- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పత్తి ధర పతనం
దిశ, వరంగల్ బ్యూరో: గతేడాది ఊహించిన విధంగా పైపైకి ఎగబాకిన పత్తి ధర.. ఈ ఏడాది నేల చూపులు చూస్తోంది. రోజురోజుకు పతనమవుతుండడంతో పత్తి రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. ఓ వైపు పత్తి ధర పతనమవుతుంటే, మరోవైపు అప్పుల బాధను తట్టుకుంటూ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోవడం అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర రేపోమాపో పెరుగుతుందని కళ్లల్లో వొత్తులేసుకుని వేచి చూస్తున్న రైతులకు గత రెండు నెలలుగా నిరాశే ఎదురవుతోంది. మళ్లీ విత్తుకోవడానికి సన్నద్ధమవ్వాల్సిన కాలం సమీపిస్తుంటే ఇంటి నిండా పత్తిని పెట్టుకుని కూడా అమ్ముకోలేని దీనస్థితిలో రైతులున్నారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వరంగల్, ఖమ్మం మార్కెట్లలో పత్తి ఆల్ టైం రికార్డు ధరగా రూ.12 వేల వరకు స్థిరంగా అమ్మకాలు జరిగాయి. అయితే దిగుబడి పెద్దగా లేకపోవడంతో మార్కెట్లకు రాబడులు కూడా తక్కువగానే వచ్చాయి. అయితే పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనమవుతూ వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ మాసం మధ్యస్తం నుంచి పతనమవుతూ వచ్చిన ధరలు.. జనవరిలో కనిష్టంగా క్వింటాల్ పత్తి ధర రూ.7500లకు చేరడం గమనార్హం. ప్రస్తుతం ఎనుమాముల మార్కెట్‌లోకి క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.7300 కాగా కనిష్ట ధర రూ.6500గా ఉంది.
ఇదీ ఉమ్మడి జిల్లాలో సాగు లెక్క..!
జనగామ జిల్లాలో 1,40,375, వరంగల్ జిల్లాలో 1,28,200, మహబూబాబాద్ జిల్లాలో 91,385 హన్మకొండ జిల్లాలో 87,102, భూపాలపల్లి జిల్లాలో 95,637, ములుగు జిల్లాలో 26,303 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏక మొత్తంలో చూసుకుంటే 5,69,502 ఎకరాల్లో సాగవుతోంది. ఎకరాకు ఆరు క్వింటాళ్ల చొప్పున దిగుబడిని అంచనా వేసిన అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,41,741 టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 1.50లక్షల టన్నులకు లోబడే అమ్మకాలు జరిగినట్లుగా మార్కెటింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు సగానికి పైగా పత్తి రైతుల వద్దనే ఉండడం గమనార్హం.
రంగు మారుతోందని ఆందోళన..!
పత్తికి ధర ఇంకా పెరిగే అవకాశముందని, రైతులు తొందరపడి అక్టోబర్, నవంబర్‌లోనే పంటను అమ్ముకోవద్దని వ్యవసాయాధికారులు సూచించారు. మార్కెట్ పరిస్థితులను, వ్యవసాయశాఖ సూచలను నమ్మి పత్తి దిగుబడులను రైతులు నవంబర్ మొదలు ఇప్పటి దాకా తమ ఇళ్లలోనే నిల్వ ఉంచారు. ఇప్పటికే మూడు నెలలుగా రైతులు ఇంట్లోనే పత్తిని నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే నిల్వ చేసుకుంటున్న పత్తి రంగు మారుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు పత్తి నాణ్యత దెబ్బతింటోందని మార్కెట్‌కు తీసుకొచ్చి తక్కువ ధరేనని తెలిసి కూడా అమ్మకం చేసుకుంటున్నారు.