కమ్యూనిస్టులు దేవుళ్లకు వ్యతిరేకం కాదు: Chada Venkat Reddy

by S Gopi |   ( Updated:2023-01-14 07:56:10.0  )
కమ్యూనిస్టులు దేవుళ్లకు వ్యతిరేకం కాదు: Chada Venkat Reddy
X

దిశ, భీమదేవరపల్లి: కమ్యూనిస్టులు దేవుళ్లకు వ్యతిరేకం కాదని, దేవుళ్లను నమ్ముతారని, దేవున్ని నమ్మడం అనేది మానవతా సిద్ధాంతం అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కొత్తకొండ వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కిషన్ రావు, అభివృద్ధి కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి కండువాతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

మానవ అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని, ఆ దిశగా తమ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరు అని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని.. ఇది సబబు కాదని ఆయన అన్నారు. సమాజంలో నాస్తికులు, ఆస్తికులు ఉంటారని... మతం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని తెలిపారు. మతం పేరుతో, కులం పేరుతో ఆధిపత్యం చెలాయించాలని మత ఉన్మాదులు ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకు కమ్యూనిస్టులు వ్యతిరేకమని తెలిపారు. 2010లో వీరభద్ర స్వామి దేవస్థానానికి వచ్చి కొత్తకొండలో హరిత హోటల్, యూనియన్ బ్యాంకు కావాలని కోరి తన పలుకుబడి ఉపయోగించి మంజూరు చేయించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రి భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, రాములు, మంచాల రమాదేవి, తిరుపతి, వెంకటేష్, గొర్రె బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed