పీఏసీఎస్‌‌లో స్కాంపై విచార‌ణేది..?

by Mahesh |
పీఏసీఎస్‌‌లో స్కాంపై విచార‌ణేది..?
X

కంచనపల్లి పీఏసీఎస్‌లోని అవినీతి అక్రమాలపై విచారణలో ఉన్నతాధికారులు నాన్చివేత ధోర‌ణిని అవలంభిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్షం రోజులుగా కలెక్టర్ సహా డీసీఎస్ అధికారులకు స్థానికులు, పీఏసీఎస్ రైతులు, పలువురు డైరెక్టర్లు నేరుగా ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. విచారణకు గడువు తీసుకుని కాగితాలపై కాకి లెక్కలను సెట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సీఈవో, చైర్మన్, అధికార పార్టీకి చెందిన కొందరు డైరెక్టర్లు పెద్ద ఎత్తున బ్యాంకులో జమైన కమిషన్ సొమ్మును నొక్కేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం చేద్దాంలే.. చూద్దాంలే.. అనే సాగదీత ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.80 లక్షలకు పైగా ప్రాథమిక సహకార సంఘం ఖాతా నుంచి డబ్బు విడిపించినట్లు తెలుస్తుండగా అందులో రూ.53 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపగా మిగతా సొమ్ము ఏమైనట్టు? ఎవరు కాజేశారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విచారించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్వయంగా డైరెక్టర్లే వాపోతున్నారు. ఈ క్రమంలో డీసీఎస్ అధికారులు, జిల్లా బ్యాంక్ అధికారుల పాత్రపైన పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహకార బ్యాంకు అధికారులతో కాకుండా ఇతర విభాగాల అధికారులతో విచారణ చేస్తే కానీ అక్రమాల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

దిశ, జనగామ : కంచనపల్లి పీఏసీఎస్‌లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయడంలో డీసీఎస్ బ్యాంకు ఉన్నతాధికారులు నాన్చివేత ధోర‌ణిని అవలంభిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్షం రోజులుగా జిల్లా కలెక్టర్ సహా డీసీఎస్ అధికారులకు స్థానికులు, పీఏసీఎస్ రైతులు, పలువురు డైరెక్టర్లు నేరుగా ఫిర్యాదు చేసినా ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అధికార యంత్రాంగం అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా గడువు తీసుకొని కాగితాలపై కాకి లెక్కలను సెట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సీఈవో, చైర్మన్, అధికార పార్టీకి చెందిన కొందరు డైరెక్టర్లు కలిసి పెద్దఎత్తున బ్యాంకులో జమైన కమీషన్ సొమ్మును నొక్కేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.

కానీ అధికారులు మాత్రం చేద్దాంలే.. చూద్దాంలే.. అనే సాగదీత ధోరణిలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లలో వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వహణ కారణంగా కంచనపల్లి సహకార సంఘానికి రూ.1.10కోట్లు రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నుంచి చైర్మన్, సీఈఓలు రూ.53 లక్షలకు పైగా పలు పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు ఇటీవల జరిగిన సమావేశంలో సీఈవో లెక్కలు చూపాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇప్పటివరకు రూ.80 లక్షలకు పైగా ప్రాథమిక సహకార సంఘం ఖాతా నుంచి డబ్బు విడిపించినట్లు సమాచారం. రూ.53 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపగా, మిగతా సొమ్ము ఏమైనట్టు? ఎవరు కాజేశారు? అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.

జిల్లా సివిల్ సప్లై విభాగం నుంచి మూడేళ్లలో ఇప్పటివరకు సహకార సంఘానికి రూ.80 లక్షలకు పైగా మంజూరైనట్లు రైతులు తీసుకున్న సమాచార దస్త్రాలను బట్టి స్పష్టమవుతుంది. అంటే దాదాపు రూ.80లక్షల పైచిలుకు బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందన్నమాట. దీనిపై విచారించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్వయంగా డైరెక్టర్లే వాపోతున్నారు. దీంతో డీసీఎస్ అధికారులు, జిల్లా బ్యాంక్ అధికారుల పాత్రపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ల ఆరోపణలపై జిల్లా సహకార బ్యాంకు సంబంధించిన అధికారులతో కాకుండా ఇతర విభాగాలకు చెందిన అధికారులతో విచారణ చేపడితే నగదు లావాదేవీల అక్రమాల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

డబ్బు తీసి.. ఖాతాలు క్లోజ్ చేసి..

కంచనపల్లి సహకార సంఘానికి రెండు పర్సనల్ ఖాతాలు ఉన్నాయి. ఒకటేమో కంచనపల్లి గ్రామానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌లో, మరొకటేమో జిల్లా సహకార బ్యాంకులో. అయితే ఇటీవల కాలం వరకు ఖాతాను సహకార సంఘం పలు సందర్భాల్లో ఆపరేట్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని క్లోజ్ చేశారు. దీని పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2022 వార్షిక సంవత్సరం వరకు ఈ ఖాతా చలామణిలో ఉండి, యాక్టివ్‌గా పనిచేసింది. దాదాపు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యన కమిషన్ ఈ ఖాతాలో జమ కాగా దానిని విడిపించారు.

ఈ బ్యాంకులో సొమ్మును విడిపించింది ఎవరు? విడిపించిన సొమ్ము దేనికోసం ఖర్చు చేశారు? నగదును విడిపించిన తర్వాత ఖాతాలను ఎందుకు క్లోజ్ చేశారు? సాక్షాలు తారుమారు చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని క్లోజ్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో ఇప్పటివరకు డీసీఎస్ ఉన్నతాధికారులు విచారణ సాగించాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా ఇటువంటి అంశాలపై అటు డీసీఎస్‌ గానీ, జిల్లా బ్యాంక్ అధికారులు కానీ దృష్టి సారించకపోవడం విచారకరం. ఖాతాను క్లోజ్ చేయడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై కూడా జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.

కాగితాలపై కాకి లెక్కలు...

కంచనపల్లి ప్రాథమిక సహకార సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలను తెలుసుకున్న ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు అవకాశం ఇచ్చి కాగితాలపై కాకి లెక్కలు చూపి అంతా సరిగానే ఉంది అనే విధంగా పత్రాలు రెడీ చేసుకునేందుకు విచారణను కాలయాపన చేస్తున్నారని తెలుస్తోంది. ఏకకాలంలో డైరెక్టర్లు, చైర్మన్, సీఈఓ సమక్షంలో విచారణ చేపట్టాల్సి ఉండగా, దాదాపు పక్షం రోజులపాటు, కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాలయాపన చేయడం వల్ల కొందరు అధికారులు రికార్డులు సరి చేసుకునేందుకు అలర్ట్ చేశారని, లేకపోతే ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు ఎందుకు స్పందించలేదు? అనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న.

సహకార సంఘం పరిధిలో కొత్తగా మంజూరైన పెట్రోల్ పంపు నిర్మాణం కోసం రూ.8లక్షలు, సిమెంట్ బ్రిక్స్ రెడీమేడ్ వాల్ నిర్మాణం కోసం రూ.6లక్షలు, సహకార వ్యవసాయ భూమి పట్టాదారు పాసుపుస్తకాల కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు చూపుతున్నా వాటిలో కూడా అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష డైరెక్టర్లు విమర్శిస్తున్నప్పటికీ పట్టించుకున్న వారే లేరు. వీటన్నిటికీ సంబంధించి రసీదులు, చలాన్లు లేకపోవడం ఆడిట్ అధికారుల, డీసీఎస్ ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా?

సహకార సంఘంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు డైరెక్టర్లు, స్థానికులు ఫిర్యాదు చేస్తే గాని అధికారులు స్పందించకపోవడం బాధాకరం. బ్యాంకులో అక్రమాలు జరిగినట్లు డైరెక్టర్లు గొంతు చించుకుని రోడ్డెక్కే వరకు అధికారులకు అక్రమాలు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అంటున్నారు. ఫిర్యాదు చేసిన అనంతరం వెంటనే స్పందించారా అంటే అది లేదు. పక్షం గడువు తీసుకొని తాపీగా విచారణ చేస్తామన్నట్లుగా వివరించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటా అని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

అందువల్ల డైరెక్టర్లు ఆరోపించినట్లుగా బ్యాంకులో అక్రమాలు ఏ మేరకు చోటు చేసుకున్నాయి? అనే దానిపై నిగ్గు తేల్చాలంటే జిల్లా అధికారులు వేగం పెంచి విచారణ చేపట్టి ఈ అవినీతి ఆరోపణల బాగోతానికి త్వరితగతిన పుల్ స్టాప్ పెట్టకపోతే జిల్లా అధికారులు మరింత అప్రతిష్ట మూటగట్టుకునే అవకాశం ఉంది. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టి, జిల్లా ఇతర శాఖల ఉన్నతస్థాయి అధికారులతో విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

అక్రమాలకు అడ్డాగా సహకార బ్యాంక్..

కంచనపల్లి సహకార సంఘంలో గత కొన్నేళ్లుగా వరుసగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా డీసీఎస్ ఉన్నతాధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. గతంలో పనిచేసిన ఒక చైర్మన్ కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి విచారణలో బట్టబయలు కాగా మింగిన సొమ్మును కక్కించారు. గతంలో కాల్ చేసిన సొమ్మును ఏ విధంగా ప్రభుత్వం బాధ్యులను గుర్తించి రికవరీ చేసిందో అదే మాదిరిగా ఇప్పుడు కూడా తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అవినీతికి అలవాటు పడిన కొందరు అధికారులు అవసరమైతే తిరిగి చెల్లిస్తాం అన్నట్లుగా ఉన్నట్లు సమాచారం. అటువంటి వారిపై శాఖా పరమైన వేటు వేయాలని లేకపోతే, ఇదే ఆనవాయితీ మళ్లీ కొనసాగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story