డ్రైపోర్టుకు డోర్నకల్ అనుకూలం.. కల నెరవేరేనా..?

by Nagam Mallesh |
డ్రైపోర్టుకు డోర్నకల్ అనుకూలం.. కల నెరవేరేనా..?
X

దిశ, డోర్నకల్:డ్రైపోర్టు ఏర్పాటుకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ అన్నివిధాలుగా అనువైన ప్రాంతమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా జిల్లాకు బయ్యారం ఉక్కుకర్మాగారం ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అదే చట్టంలో పొందుపర్చిన తెలంగాణ గూడ్స్ రవాణాకు అనువుగా ఉండే డ్రైపోర్టు ఏర్పాటు అంశం మరోమారు తెరమీదకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రైపోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. డ్రైపోర్టుకు ప్రధానంగా పోర్టు, రైలు, రోడ్డు మార్గాలు అన్నివైపులా కనెక్టివిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గోదాముల ఏర్పాటు, జాతీయ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారుల నిబంధనల మేరకు ఉండాలి. సుమారు 200లకు పైగా ఎకరాల భూమి ఉండాలి. దీనికి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అనువుగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

డ్రైపోర్టు ముఖ్య భూమిక

దేశానికి సముద్రపు మార్గాల ద్వారా ఓడరేవులకు చేరుకున్న గూడ్స్‌ను వివిధ ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గం గుండా తరలిస్తుంటారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలను, సుంకాలను కేంద్రప్రభుత్వం పరిధిలో ఉండే సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షిస్తుంటుంది. విదేశాలకు ఎగుమతులు, దిగుమతుల ద్వారా వచ్చిన సరుకులను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గోదాంలలో నిల్వ చేసి, ఆయా సరుకులు కస్టమ్స్‌ తనిఖీల అనంతరం రవాణాకు అనుమతులు తీసుకునే అవకాశాలుంటాయి. ఈ డ్రైపోర్టు ఏర్పాటు తెలంగాణకు విభజన చట్టంలో పొందుపర్చి ఉంది. దాంతో దీని ఏర్పాటు ప్రక్రియ గతంలోనే ప్రారంభిద్దామనుకున్నా అంతలా అనువైన ప్రాంతం దొరకలేదు. భూ, భౌగోళిక సమస్యలతో జాప్యం ఏర్పడింది.

డోర్నకల్ నుంచి కనెక్టివిటీ ఈజీ..

డ్రైపోర్టు ఏర్పాటు చేయాల్సి వస్తే తెలంగాణ జిల్లాల సరిహద్దు ఉత్తర, దక్షిణ రైలు మార్గాల నడుమ ఉన్న డోర్నకల్‌ రైల్వేస్టేషనే కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. డోర్నకల్‌లో రైల్వేకు సంబంధించి సుమారు 150 నుంచి 200 ఎకరాల వరకు భూములు ఉండడం, ఒకవేళ ఇవి కూడా సరిపోకపోతే ప్రభుత్వం సేకరించేందుకు అనువుగా డోర్నకల్‌ చుట్టూ భూములు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కాకినాడ పోర్టు కనెక్టివిటీకి కూడా అన్ని మార్గాలు ఉన్న ప్రాంతం. డోర్నకల్‌ ద్వారా రోడ్డు మార్గంలో ఏన్కూరు, తల్లాడ, సత్తుపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ప్రయాణిస్తే కాకినాడ పోర్టకు చేరుకోవచ్చు. మరోపక్క తిరువూరు, నూజీవీడు, హనుమాన్‌ జంక్షన్‌ నుంచి మచిలీపట్నం పోర్టు వస్తుంది. చెన్నై, కోల్‌కత్తా జాతీయ రహదారి ద్వారా విశాఖపట్టణం, గంగవరం, కృష్ణపట్నం రేవులకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతులు చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నూతనంగా నిర్మాణమవుతున్న నాగ్‌పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేవలం 10 కి.మీ. జాతీయ రహదారి 365ఏకు 15 కి.మీ. జాతీయ రహదారి 563కి 35 కి.మీ. సమీపంలో ఈ జంక్షన్ ఉంది. అంతేకాకుండా రైలు మార్గాల ద్వారా ఉత్తర, దక్షిణ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉండటం మరింత కలిసొచ్చే అంశం. కొత్తగా మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు కూడా రైల్వే‌లైన్ ప్రారంభించటంతో డోర్నకల్ నుంచి పూర్తిగా అన్నివైపులా రైలు ద్వారా గూడ్స్ తరలించే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి.

వేల మందికి ఉపాధి అవకాశాలు

ఎన్నో ఏళ్లుగా బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో ఉపాధి లభిస్తుందని ఎదురుచూస్తున్న ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు.. డ్రైపోర్టు ఏర్పాటైతే ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది. ఏడాదిపాటు నిరంతరాయంగా పోర్టులో కుటుంబాల వారీగా పని లభిస్తుంది. దీంతో అన్నిరంగాలకు సంబంధించి మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. బయ్యారం సాధన చేయలేపోయిన బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించిన ఈ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా యువతకు ఉపాధి లభించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడే ఈ డ్రైపోర్టు డోర్నకల్‌లో ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed