కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు స‌స్పెన్ష‌న్

by Kavitha |
కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు స‌స్పెన్ష‌న్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాక‌తీయ యూనివ‌ర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబుపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. యూనివ‌ర్సిటీ భూములును ఆక్ర‌మించుకుని ఇల్లు నిర్మించుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌గా తాజాగా విజిలెన్స్‌, రెవెన్యూ, కేయూ అధికారులు జాయింట్ స‌ర్వేలో నిజ‌మ‌ని తేలింది. కుమార్‌ప‌ల్లి శివారులోని కేయూ ప‌రిధిలోని 229 స‌ర్వే నెంబ‌ర్‌లో ఇల్లు నిర్మాణం చేసి.. 235 స‌ర్వే నెంబ‌ర్ ప‌రిధిలో ఉంద‌ని గ‌త కొంత‌కాలంగా ఆయ‌న వాదిస్తూ వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌రిగిన ల్యాండ్ స‌ర్వేలో కేయూ పరిధిలోని 229 స‌ర్వే నెంబ‌ర్‌లోనే ఇంటి నిర్మాణం చేశార‌ని నిర్ధార‌ణ అయింది. గ‌తంలో కేయూ ల్యాండ్ కమిటీ, హ‌న్మ‌కొండ మాజీ క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతు ఆదేశాల‌తో రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్టులోనూ ఇదే విష‌యం నిర్ధార‌ణ అయింది. అక్రమాలు నిర్ధార‌ణ అయిన నేప‌థ్యంలో బుధ‌వారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబుపై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ రిజిస్ట్రార్ మ‌ల్లారెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఆ ఇల్లు కేయూ భూమిలోనే నిర్మాణం...

కేయూ భూముల‌కు సంబంధించి సుమారు 70 ఎక‌రాల వ‌ర‌కు ఇప్ప‌టికే అన్యాక్రాంతమ‌వ‌గా.. కొత్త‌గా అక్ర‌మాలు వెలుస్తున్నాయి. అక్ర‌మ నిర్మాణాలు వెలిసిన సుమారు 15 స‌ర్వే నెంబ‌ర్ల‌లో విజిలెన్స్ అధికారులు రెవెన్యూ, జీడ‌బ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్‌, స‌ర్వేయ‌ర్‌ల‌తో క‌లిసి విచార‌ణ చేప‌డుతున్నారు. 229లో 30 వ‌ర‌కు అక్ర‌మంగా నిర్మాణాలు గుర్తించారు. ఎక‌రం 10 గుంట‌ల భూమి ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్లుగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఆక్ర‌మ‌ణ‌లపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే రిజిస్ట్రార్ మ‌ల్లారెడ్డి జీడ‌బ్ల్యూఎంసీ అధికారుల‌కు లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో గ‌త కొద్దిరోజులుగా స్త‌బ్దుగా ఉన్న విచార‌ణ‌.. తాజాగా పెండ్లి అశోక్‌బాబుపై చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డం గ‌మనార్హం. నిర్మాణం అక్ర‌మ‌మేనని గుర్తించ‌డంతో ఇక తొల‌గింపు ప్ర‌క్రియ కూడా వేగంగా ముందుకెళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. మాజీ వీసీ తాటికొండ రమేష్ హ‌యాంలో కొంత‌మంది అధికారులు ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో తాజా చ‌ర్య‌ల‌తో వారి గుండెల్లో రైల్లు ప‌రుగెడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed