ఎక్సైజ్ అధికారుల మామూళ్ల దందా

by samatah |
ఎక్సైజ్ అధికారుల మామూళ్ల దందా
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బెల్ట్ షాపులపై దాడుల పేరుతో సీజ్ చేసిన మద్యాన్ని దొడ్డిదారిన వైన్ షాపులకు తరలిస్తున్నారని, పలు గ్రామాల్లో గీత కార్మికుల కోసం ఏర్పాటుచేసిన గుర్తింపు కార్డులలో చేతివాటం ప్రదర్శించి అనర్హులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడుంబా తరలిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకుని వాహన యజమానితో బేరం కుదుర్చుకొని తిరిగి అప్పగిస్తున్నారని ఎక్సైజ్ అధికారుల అవినీతిపై బాహాటంగానే చర్చ జరుగుతోంది.

అనర్హులకు గీతకార్మికుల కార్డులు..

గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే కల్లుగీత కార్మికుల గుర్తింపు కార్డుల్లో ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అనర్హులకు కార్డులను మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఓ గ్రామంలోని దాదాపు 20 మందికి పైగా స్థానికేతరులకు కల్లు గీత కార్మికులుగా వృత్తిలో కొనసాగని వారికి సైతం ప్రభుత్వ గుర్తింపు కార్డులను మంజూరు చేయడంలో భారీగానే ముడుపులు తీసుకున్నట్టు సమాచారం. అనర్హులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయడంతో అసలైన గీత కార్మికులకు అందాల్సిన ప్రభుత్వ రాయితీలు, పెన్షన్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని కల్లుగీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుడుంబా వాహనదారులతో..

ములుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​లో ఓ అధికారి గుడుంబా సరఫరా చేసే వాహనదారుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా వదిలేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. వెంకటాపూర్ మండలంలో ఎక్సైజ్ పోలీసులు ఇటీవల కాలంలో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా గుడుంబా సరఫరా చేసే ఎరుపు రంగు ఆల్టో కార్ ను స్వాధీనం చేసుకున్నారు. సదరు వాహన యజమాని రూ.15 వేలు ఎక్సైజ్ అధికారికి ముట్ట చెప్పడంతో కారును తిరిగి అప్పగించినట్లు స్థానికులు చెబుతున్నారు. ములుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​లో గతంలో ఒక అధికారి సీజ్ చేసిన వాహనాల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

బెల్ట్ షాప్ మద్యం.. వైన్ షాప్ లోకి..

ములుగు ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను దొడ్డి దారిన వైన్ షాపులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అక్రమంగా నిల్వచేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ధ్వంసం చేయాల్సిన ఉండగా నిబంధనలు పక్కకు పెట్టి కాగితాల్లో మాత్రమే ధ్వంసం చేసినట్లు నమోదు చేసి వైన్ షాపులకు పంపిస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed