- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీలా ఇష్టారాజ్యం.. నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాల భర్తీలో అక్రమాలు
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండు నెలల కింద ప్రారంభమైన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల దందా జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో పలు ఏజెన్సీల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది ప్రారంభమైన నర్సింగ్ కళశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉండడంతో కళాశాల ప్రిన్సిపాల్, స్టాఫ్ మూకుమ్మడిగా జిల్లా కలెక్టర్ శశాంకకు తెలిపారు.
స్పందించిన కలెక్టర్ నర్సింగ్ కళాశాలలో 27పోస్టుల నియామకానికి పలు ఏజెన్సీలకు కేటాయించారు. నియామకాల్లో రోస్టర్, స్థానికత, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా రిక్రూట్ చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా ఆయా ఏజెన్సీలు మామూళ్లు ముట్టజెప్పేవారికే అవకాశం కల్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతా మామూళ్ల మాయ..
జిల్లా ఏర్పాటైతే స్థానికంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించిన స్థానికులకు చేదు అనుభవం తప్పడం లేదు. ఒక్కొక్క పోస్ట్‌కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు బేరం కుదుర్చుకుని నియామకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా ఏజెన్సీల మాయాజాలం కొనసాగుతుంది.
కొత్త ఏజెన్సీలకు నో ఛాన్స్..
గత మూడేళ్లుగా నూతన ఏజెన్సీలకు అవకాశం కల్పించడం లేదు. ఎం ప్యానల్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో నూతన ఏజెన్సీలకు అవకాశం దొరకడం లేదు. ట్రెండర్లను ఆహ్వానించకపోవడంతో ఉన్న ఏజెన్సీల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
స్థానిక నిరుద్యోగుల ఆగ్రహం..
గిరిజన జిల్లాగా పేరుగాంచిన మానుకోటలో స్థానిక నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకున్నప్పటికీ ఒక్క ఉద్యోగ అవకాశం కూడా లభించలేదని వాపోతున్నారు. ఎంప్లాయిమెంట్ కార్డు వల్ల ఏమి ప్రయోజనం లేదని ఆవేదన చెందుతున్నారు.
చదువు ఒక్కటి.. ఉద్యోగం మరొకటి
నర్సింగ్ కాలేజీ ఉద్యోగాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేక క్వాలిఫికేషన్స్ ఉండాల్సి ఉండగా ఎటువంటి ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్స్ లేకుండానే ఉద్యోగాలను అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలు లేకున్నా ఆయా ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
స్థానిక ఏజెన్సీ లకు అవకాశం ఇవ్వాలి
జిల్లా ఏజెన్సీలకు అవకాశం కల్పిస్తే స్థానికులకు అవకాశం దొరుకుతుంది. నాన్ లోకల్ ఏజెన్సీలకు కేటాయించిన అనుమతులను రద్దు చేయాలి. జిల్లాలో చేపట్టిన నియామకాలను రద్దు చేసి పునర్నియామకం చేపట్టాలి.
- అనిల్ యాదవ్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు
అనర్హులకు ఉద్యోగాలు
అర్హులకే ఉద్యోగాలు ఇవ్వాలి. పలు ఏజెన్సీలు అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. నర్సింగ్ కాలేజీలో ఏజెన్సీల ద్వారా ఉద్యోగం పొందిన వారిని తొలగించాలి. నూతనంగా నోటిఫికేషన్ ఇచ్చి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానికులకు అవకాశం కల్పించాలి. ఉద్యోగ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి.
- యాకయ్య, పీవైఎల్ జిల్లా కార్యదర్శి
మాకు సంబంధం లేదు
నూతనంగా నర్సింగ్ కళాశాలలో మొదటి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అందుకు గాను కావాల్సిన నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం జిల్లా కలెక్టర్ శశాంకకు తెలియజేశాం. సుమారు 20కి పైగా ఉద్యోగాలను ఏజెన్సీల ద్వారా భర్తీ చేశారు. ఉద్యోగాల నియామకంలో మా పాత్ర ఏమీ లేదు.
- నీలా, ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల
స్థానికులకు అవకాశం ఇవ్వాలి
జిల్లాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలని ఆయా ఏజెన్సీలకు తెలిపాం. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు ఏజెన్సీలకు నర్సింగ్ కళాశాలలో అవసరం ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించాం. ఎటువంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటాం.
- రామకృష్ణ, జిల్లా ఉపాధి అధికారి