- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాపురం నిర్వాసితుల కష్టాలు.. ఏళ్ల తరబడి తప్పని ఎదురుచూపులు..
దిశ, మల్హర్: మల్హర్మండల కేంద్రం తాడిచర్ల-కాపురం గ్రామాల ప్రజలు జెన్కో ఉపరితల గని కోసం సాగు, ఇంటి నిర్మాణ స్థలాలు ధారాదత్తం చేశారు. అయితే కాపురం గ్రామంలో ఆదివాసి నాయకపోడు అమాయక గిరిజనులకు చెందిన ఇంటి స్థలాలు ఆబాది భూమి ఓసీపీ ప్రాజెక్టులో ముంపునకు గురైంది. నివాసం కోసం గతంలో నిర్మించిన ఇండ్లు తొలగించి ఆ గిరిజనులు వేరే చోట గూడు నిర్మించుకున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి ముల్లె ముఠా సర్దుకొని తరలివెళ్లారు. పరిహారం ఇవ్వడానికి అవార్డు పాసైనా ఇంతవరకు డబ్బులు రాకపోవడంతో గిరిజనులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. కాగా నాడు ఆ గిరిజనులు నిర్మించుకున్న ఇంటి స్థలాలు ఆబాది, కొంత శిఖం భూమి గా తేలింది. అయితే ఆ ఆబాది భూమి నష్ట పరిహారం చెల్లించేందుకు జెన్కో రెవెన్యూ అధికారులతో అవార్డు పాస్ చేయించి త్వరలోనే నష్టపరిహారం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది.
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రెవెన్యూ యంత్రాంగం ఆక్విటేషన్ మీద నిర్వాసితులతో సంతకాలు తీసుకుని నెలలు గడిచినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల, కాపురంలో బొగ్గు తవ్వకాల కోసం అన్వేషణ ప్రారంభించినప్పటి నుంచి తమకు దక్కాల్సిన వాటకోసం నిర్వాసితులు ఎన్నో మార్లు రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కంపెనీ తమకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తూ నిర్వాసితుల సమస్యలను మాత్రం పెడచెవిన పెడుతూనే ఉందని కన్నీటిపర్యంతమవుతున్నారు. బొగ్గు వెలికితీత ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాంత వాసులకు నష్ట పరిహారం చెల్లించకుండా నిర్వాసితులను నిండా ముంచుతున్నారు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తుంది జెన్కో సంస్థ.
అవార్డ్ ప్రకటించినా నిర్లక్ష్యం ఎందుకు..?
జెన్కో ఉపరితల గని పరిధిలోని కాపురం గ్రామంలో ఉన్న ఆబాది భూముల సేకరణ సమయంలో ఆరు ఎకరాల పైచిలుకు భూమిని అప్పుడు సేకరణ చేయడం అధికారులు మరచిపోయారు. దీంతో ఆ నిర్వాసితులు తమ ఇంటి స్థలాలకు పరిహారం రాలేదని ఎన్నోసార్లు అర్జీలతో మొర పెట్టుకున్న అనంతరం జెన్కో అధికారులు మళ్లీ సర్వే నిర్వహించి 3.25 గుంటల శిఖం భూమితో కలిపి 6.31 ఎకరాల భూమితో మూడేళ్ల క్రితం గెజిట్ ప్రకటన చేశారు. దీంతో నిర్వాసితులు ఇక తమకు పరిహారం అందుతుందని ఊపిరి పీల్చుకున్నారు. నత్తనడకన సాగిన ఆబాది భూమి సర్వే ప్రక్రియ చివరకు ఈ ఏడాది జూలైలో అవార్డ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం అవార్డు ప్రకటించిన పది రోజుల్లోగా నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, నాలుగు నెలలు గడుస్తున్నా పరిహారం మాట ఎత్తకుండాపోయిందని నిర్వాసిత గిరిజనులు వాపోతున్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం కింద ఎకరానికి రూ.14.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు 2024 జూలై 31న పాసైన అవార్డ్ పత్రాలు అందజేసి, అక్విటేన్షన్లపై నిర్వాసితులతో సంతకాలు తీసుకున్నారు. అవార్డు పాస్ చేసి నాలుగు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లించడంలో జెన్కో అధికారుల నిర్లక్ష్యంపై నిర్వాసితులు మండిపడుతున్నారు.
నిధులు లేక పరిహారంలో జాప్యమా?
అవార్డు కాఫీలు అందుకుని, అక్విటేషన్లపై సంతకాలు పెట్టిన నిర్వాసితులకు నిధుల లేమి కారణంగానే పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. 3ఎకరాల పై చిలుకు భూమికి సంబంధించిన 15 మంది నిర్వాసితులకు దాదాపుగా రూ.40.66 లక్షల పైచిలుకు చెల్లించాల్సింది. కాగా ఈ అవార్డ్కు సంబంధించి జెన్కో అధికారులు ఆర్టీఓ ఖాతాలో డబ్బులను జమ చేయకపోవడంతో పరిహారం చెల్లింపు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పరిహారం చెల్లింపు కోసం నిర్వాసితులు ఆర్టీఓ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నా బడ్జెట్ రాలేదంటూ రెవెన్యూ అధికారులు రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారాని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లేకుండానే అవార్డ్ కాఫీలు అందించి, అక్విటేషన్లపై తమ సంతకాలు తీసుకుని పరిహారం ఇవ్వకుండా ఇబ్బందుకు గురి చేయడమేంటని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు.
బడ్జెట్లేక ఆలస్యం..: మంగీలాల్ నాయక్ , భూపాలపల్లి ఆర్డీఓ
బడ్జెట్ లేకపోవడం, జెన్కో సంస్థ తమ అకౌంట్లో డబ్బులు జమ చేయకపోవడం పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులపై జెన్కో సంస్థకు నివేదిక ఇచ్చాం. త్వరలోనే నిర్వాసితులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
పరిహారం కోసం ఎదురుచూస్తున్నాం.. : కూర లక్ష్మి భూ నిర్వాసితురాలు, కాపురం గ్రామం
అవార్డ్ పాసై నెలలు గడుస్తున్నా ఆక్విటేషన్లపై సంతకాలు పెట్టి మూడు నెలలు గడిచింది. ఇప్పటికి నష్టపరిహారం రావడం లేదు. నాకు చెందిన 9 గంటల భూమికి పరిహారం వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా. అధికారులు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.