డాక్ట‌ర్ సైఫ్ అరెస్ట్‌.. ప్రీతిని అవ‌మానించేలా వాట్సాప్‌లో మెసేజ్‌లు

by samatah |
డాక్ట‌ర్ సైఫ్ అరెస్ట్‌.. ప్రీతిని అవ‌మానించేలా వాట్సాప్‌లో మెసేజ్‌లు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్ర‌ీతీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో సీనియ‌ర్ విద్యార్థి డాక్ట‌ర్ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్త‌వానికి రెండు రోజుల క్రిత‌మే సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండ‌గా, అరెస్ట్ చేసిన‌ట్లుగా శుక్ర‌వారం ఉద‌యం వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కార్యాల‌య అధికారులు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నంపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా రియాక్ట‌యింది. నిందితుడు సైఫ్ ఏకంగా రాష్ట్ర హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ పేరును వాడుకుంటూ బాధితురాలిని బెదిరింపుల‌కు గురి చేసిన‌ట్లుగా ప్రీతి తండ్రి చేసిన వ్యాఖ్య‌ల‌తో ఈ ఆ ఘ‌ట‌న‌పై మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌గా మారింది. ఈనేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్వ‌యంగా రంగంలోకి దిగి కేసు ద‌ర్యాప్తుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు.

సైఫ్ వాట్సాప్ రిట్రీవ్‌..

ప్రీతి, సైఫ్ వాట్సాప్ ఛాట్‌ను రిట్రీవ్ చేశారని స‌మాచారం. ప్రీతిని అవమానించే విధంగా వాట్సాప్‌లో సైఫ్‌ ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ప్రీతి గదిలో పలు కీలక ఆధారాలను కూడా సేకరించిన‌ట్లుగా తెలుస్తోంది. విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం... ప్రీతి గదిలో మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. మత్తు మందు మోతాదుపై ఆమె గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉండ‌గా ప్రీతి తండ్రి మ‌ట్వాడ స్టేష‌న్‌లో కొద్దిరోజుల క్రిత‌మే సైఫ్‌పై ఫిర్యాదు చేయ‌గా నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లుగా బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈనేప‌థ్యంలో కేసు న‌మోదు, స‌రైన విచార‌ణ చేయ‌క‌పోవ‌డంపై ఏసీపీ బోనాల కిష‌న్ నిర్ల‌క్ష్యం వ‌హించార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తనను వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన‌ట్లు స‌మాచారం.

Advertisement

Next Story

Most Viewed