ఆ వైద్యులను వెంటనే సస్పెండ్ చేయండి

by Sridhar Babu |
ఆ వైద్యులను వెంటనే సస్పెండ్ చేయండి
X

దిశ పాలకుర్తి/తొర్రూరు : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఆదేశించారు. పాలకుర్తి మండలం వావిలాల సమీపంలో రోడ్డు ప్రమాదం పట్ల పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ, బస్సు ఢీ కొని ముగ్గురు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల వివరాలను సేకరించిన ఎమ్మెల్యే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో లేని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని వైద్యాధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విధులకు హాజరుకాని వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని తెలిపారు. ఎంతమంది తనిఖీలు చేసినా వైద్యులు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని, 24 గంటలు ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను కోరారు. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించకుండా డిప్యూటేషన్ పేరుతో జనగామ ఎంసీహెచ్, మెడికల్ కళాశాలలో విధులు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులను ఆసుపత్రిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు దృష్టి పెడతానని తెలిపారు. లారీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి వైద్యులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆమె వెంట నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story