సంతకాలు మాత్రం రిజిష్టర్‌లో.. ఉండేది మాత్రం బయట..

by Aamani |
సంతకాలు మాత్రం రిజిష్టర్‌లో.. ఉండేది మాత్రం బయట..
X

దిశ, వరంగల్‌ టౌన్ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవినీతి, అక్రమాలకే కాదు, నిర్లక్ష్యానికి కూడా అడ్డాగా మారుతోంది. ఏకంగా అధికారులే విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి తీరు పిల్లలు అన్నట్లుగా.. సిబ్బంది కూడా అదే తరహాలో ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. దేశాయిపేట సమీపంలోని ప్రతాపరుద్ర ఫిల్టర్‌బెడ్‌లో పని చేసే సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ‘దిశ’ దినపత్రిక ఫిల్టర్‌ బెడ్‌ను సందర్శించగా ఆసక్తికర విషయాలు దర్శనమిచ్చాయి.

మొత్తం మూడు షిఫ్టుల్లో 24 మంది పని చేయాల్సి ఉన్నప్పటికీ దిశ సందర్శించిన సమయానికి ఎనిమిది మంది విధుల్లో ఉండాల్సి ఉండగా, కేవలం ఇద్దరే కనిపించారు. మిగతా ఆరుగురు ఎక్కడికి వెళ్లారో సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారు. రిజిష్టర్‌లో సంతకాలు చేసి అంతా బయటకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన అంశం... ఓ ఫిల్టర్ బెడ్ కు సంబంధించిన లాట్ బుక్ లో ఏఈ పేరిట 15వ తేదీ గల షీట్‌లో నమోదు చేసి ఉండడం గమనార్హం. మొత్తంగా ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణను బల్దియా అధికారులు నీటికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed