ఇది మంచి పద్ధతి కాదు.. ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేయాలి

by Disha News Web Desk |
ఇది మంచి పద్ధతి కాదు.. ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేయాలి
X

దిశ, బయ్యారం: ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మృతుడు ముత్యాల సాగర్ కుటుంబాన్ని పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు పరామర్శించారు. ఈ పరామర్శలో పీవైఎల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రదీప్, పీడీఎస్‌యూ రాష్ర్ట కోశాధికారి ఆజాద్ పాల్గొని సాగర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముత్యాల సాగర్‌ది ప్రభుత్వ హత్యే అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని మృతుడు సాగర్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని, రైలుకింద పడి మరణించాడని అన్నారు. విషయం తెలిసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘటనపై ఆరా తీశాడని, కానీ, ఇల్లందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హర్‌సింగ్ మాత్రం ఆత్మహత్యను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని, ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేయాలని అన్నారు. రాష్ర్టంలో ఇప్పటివరకు 36 మంది నిరుద్యోగులు ప్రభుత్వ పని తీరుకు వ్యతిరేఖంగా ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. ముత్యాల సాగర్ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు..

తెలంగాణ రాష్ర్టం నిరుద్యోగుల ఆత్మ బలిదానాల వల్లనే ఏర్పడిందని, రాష్ట్రం వచ్చాక కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పీవైఎల్, పీడీఎస్‌యూ నేతలు అన్నారు. ఇకనుంచి రాష్ట్రంలో ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దని, ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ర్టంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ నాయకులు నర్సింహా రావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ నాయకుడు పృధ్వీ, ఖమ్మం పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రాకేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, నాయకులు బోస్, యాకయ్య, బిల్లకంటి సూర్యం, జగ్గన్న, ఉమ్మగాని సత్యం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed