తూర్పువరంగల్‌‌లో గెలుపు బాటలు : MLA Narender

by Dishaweb |   ( Updated:2023-08-29 14:53:33.0  )
తూర్పువరంగల్‌‌లో  గెలుపు బాటలు : MLA Narender
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తన గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానని భరోసా కల్పిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మంగళవారం 22వ డివిజన్‌లో రూ.2.98కోట్లతో, 23వ డివిజన్‌లో రూ.3.95కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో ఆదర్శంగా, సంక్షేమంలో ప్రథమంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.4వేల కోట్లతో నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 24 అంతస్తుల సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, కలెక్టరేట్‌ భవనం, కొత్త బస్టాండ్‌ నిర్మాణం పురోగతిలో ఉన్నాయన్నారు. అధునాతన మార్కెట్‌ కూడా అందుబాటులోకి రానుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించి, సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో 22వ డివిజన్‌ ఇంచార్జ్‌ విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు కంచర్ల శివ, 23వ డివిజన్‌ అధ్యక్షుడు బొల్లు సతీష్‌, డీసీసీబీ డైరెక్టర్‌ యేలుగం రవిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story