రైతు సంక్షేమమే మా లక్ష్యం : కడియం శ్రీహరి

by Aamani |
రైతు  సంక్షేమమే మా లక్ష్యం : కడియం శ్రీహరి
X

దిశ,లింగాల గణపురం : రైతు శ్రేయస్సు, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని వనపర్తి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని దొడ్డు వడ్ల కొనుగోలు కోసం ఒకటి, సన్న వడ్ల కొనుగోలు కోసం మరొకటి ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఇబ్బందులు ఉండవన్నారు. దొడ్డు వడ్లకు క్వింటాలుకు రూ. 2300, సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 2320 అదనంగా సన్నవడ్లకు మాత్రమే క్వింటాలుకురూ. 500 ల బోనస్ కూడా చెల్లిస్తుందన్నారు.

రూ. 25 వేల కోట్లు సమకూర్చాం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సన్న వడ్లకురూ. 500 ల బోనస్ అందిస్తామని హామీ ఇచ్చామని, రైతులు ధాన్యం విక్రయించిన రెండు మూడు రోజుల్లోనే వారి అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. అందుగ్గాను సివిల్ సప్లై కార్పొరేషన్ వారికి వివిధ బ్యాంకుల ద్వారా రూ. 25 వేల కోట్లు సమకూర్చడం జరిగిందన్నారు. 48 లక్షల మంది రైతులకు రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వదే అన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ కాలేదని, త్వరలో వారికి కూడా రుణమాఫీ అవుతుందని రైతులు నిరాశ చెందవద్దన్నారు. రెండు లక్షల పైన రుణం తీసుకున్న వారు కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం కొన్ని విధివిధానాలను రూపొందిస్తుంది. అది రాగానే వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందన్నారు.

సన్నబియ్యం అందించేందుకే...

ప్రజా పంపిణీ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించిన లక్ష్యంతో మన ముఖ్యమంత్రి సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు క్వింటాలుకు 500 ల రూపాయల బోనస్ ప్రకటించారన్నారు. రైతులను ప్రోత్సహించడం వల్ల పాఠశాల విద్యార్థులకు, గురుకులాల కూడా సన్న బియ్యం అందించడానికి దోహదపడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, అధికారులను ఐకెపి సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు, డీఆర్డీఏ పీడీ వసంత, ఏవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఆర్ ఐ కిషోర్,ఏపీఎం శంకరయ్య, జనగామ వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed