- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Warangal: రోడ్లపైనే మార్కెట్లు!.. విచ్చలవిడిగా కూరగాయల వ్యాపారం
దిశ, వరంగల్ టౌన్ : కూరగాయల వ్యాపారం మళ్లీ వీధికెక్కింది. రహదారుల వెంబడే కొనసాగుతోంది. రూ. 6కోట్ల 87లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన లక్ష్మీపురం మోడల్ మార్కెట్‌కు చుట్టూ పిల్ల మార్కెట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సర్కారు లక్ష్యం, అధికారుల ప్రణాళికలు చెత్తకుండీల పోసిన కూరగాయలుగానే వ్యర్థమవుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా చారిత్రాత్మకమైన ఓరుగల్లు పట్టణానికి సమగ్రమైన మార్కెట్‌ను అందించలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. వ్యాపారులకు లాభదాయకం, వినియోగదారులకు అవసరం తీరినా ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నదన్న విషయాన్ని ఎవరూ గమనించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే పారిశుధ్య లోపం, ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది.
మూడు దిక్కులా..
గతంలో వరంగల్ హెడ్ పోస్టాఫీసు పక్కన వీధిలో సీకేఎం ఆస్పత్రి ప్రాంగణంలో కూరగాయల మార్కెట్ సాగేది. అప్పటి నగర జనాభా, అలాగే సీకేఎం ఆస్పత్రి సేవలకు స్థలం సరిపోవడం లేదని మార్కెట్‌ను వరంగల్ బస్టాండ్ సమీపంలో ఒకప్పుడు గోదాములు ఉన్న లక్ష్మీపురం ఏరియాకు మార్చారు. కమీషన్ వ్యాపారులు, అడ్తీదారుల కోసం ప్రత్యేకంగా గదులు నిర్మించారు. మార్కెట్ లోపల ఆవరణ ఇరుకుగా మారడం.. పలువురు రిటేల్ వ్యాపారులు బస్టాండ్, కాశిబుగ్గ ప్రధాన రహదారిపైనే అమ్మకాలు జరపడంతో పలు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆ స్థలం కూడా సరిపోవడం లేదని మూడేళ్ల కిందట పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మోడల్ మార్కెట్ పేరిట కొత్తగా 96 కమీషన్ షాపులు, ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి అందులో 158 రిటేల్ వ్యాపారాలు సాగేలా వసతులు కల్పించారు.
మళ్లీ పాత కథే!
కొత్తగా గదులు, ప్రత్యేకంగా షెడ్డు నిర్మించడంతో పాటు పార్కింగ్ కు కేటాయించిన ప్రాంతంలోనూ వ్యాపారులకు అనువుగా మార్కెట్ అధికారులు ఓపెన్ ప్లాట్లు ఏర్పాట్లు చేశారు. దీంతో షెడ్డులో ఏర్పాటు చేసిన 158 రిటైల్ షాపులు నిరుపయోగంగా మారాయి. అయినా మళ్లీ పాత కథే. మార్కెట్‌లో సాగుతున్న విక్రయాలు పోనూ మళ్లీ మార్కెట్ చుట్టూరా చిల్లర వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. బస్టాండ్ కాశీబుగ్గ రహదారి సైతం కూరగాయల అమ్మకాలకే నెలవుగా మారింది. దీంతో మోడల్ మార్కెట్ లక్ష్యం.. అధికారుల ప్రణాళికలు బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి. మరోపక్క వరంగల్ హెడ్‌పోస్టాఫీసు వద్ద సైతం చిల్లర వ్యాపారం సాగుతూనే ఉంది. అండర్‌బ్రిడ్జి మార్గంలో ఒకవైపు మొత్తం కూరగాయల దుకాణాలు రోడ్డుపైనే సాగుతున్నాయి. వీటితో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. వాస్తవానికి గతంలో మార్కెట్ చుట్టూ, మార్కెట్ లోపల రిటేల్ వ్యాపారులను కలుపుకునే మోడల్ మార్కెట్‌లో ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు పలుమార్లు వెల్లడించారు. మరీ.. మళ్లీ రోడ్డుమీద వ్యాపారాలు సాగించే వారు ఎవరు? కొత్తగా వచ్చారా? లేదా పాతవారే.. మార్కెట్‌లో వారికి కేటాయించిన ప్లాట్లు అద్దెకిచ్చి ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కొత్తవారే అయితే, మోడల్ మార్కెట్ నిర్మాణం ఎందుకు? వారికి మార్కెట్లో అవకాశం కల్పించినా.. మళ్లీ మరొకరు రోడ్డు మీద దుకాణాలు పెట్టరని గ్యారంటీ లేదు? మరి ఈ సమస్యకు ఎప్పటికి పరిష్కారం దొరుకుతుందో లేదో? ప్రణాళికలు రూపొందించిన అధికారులు, పైసలు కేటాయిస్తున్న ప్రజాప్రతినిధులకే తెలియాలి.