ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కొరత‌..!

by Mahesh |
ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కొరత‌..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: క‌రోనా కేసులు పెరుగుతున్న త‌రుణంలో వ్యాక్సిన కొర‌త వైద్య ఆరోగ్యశాఖ‌ను కంగారు పెట్టిస్తోంది. మార్చి 31లోపే దాదాపు అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ పూర్తిగా ఖాళీ అవ‌డంతో ఇప్పుడు బూస్టర్ డోసు కోసం వెళ్లిన వారికి మ‌ళ్లీ రావాల‌ని వైద్య కేంద్రాల్లో సిబ్బంది సూచిస్తున్నారు. గ‌త రెండు వారాలుగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో కేసుల న‌మోదు సంఖ్య క్రమంగా పెరుగుతూ వ‌స్తున్నాయి. దీంతో ఆందోళ‌న చెందుతున్న ప్రజ‌లు వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి ఆయా ప్రభుత్వ వైద్య కేంద్రాల‌కు త‌ర‌లివెళ్తున్నారు.

వ్యాక్సిన్ కొర‌త ఉంద‌ని చెబుతున్న జిల్లాల వైద్యాధికారులు ప్రభుత్వానికి విష‌యాన్ని తెలియ‌జేయ‌డం జ‌రిగింద‌ని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్లడిస్తుండ‌టం గ‌మనార్హం. వ్యాక్సిన్‌ను సొంతంగా స‌మ‌కూర్చుకోవాల‌ని ఇటీవ‌ల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వ‌ద్ద ఇప్పటికీ స‌రైన ప్రణాళిక లేద‌న్న విమ‌ర్శలు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. సంవ‌త్సరం త‌ర్వాత ఉమ్మడి జిల్లాల్లో రోజూ వారీ కేసుల సంఖ్య అంకెల నుంచి సంఖ్యల్లోకి చేరుకుంటుండ‌టం జ‌నాల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజ‌న బాలుర గురుకుల పాఠ‌శాల‌లో ఒకేరోజూ 15 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. మ‌రు నాడు హ‌న్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ‌లో ప‌నిచేస్తున్న మ‌రో ఇద్దరికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగింది. ఇలా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వారిని ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా ఆదేశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed