుమ్మా.. కమిషనర్‌ లేకపోతే అంతే..

by Vinod kumar |
బల్దియా గ్రీవెన్స్‌ సెల్‌కు అధికారుల డుమ్మా.. కమిషనర్‌ లేకపోతే అంతే..
X

దిశ, వరంగల్‌ టౌన్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలన వ్యవహారాలు విస్తుగొల్పుతున్నాయి. ఇప్పటికీ ప్రతీ పనికి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బల్దియా అధికారులు, ఇప్పుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చవిచూడాల్సిన దుస్థితి దాపురించింది. వారానికి ఒక్క రోజైనా ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా అధికారులకు తీరిక దొరకడం లేదా..? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బల్దియాలో ప్రతీ సోమవారం ప్రజా సమస్యలు పరిశీలనార్థం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తుంటారు. ఇందులో అన్ని విభాగాల అధికారులు తప్పక హాజరవుతుంటారు.


అయితే, రెండు వారాలుగా పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది.ఈ సోమవారం కూడా పలు విభాగాల అధికారులు గైర్హాజర్‌ కావడంతో ఖాళీ కుర్చీలే దర్శనిమిచ్చాయి. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు బల్దియా పరిధిలో 10 కిలోమీటర్ల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారు. తీరా తమ సమస్యపై సమాధానం ఇచ్చే వారు గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులు అందుబాటులో లేకపోవడం బాధితులు నిరాశ చెందాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

కమిషనర్‌ లేకపోతే అంతే..

గ్రీవెన్స్‌ సెల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. రెండు వారాలుగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ఇతర పనుల కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. ఇదే అదనుగా పలువురు అధికారులు కూడా రెండు వారాలుగా డుమ్మా కొడుతున్నట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది. గ్రీవెన్స్‌కు వచ్చిన అధికారులు కూడా మధ్యలో వెళ్లి తమ విభాగాలకు వెళ్లి బాతాఖానీ పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

టౌన్‌ ప్లానింగ్‌కే ఎక్కువ..

ఇక గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే వినతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి చెందిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. ఈ వారం మొత్తం 83 మంది విజ్ఞాపనలు రాగా.. అందులో టౌన్‌ ప్లానింగ్‌పై 40 ఫిర్యాదులు రావడం గమనార్హం. ఇంటి నంబర్ల కేటాయింపు, భూ ఆక్రమణలు, ఆక్రమిత భూముల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడంపైనే ప్రజల నుంచి ఎక్కువగా వినతులు వస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో అధికారుల విధి నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లంచాలకు అలవాటు పడిన అధికారులు కొందరు అక్రమార్కులకకు అండగా నిలవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తీరా తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చినా.. వినేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్యలకు మూల కారుకులం తామే కదా..! మళ్లీ ఆ సమస్యలు విని ఏం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో అధికారులు డుమ్మా కొడుతున్నారని మండిపడుతున్నారు. అధికారుల తీరుతో ఒకే సమస్యపై నెలలకొద్దీ బల్దియా ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని.. ఈ మేరకు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story