కాటారంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే డీ. శ్రీధర్ బాబు

by Kalyani |
కాటారంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే డీ. శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం: కాటారంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే డీ.శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాలలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్, హైదరాబాద్ లో మున్నూరు కాపు భవన్ నిర్మాణం, అలాగే అన్ని జిల్లా కేంద్రాలలో వసతిగృహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తమ సమస్యలను శాసనసభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు కాటారం, మల్హర్ మండలాలకు చెందిన మున్నూరు కాపు వర్గాలు శనివారం శ్రీధర్ బాబును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంథని నియోజకవర్గం కమాన్ పూర్ లో జేఎన్టీయూ, కాటారంలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలతో పాటు ప్రతీ మండలంలో జూనియర్ కళాశాల, మహాదేవ్ పూర్ లో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయించామని తెలిపారు. ఎవరు ఏ కులంలో పుట్టాలని నిర్ణయించుకొని ఈ లోకంలోకి రారని అది దైవ నిర్ణయమన్నారు. కానీ కొందరు కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వారిని ప్రజలు గమనించి కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి సోదరభావంతో జీవించాలని సూచించారు. రానున్న కాలంలో మంథని నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తానని వివరించారు.

బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజనులు అభివృద్ధి లోకి రావాలంటే ముందుగా వారు విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు. అందుకోసమే మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలవారీగా విద్యావకాశాలను, సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు పి.సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజయ్య, ప్రభాకర్ రెడ్డి, మున్నూరు కాపు నేతలు కొట్టె శ్రీశైలం, శ్రీహరి, చీమల రాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బొడ్డు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed