ఇంటి నంబర్లో మొదటి సంఖ్య మాయం..

by Sumithra |
ఇంటి నంబర్లో మొదటి సంఖ్య మాయం..
X

దిశ, డోర్నకల్ : డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం పుర వాసులకు శాపంగా మారింది. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇంటి నెంబర్లలో మొదటి సంఖ్య గల్లంతయింది. దీంతో ఇంటి పన్ను చెల్లింపుల్లో గృహాల యజమానుల పూర్తి వివరాలు అంతర్జాలంలో ఉండడం లేదు. ఉదాహరణకు 2-2-20 ఇంటి నెంబర్ కు బదులు 2-20 డిస్ప్లే అవుతుంది. ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఇతర అవసరాలకు పూర్తి నెంబరు, చిరునామా కనిపించక పురపాలక గృహవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రిజిస్ట్రేషన్ల సమయంలో అధికారులకు చెయ్యి తడపవలసి వస్తుందని వాపోతున్నారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్న వేళ పూర్తి చిరునామాతో ఇంటి నెంబర్ వచ్చేదన్నారు. అంతర్జాల అధికారుల అలసత్వం స్థానికులకు ఇబ్బందిగా పరిణమించింది. బిల్ కలెక్టర్లకు పట్టణ వాసులు సుపరిచితమే కనుక ఇంటి పన్నుల విషయంలో ఇబ్బందులు తలెత్తడం లేదు. ఇటీవల గృహాలు నిర్మించిన యజమానులకు పూర్తినెంబరు, చిరునామాతో సమాచారం వస్తుంది. కాగా ఈ సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

మున్సిపల్ మేనేజర్ నాగరాజును వివరణ కోరగా..

నూతన మున్సిపాలిటీలలో ఈ తరహా సమస్యలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పుర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను అధికమించడానికి ప్రయత్నాలు చేయనున్నట్లు తెలియజేశారు. వార్డుల వారిగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed