మూగబోయిన మగ్గం.. అందమైన చీరల వెనుక దాగి ఉన్న కన్నీరు

by Anjali |
మూగబోయిన మగ్గం.. అందమైన చీరల వెనుక దాగి ఉన్న కన్నీరు
X

దిశ, లింగాలఘణపురం: అగ్గిపెట్టెలో చీరలు పెట్టి ప్రపంచానికి చూపిన నేతన్న నేడు చిన్నబోయిండు. రంగురంగుల డిజైన్లతో కళా నైపుణ్యాన్ని సృష్టించి చేనేత రంగానికి వన్నెతెచ్చిన పద్మశాలీల మరమగ్గలు మూగబోతున్నాయి. మరమగ్గాలతో పాటు ఆన్​లైన్​వ్యాపారాలు జోరందుకోవడంతో చేనేత కార్మికుల బతుకుల్లో చీకటికి నెలకొంది. కుటుంబమంతా కష్టపడ్డా మూడు పూటలు తిండికి సరిపోని దయనీయ స్థితి నెలకొంది. దీంతో నమ్ముకున్న కులవృత్తిని విడిచి బతుకుదెరువు కోసం వలసబాటపడుతున్నారు. నేడు గ్రామాల్లో 40ఏళ్ల పైబడిన వారు మాత్రమే మగ్గాలు నేస్తూ అష్ట కష్టాలు పడుతూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక రెక్కాడితేగానిడొక్కాడని దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

పెట్టుబడి కూడా రావడం లేదు..

తాతలు తండ్రుల నుంచి వచ్చిన కులవృత్తిని నమ్ముకుంటే కుటుంబం గడవం కష్టంగా మారిందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిన కష్టానికి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలాగైతే మగ్గం నేసి బతికెదెలా అంటూ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాత్మకమైన డిజైన్లతో నాణ్యమైన పట్టుతో మగ్గంపై చేతితో నేసే చీరను మహిళలు ఎంతగానే ఆదరించేవారు. కానీ నేడు మరమగ్గంతో పాలిస్టర్ చీరలపై అందమైన డిజైన్లు రావడంతో చేనేత పట్టు చీరలపై మహిళకు మోజు తగ్గింది. దీనికి తోడు చీరల తయారీకి ఉపయోగించే పట్టుదారం ముడి సరుకు ధరలు భారీగా పెరిగాయి. దీంతో అధిక ధర చెల్లించి ముడిసరుకు కొనుగోలు చేసినప్పటికీ చీరల ధరలు మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. కొంత మంది దళారులు కుమ్మక్కై చీరల ధరలు పెంచకుండా నేతన్నల కష్టాన్ని దోచుకుని లాభాలు గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 6 నెలలుగా చీరల గిరాకీ లేకపోవడంతో తెచ్చిన అప్పులకు మిత్తి కట్టలేక పూట గడవడం కష్టమవుతోందని చేనేత కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేనేత వృత్తి అంతరించిపోనుందా?

చేనేత వృత్తిని తమ పిల్లలకు నేర్పాలంటే భయమేస్తుందని పలువురు వాపోతున్నారు. ఒకప్పుడు ఎంతో వైభంగా బతికిన పద్మశాలీలు నేడు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. తాతలు తండ్రులు పట్టు మగ్గాలను నమ్ముకుని బతికారు కానీ, నేడు చేనేత మగ్గాలు కళతప్పాయి. కులవృత్తిని భావితరాలకు అందిస్తే వారి జీవిత అంధకారం అవుతాయన్న భయంతో తమ పిల్లలకు నేర్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలకు వెళ్లి వివిధ షాపులు, కంపెనీల్లో పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని వాపోతున్నారు.

పెరిగిన ముడి సరుకు ధరలు..

గతంలో కిలో పట్టు దారం రూ.3,200 ఉండగా ఒక చీర రూ.4 వేల ధర పలికేది. కానీ ప్రస్తుతం కిలో పట్టు దారం రూ.4,200 కాగా, చీర రేటు మాత్రం రూ.3 వేల మాత్రమే ఉంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీ అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కుల వృత్తులు అంతరించిపోతే మానవ మనుగడకు పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చేతివృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

జీఎస్టీ ఎత్తివేసి సబ్సిడీ అందించాలి..

చేనేత రంగం కనుమరుగుకాకుండా ప్రభుత్వం ముడి సరుకుపై జీఎస్టీని తొలగించాలి. నూలు, రసాయనాలు, కాటన్, పట్టు మాలుపై 10శాతం సబ్సిడీ అందించి కార్మికులను ప్రోత్సహించాలి. అప్పుడే మా పిల్లలు కూడా చేనేత రంగం వైపు మొగ్గు చూపుతారు. టెక్స్​టైల్స్ పార్కులను ఏర్పాటు చేసి చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలి.

– బిట్ల నాగభూషణం, చేనేత సహకార సంఘం చైర్మన్, లింగాల ఘణపురం

వృత్తిపై నేటి తరం అనాసక్తి

రోజుకు 15 గంటలు చేనేత వృత్తి నమ్ముకుని జీవిస్తూ ఉంటే పూట గడవని పరిస్థితి. అందుకే మా పిల్లలను ఈ వృత్తికి దూరం పెట్టాను. చేనేత కార్మికుల చేనేత మిత్ర కింద పురుషులకు రూ.2 వేలు, మహిళలకు రూ. 500 చెల్లించేది. రెండు నెలలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. చేనేత భద్రత పొదుపు పథకం రాయితీ అందించి పద్మశాలీలను ఆదుకోవాలి

–బేతి శ్రీనివాస్, చేనేత కార్మికుడు, వడ్డిచెర్ల

భార్యా భర్తలం పనిచేసినా..

మాది నిరుపేద చేనేత కార్మిక కుటుంబం. భార్యాభర్తలం ఇద్దరం చెరొక్క మగ్గం నేసినప్పటికీ పిల్లలను చదివించలేకపోతున్నాం. కాటన్ చీరలు నేసినా మా కష్టానికి ప్రతిఫలం లేదు. అందుకే ప్రభుత్వం పద్మశాలీలకు ప్రత్యేక నిధిని కేటాయించాలి. కనుమరుగవుతున్న చేనేత రంగానికి ప్రాణం పోయాలి.

–పసునూరి కృష్ణవేణి, చేనేత కార్మికురాలు, వడ్డిచర్ల గ్రామం

Advertisement

Next Story

Most Viewed