- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రపోతున్న మూడో నేత్రం.. బెంబేలెత్తుతున్న ప్రజలు
దిశ, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలకేంద్రంలో ఇటీవల వరుస చోరీలతో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. కాగా, వరుస చోరీలతో మండలవాసులు బెంబేలెత్తుతున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, ప్రజలతో రద్దీగా ఉండే మండలకేంద్రంలో వరుసగా బైకులు, సెంట్రింగ్ సామాగ్రి దొంగతనాలకు గురికావడం కలకలం రేపుతోంది. నేరస్తులను ఇట్టే పసిగట్టే నిఘానేత్రాలు గత కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీంతో దొంగలు దర్జాగా తమ చేతివాటం చూపుతున్నారు.
వరుసగా చోరీలతో బెంబేలు
మండల కేంద్రంలో బైక్ చోరీలు వరసగా జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వినాయకచవితి నిమజ్జనం రోజున మండలకేంద్రానికి చెందిన గండ్రకోటి నరేందర్ అనే యువకుడు రైల్వే స్టేషన్ దగ్గర నెహ్రూ సెంటర్ సమీపంలో రాత్రి టీఎస్24సీ1241 గల హోండా షైన్ బైక్‌ను రాత్రి 8గంటల సమయంలో పార్క్ చేశాడు. గంట తరువాత వెళ్లి చూడగా బైక్ చోరికి గురైంది. దీంతో వాహనదారుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత కొద్ది రోజులకే గుండ్రపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు నెహ్రూ సెంటర్ సమీపంలోని గుండ్రపల్లి రోడ్డులోని ఓ ఇంటి వద్ద టీవీఎస్ ఎక్సెల్ వాహనం నిలిపి పని నిమిత్తం వరంగల్ వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూడగా ఎక్సెల్ వాహనం సైతం చోరీకి గురికావడంతో యువకుడు నివ్వెరపోయాడు. ఇలా వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలోనే ఇటీవల వ్యవసాయ మార్కెట్‌కు ఎదురుగా ఉన్న ఏరియాలో కంది జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. స్లాబ్ పోసేందుకు సెంట్రింగ్ మేస్త్రి ఇనుప సెంట్రింగ్ డబ్బాలు ఇంటి ఆవరణలో ఉంచాడు. అక్టోబర్ 28న రాత్రి సమయంలో ఆ ప్రాంతానికి ఆటోలో చేరుకున్న అనుమానితుడు సెంట్రింగ్ డబ్బాలు దొంగిలించి ఆటోలో వేసుకొని వెళ్లాడు. అదే అనుమానితుడు మరుసటి రోజు అక్టోబర్ 29న సైతం అదే రీతిలో సెంట్రింగ్ డబ్బాలను దొంగిలించిన దృశ్యాలు సమీపంలోని ప్రైవేట్ వ్యక్తి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ చోరీలో సుమారు 130 సెంట్రింగ్ డబ్బాలు చోరికి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనతో ఎప్పుడు ఎక్కడ దొంగతనం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అలసత్వం వీడని అధికారులు...
నిత్యం మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి వ్యాపారం, వివిధ పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వందలాది మంది ప్రజలు వాహనాలపై మండల కేంద్రానికి వస్తూ పోతూ ఉంటారు. మండల కేంద్రంలో పటిష్ట నిఘా నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా నిఘా నేత్రాలు పని చేయడం లేదు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. ఇదే అదునుగా భావించిన దొంగలు వరుస చోరీలతో రెచ్చిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన నెక్కొండకు వివిధ పన్నుల రూపంలో భారీగానే ఆదాయం సమకూరుతున్నా సీసీ కెమెరాలకు మరమ్మతు చేయించకుండా అలసత్వం వహించడంతో మండల ప్రజలు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: గండ్రకోటి నరేందర్, బాధితుడు
ఇటీవల నా షైన్ బైక్ చోరీకి గురైంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బైక్ దొంగను కనిపెట్టడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. బైక్ పోవడంతో రూ.లక్ష వరకు నష్టపోయాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.