తెలంగాణ‌కు క‌ష్టమొచ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ప్రాంతం నిల‌బ‌డింది : సీఎం రేవంత్‌

by Aamani |
తెలంగాణ‌కు క‌ష్టమొచ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ప్రాంతం నిల‌బ‌డింది : సీఎం రేవంత్‌
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా గొప్ప చైత‌న్యమున్న ప్రాంత‌మ‌ని, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఏ క‌ష్టమొచ్చినా నిటారుగా నిల‌బ‌డిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి మేధావులు, ప్రజా, ఉద్యమ నేత‌ల పాత్ర ఎంతో గొప్పద‌ని అన్నారు. దాశ‌ర‌థి, కాళోజీ, జ‌య‌శంక‌ర్‌సార్, బ‌మ్మెర పోత‌న‌లాంటి ఎంతోమంది జ‌న్మించిన నేల‌ని అన్నారు. జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లిలో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అధ్యక్షత‌న ఆదివారం జ‌రిగిన‌ ప్రజాపాల‌న ప్రగ‌తిబాట‌ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాక‌తీయులు ఏలిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత‌ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంద‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర కీలకమని, అందుకే వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. వరంగల్ ను హైదరాబాద్ కు పోటీ పడేలా అభివృద్ధి చేస్తామన్నారు. రాంపూర్ డంపింగ్ యార్డు సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మామునూరులో ఎయిర్‌పోర్టును మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని, దాన్ని త్వర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు.

అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావ‌డం జ‌రిగింద‌న్నారు. వ‌రంగ‌ల్ రింగ్ రోడ్డుకు, వ‌రంగ‌ల్ అండ‌ర్ డ్రైనేజీ నిర్మాణాల‌కు రూ.6500 కోట్ల నిధుల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాకే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, మామునూరుకు ఎయిర్‌పోర్టు వ‌చ్చాయ‌ని, కాళోజీ కళాక్షేత్రం పూర్తయింద‌ని, రింగ్‌రోడ్డు నిర్మాణానికి చ‌ర్యలు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఆగిపోయిన రైల్వే ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నులు మొద‌ల‌య్యాయ‌న్నారు. ఈ ప్రభుత్వం వ‌చ్చాకే స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి రూ.800కోట్లు ఇవ్వగ‌లిగామ‌ని అన్నారు.ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌సార్ స్వగ్రామం అక్కంపేట‌ను రెవెన్యూ విలేజ్‌గా కూడా గ‌త‌ప్రభుత్వం గుర్తించి ఏర్పాటు చేయ‌లేక‌పోయింద‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ విలేజ్‌గా చేయ‌డం జ‌రిగింద‌న్నారు. వ‌రంగ‌ల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబడి ఉంద‌న్నారు.

ఘ‌న్‌పూర్ అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం...

అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు స‌భా ప్రాంగ‌ణానికి స‌మీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల నృత్యంతో, బంజారా కళాకారుల థింసాతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ముందుగా వివిధ శాఖ‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప‌రిశీలించారు. అనంత‌రం వ‌ర్చువ‌ల్ విధానంలో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.800కోట్లతో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌కు సీఎం శంకు స్థాప‌న చేశారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 630.27 కోట్ల నిధులు మంజూరు చేసింది.

రూ.102.1 కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ రుణాలపై వడ్డీ రాయితీగా రూ.92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లాలోని 1289 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.100.93 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మంత్రులు కొండా సురేఖ, సీత‌క్క , జిల్లా ఇన్​చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్వినీ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed